గౌతమ్ గంభీర్‌పై 4 ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ టార్గెట్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీలు అప్పుడే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రస్తుతం గంభీర్ టీమిండియాతో కలిసి న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు, అక్కడ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, భారత జట్టుతో గంభీర్ కాంట్రాక్ట్ 2027 వన్డే వరల్డ్ కప్ ముగిసే వరకు ఉంది. అయినప్పటికీ, ఐపీఎల్ 2028 సీజన్ నాటికి అతడిని తమ జట్టులోకి కోచ్ లేదా మెంటార్ పాత్రలో తీసుకురావడానికి ఏకంగా నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ రేసులో ముఖ్యంగా గంభీర్ మాజీ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో పాటు రాజస్థాన్ రాయల్స్ (RR) యాజమాన్యం కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ ప్రతినిధులు గంభీర్ బృందంతో ప్రాథమిక చర్చలు కూడా జరిపినట్లు దైనిక్ జాగరణ్ కథనం పేర్కొంది. వీరితో పాటు ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఒక టీమ్, అలాగే ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని మరో జట్టు కూడా గంభీర్ సేవలను పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఒకవేళ బీసీసీఐ (BCCI) గంభీర్ కాంట్రాక్ట్‌ను 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ వరకు పొడిగిస్తే మాత్రం ఈ ఫ్రాంచైజీలు తమ ప్లాన్స్‌ను కాస్త వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.
ఐపీఎల్లో గంభీర్‌కు ఒక మాస్టర్ టాక్టీషియన్గా తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. లక్నో సూపర్ జైంట్స్ (LSG) కొత్తగా ఏర్పాటైన 2022, 2023 సీజన్లలో మెంటార్‌గా వ్యవహరించి ఆ జట్టును వరుసగా ప్లేఆఫ్స్‌కు చేర్చారు. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ ఆహ్వానం మేరకు కేకేఆర్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చి, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో 10 ఏళ్ల టైటిల్ కరవును ముగిస్తూ ఐపీఎల్ 2024 ట్రోఫీని అందించారు. గంభీర్ నిష్క్రమణ తర్వాత కేకేఆర్, లక్నో జట్లు పాయింట్ల పట్టికలో వెనుకబడిపోవడం అతడి ఐపీఎల్ విలువ ఏపాటిదో చూపిస్తోంది. వైట్-బాల్ క్రికెట్లో గంభీర్ మైండ్ గేమ్‌కు ఉన్న క్రేజ్ వల్లే ఐపీఎల్ ఫ్రాంచైజీలు అప్పుడే ఈ రకమైన స్కెచ్‌లు వేస్తున్నాయి.








