ట్రంప్‌కు భయం పట్టుకుందా? మళ్లీ అదే పాత అస్త్రం తీసారు!
ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌లో ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తన మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు మళ్లీ జనంలోకి పరుగులు తీయాల్సిన పరిస్థితి కనపడుతోంది. మొన్నటి వరకూ ప్రచార సభలతో హోరెత్తించిన ట్రంప్.. మధ్యలో కొన్ని ర్యాలీలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుని, మళ్లీ మనసు మార్చుకున్నారు. తన పాత అస్త్రాన్నే బయిటకు తీసారు. ఆ అస్త్రం మీదే నమ్మకం పెట్టుకున్నారు. అదేమిటి..అసలు ఈ స్ట్రాటజీ మార్చటం వెనక ఉన్న కారణం ఏమిటి… ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలా? సొంత మద్దతుదారుల్లో తగ్గుతున్న ఉత్సాహమా? లేక ఎన్నికల ఫలితంపై పెరుగుతున్న ఆందోళనా? 80 ఏళ్ల వయసులోనూ అమెరికా అంతటా ప్రచారానికి సిద్ధమవుతున్న ట్రంప్ చర్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.
ఎన్నికల బరిలో గెలుపు అంత ఈజీ కాదా?
ట్రంప్ ఈసారి ఇంతగా ప్రచారంపై దృష్టి పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు రిపబ్లికన్ పార్టీకి కీలకంగా మారాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే రిపబ్లికన్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో డెమొక్రాట్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా అయోవా, కాన్సాస్ వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు పోటీ అనుకున్నదానికంటే కఠినంగా మారింది. దీంతో సాధారణంగా తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో కూడా ట్రంప్ స్వయంగా ప్రచారానికి దిగాల్సి వస్తోంది.
28 రోజులుగా ప్రచారమే.. అయినా ట్రంప్‌కు విశ్రాంతి దొరకట్లేదా?
అక్టోబర్ నెలలో ట్రంప్ వరుసగా ప్రచార సభలు నిర్వహిస్తూ దేశమంతా చుట్టేశారు. ఒక దశలో 30కి పైగా ర్యాలీలు నిర్వహించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లారు. అయితే అక్టోబర్ 29 నాటికి ఆయన 25 సభలే నిర్వహించారు. వరుస పర్యటనలు, సుదీర్ఘ ప్రసంగాలతో ఆయన గొంతు కూడా అలసిపోయింది. అక్టోబర్ 30న ఫ్లోరిడాలోని డేటోనా బీచ్ సభలో మాట్లాడుతూ.. 28 రోజుల పాటు ఇలా ప్రచారం చేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. ఇక ఇదే చివరి సభ అనుకున్నానని, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చని భావించానని కూడా చెప్పారు.
రద్దు చేసిన సభలను మళ్లీ ఎందుకు తెరపైకి తెచ్చారు?
అయోవా, కాన్సాస్ పర్యటనలను రద్దు చేసినప్పుడు రిపబ్లికన్ నేషనల్ కమిటీ మరో ప్రణాళికను ప్రకటించింది. దాదాపు 20 రాష్ట్రాల్లో టెలీ ర్యాలీలు నిర్వహించి, ఫోన్ ద్వారా ఎక్కువ మంది ఓటర్లను చేరుకోవాలని భావించింది. దీనివల్ల ట్రంప్ ఒకేసారి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంటుంది.
కానీ ఒక్కరోజులోనే పరిస్థితి మారిపోయింది. రద్దయిన సభలను మళ్లీ షెడ్యూల్ చేశారు. నవంబర్ 1న అయోవా, కాన్సాస్‌లో వరుసగా ప్రత్యక్ష ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. టెలీ ర్యాలీలతో పాటు ఈ సభలు కూడా కొనసాగుతాయని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. స్థానిక రిపబ్లికన్ ప్రచార బృందాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ మార్పు జరిగిందని ట్రంప్ కూడా ఫ్లోరిడా సభలో వివరించారు.
ట్రంప్‌కు ఇప్పుడు పాత అస్త్రమే కీలకం!
ట్రంప్ రాజకీయాల్లో MAGA మద్దతుదారులకు ప్రత్యేక స్థానం ఉంది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే నినాదంతో ఆయన చుట్టూ ఏర్పడిన ఈ మద్దతు వర్గం.. ఆయన ప్రచారానికి ప్రధాన బలంగా నిలుస్తోంది. భారీ ర్యాలీలకు తరలిరావడం, ఆయన ప్రసంగాలకు స్పందించడం, ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం ఈ వర్గం ప్రత్యేకత. ఇప్పుడు ట్రంప్ ముందున్న లక్ష్యం కూడా ఈ మద్దతును కేవలం సభలకే పరిమితం చేయకుండా ఓటింగ్ వరకు తీసుకెళ్లడం.
అందుకే తాను పోటీ చేస్తున్న వ్యక్తిగత ఎన్నిక కాకపోయినా, రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఓటర్లు తమ స్థానిక అభ్యర్థులను మాత్రమే కాకుండా, తన ప్రభుత్వ పనితీరును కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ఆయన ప్రచారంలో కోరుతున్నారు.
అసలు పరీక్ష నవంబర్ 3నే!
ఈ ఎన్నికలు ట్రంప్‌కు మరో విధంగా కూడా కీలకం. రిపబ్లికన్లు కాంగ్రెస్‌లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారా? లేక డెమొక్రాట్లు మెజారిటీ సాధించి ట్రంప్ ప్రభుత్వంపై మరింత రాజకీయ ఒత్తిడి తీసుకొస్తారా? అన్నది తేలనుంది. మరోవైపు పెరుగుతున్న జీవన వ్యయం, ఇంధన ధరలు, ఇరాన్‌తో యుద్ధ పరిణామాలు కూడా ఓటర్ల ఆలోచనలను ప్రభావితం చేస్తున్న అంశాలుగా మారాయి. డెమొక్రాట్లు వీటినే తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
ట్రంప్ మాత్రం తనకు బలమైన మద్దతు ఉన్న ఓటర్లను మరోసారి ఏకం చేసే పనిలో పడ్డారు. సభల సంఖ్య పెంచినా, టెలీ ర్యాలీలు నిర్వహించినా చివరకు కావాల్సింది మాత్రం ఓట్లే. వేదికల ముందు కనిపించే వేలాదిమంది అభిమానులు పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా అదే ఉత్సాహం చూపిస్తారా? రిపబ్లికన్లకు అండగా నిలుస్తారా? లేక ఈసారి ఓటర్ల తీర్పు ట్రంప్ అంచనాలకు భిన్నంగా ఉంటుందా? నవంబర్ 3న వెలువడే ఫలితాలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నాయి.
—-సూర్య ప్రకాష్ జోశ్యుల








