నా తల్లిదండ్రులపై ద్వేషపూరిత దాడికి కుట్ర జరిగింది : అమెరికా కాంగ్రెస్ సభ్యుడు కృష్ణమూర్తి
అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అత్యంత సంచలన ఆరోపణలకు దిగారు.చికాగో సమీపంలోని ఓ హిందూ దేవాలయంలో తన తల్లిదండ్రులు పూజలు చేస్తుండగా, వారిపై దాడి చేయడానికి కుట్రలు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయాలని ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్‌ను కోరారు.
‘చికాగో ట్రిబ్యూన్’లో ప్రచురితమైన ఒక అభిప్రాయ వ్యాసంలో ఈ విషయాన్ని రాసుకొచ్చారు. దసరా నవరాత్రి మొదటి రోజు (అక్టోబర్ 11) న ఇల్లినాయిస్ లోని అరోరాలో వున్న హిందూ దేవాలయంలో దాడికి కుట్ర జరిగిందని, తన కుటుంబం ఎలా తప్పించుకుందో అందులో వివరించారు. “మా మతానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన నవరాత్రులను జరుపుకోవడానికి, నా 80 ఏళ్ల తల్లి మరియు 87 ఏళ్ల తండ్రి హిందూ భజనలు చేస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, 19 ఏళ్ల శ్వేతజాతి ఆధిపత్యవాది ఒకడు AR-రకం రైఫిల్, సుమారు 300 రౌండ్ల మందుగుండు సామగ్రితో బయట వేచి ఉన్నాడని మాకు అస్సలు తెలియదు.’’అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా నిందితుడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిపై కాల్పులు జరపడానికి ప్రయత్నించగా, అతని రైఫిల్ జామ్ అయిందని కృష్ణమూర్తి తెలిపారు. ఆ తర్వాత నిందితుడు తన సహోద్యోగితో తాను గుడికి తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ సహోద్యోగి అధికారులకు సమాచారం అందించడంతో, అతను తిరిగి వెళ్లేలోపే పాలటైన్ మరియు మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీస్ శాఖల అధికారులు అతడిని అరెస్టు చేశారని కృష్ణమూర్తి చెప్పుకొచ్చారు. అయితే.. రైఫిల్ ఎందుకు జామ్ అయ్యిందో తాను వివరించలేనని, కానీ.. ఆ సాంకేతిక లోపం తన కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది ప్రాణాలను మాత్రం కాపాడిందని చెప్పుకొచ్చారు.
ఈ ఘటన అమెరికాలో భారతీయ అమెరికన్లు మరియు దక్షిణాసియా వ్యక్తుల పట్ల పెరుగుతున్న శత్రుభావానికి నిదర్శనమని కృష్ణమూర్తి పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో విడుదలైన ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ, 2024 జనవరి నుండి 2026 జూన్ మధ్య కాలంలో ‘X’ (ట్విట్టర్) వేదికపై దక్షిణాసియా వ్యక్తులకు వ్యతిరేకంగా ద్వేషపూరిత పోస్ట్‌లు 240 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. అలాగే, ‘స్టాప్ ఏఏపీఐ హేట్’ (Stop AAPI Hate) సంస్థ అందించిన గణాంకాల ప్రకారం, 2025లో 48 శాతం మంది దక్షిణాసియా పెద్దలు జాతిపరమైన ద్వేషపూరిత ఘటనలకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు.








