ప్రజాస్వామ్యం గురించి జగన్ రెడ్డి నీతులు చెబుతున్నారు : మంత్రి లోకేష్
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మాకు విశ్వాసం ఉంది
జగన్ రెడ్డి తీరువల్లే పులివెందులలో శాంతిభద్రతల సమస్య
బెంగళూరులో మీడియా సమావేశంలో మంత్రి లోకేష్
బెంగళూరు: ప్రజాప్రభుత్వ పాలనలో పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన అనంతరం స్థానిక ఎన్నికలపై మంత్రి స్పందించారు. పులివెందులలో ఏకగ్రీవం జరిగాయని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలోని ప్రతివార్డు ఏకగ్రీవం చేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పులివెందులలో ఏవిధంగా ఏకగ్రీవం చేశారని అందరూ ప్రశ్నించాలి. ఇవాళ ప్రజాప్రభుత్వ పాలనలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలను నిర్వహించడం జరుగుతోంది. ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు పోలీస్ సెక్యూరిటీని కల్పించడం జరిగింది. పులివెందులలో నామినేషన్ వేసేందుకు ఎవరూ అడ్డుపడలేదు. నామినేషన్ వేశారు. పులివెందులలో శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. గత రాత్రి వాహనాలను తగులబెట్టారు. నిందను మాపై వేశారు. ప్రజలపై వారే దాడి చేసి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మాకు విశ్వాసం ఉంది
ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మాకు విశ్వాసం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందులలోనే ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఇందుకు జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణం. పులివెందులలో జగన్ రెడ్డి శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. ఇప్పుడు తామే బాధితులం అని చెప్పుకుంటున్నారు. ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసు. జగన్ రెడ్డి మాత్రం బెంగళూరులో ఉంటారు. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి వచ్చి సమస్యలు సృష్టించారు. అనంతరం హెలికాఫ్టర్ లో బెంగళూరు వెళ్లిపోయారు. జాతీయ మీడియాను పిలిచి శాంతిభద్రతల సమస్య అంటూ నిందలు వేస్తున్నారు.
జగన్ రెడ్డి తీరువల్లే పులివెందులలో శాంతిభద్రతల సమస్య
గత ఎన్నికల్లో పులివెందుల ఎందుకు ఏకగ్రీవం అయిందో ప్రజలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. గత ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేశారు. ఇప్పుడు మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నాం. పులివెందులలో కూడా ప్రజలు వచ్చి ఓట్లు వేశారు. జగన్ రెడ్డి వచ్చి సమస్యలు సృష్టిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏవిధంగా నిర్వహిస్తారు? విశాఖతో సహా కడప పట్టణంలో ఎన్నికలు జరిగాయి. ఒక్క సమస్య కూడా ఉత్పన్నం కాలేదు. సమస్యలకు జగన్ రెడ్డి ఒక్కడే కారణమని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ చెప్పారు.








