హిందువు కావడమే శాపమవుతోందా? వివేక్ రామస్వామికి జాతి, మతం సెగ!
అమెరికాలో మన భారతీయులు టెక్నాలజీ నుంచి వైద్యం వరకు ఎన్నో రంగాల్లో తమ ముద్ర వేస్తున్నారు. కానీ రాజకీయ అధికారం విషయానికి వచ్చేసరికి మాత్రం పరిస్థితి మరోలా ఉంటోంది. అమెరికాలోనే పుట్టి, అక్కడే చదువుకుని, బిలియనీర్‌గా ఎదిగిన వివేక్ రామస్వామికి ఇప్పుడు తన భారతీయ మూలాలు, హిందూ మతమే రాజకీయ అడ్డంకులుగా మారుతున్నాయని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఒహాయో గవర్నర్ ఎన్నికల ప్రచారంలో బయటపడుతున్న కొన్ని నిజాలు, పరిణామాలు ఈ ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.
అమెరికాలో భారతీయులు విజయాలు సాధిస్తే ఒకప్పుడు దాన్ని ‘అమెరికన్ డ్రీమ్’ అని గొప్పగా చెప్పుకునేవారు. కష్టపడి పనిచేస్తే వలసదారుల పిల్లలు కూడా ఎంతటి ఉన్నత స్థానాలకైనా చేరుకోవచ్చని ఉదాహరణలుగా చూపించేవారు. కానీ ఇప్పుడు అదే భారతీయ మూలాలున్న వ్యక్తి అమెరికాలో రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తుంటే జాతి, మతం చుట్టూ వివాదాలు మొదలవుతున్నాయి.
రిపబ్లికన్ పార్టీ తరఫున ఒహాయో గవర్నర్ పదవికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి పరిస్థితి ఇప్పుడు ఇలాంటి చర్చకే కేంద్రంగా మారింది. భారతీయ వలసదారుల కుమారుడైన వివేక్ అమెరికాలోనే జన్మించారు. వ్యాపారవేత్తగా బిలియనీర్ స్థాయికి ఎదిగారు. డొనాల్డ్ ట్రంప్ రాజకీయ శిబిరంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు గవర్నర్ కావాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో ఉన్నారు.
కానీ ఆయన రాజకీయ ప్రయాణంలో అనూహ్యంగా జాతి, మతం అంశాలు ముందుకొస్తున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో దాదాపు ఐదుగురిలో ఒకరు వివేక్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఆ అభ్యర్థి భారతీయ అమెరికన్లను ‘థర్డ్ వరల్డ్ వాసులు’ అంటూ అవమానించడమే కాకుండా, నాజీ సిద్ధాంతాలతో ముడిపడిన ‘బ్లడ్ అండ్ సాయిల్’ అనే పదబంధాన్ని కూడా ఉపయోగించారు.
ఇది కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థి చేసిన వ్యాఖ్యల వ్యవహారమేనా? లేక అమెరికాలో భారతీయుల పట్ల పెరుగుతున్న అసహనానికి సంకేతమా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి.
82 శాతం ఓట్లు వచ్చినా.. గుర్తింపు సమస్య తప్పడం లేదా?
వివేక్ రామస్వామి రిపబ్లికన్ ప్రైమరీలో ఏకంగా 82 శాతం ఓట్లు సాధించారు. పార్టీ అభ్యర్థిగా ముందుకొచ్చిన ఆయనకు ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
2024 అధ్యక్ష ఎన్నికల్లో ఒహాయోలో డొనాల్డ్ ట్రంప్ 11 శాతం పాయింట్ల ఆధిక్యంతో గెలిచారు. రిపబ్లికన్లకు బలమైన రాష్ట్రంగా పేరున్న ఒహాయోలో వివేక్ కొన్ని సర్వేల్లో వెనుకబడుతున్నట్లు కథనం పేర్కొంది.
దీంతో ఆయన వ్యక్తిగత రాజకీయ ఇమేజ్, ఎన్నికల ప్రచార వ్యూహాలతో పాటు భారతీయ మూలాలు, హిందూ మతంపై ఓటర్ల అభిప్రాయాలు కూడా చర్చలోకి వచ్చాయి.
ఒహాయోలోని గ్రామీణ ప్రాంతాలైన మన్రో, ఆడమ్స్ కౌంటీల్లో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఓటర్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు వివేక్ భారతీయుడు కావడంపై అభ్యంతరం లేదంటూనే, రాష్ట్ర గవర్నర్ క్రైస్తవుడై ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
ఆడమ్స్ కౌంటీకి చెందిన మరికొందరు అమెరికాను ముందుకు నడిపించేది క్రైస్తవ విశ్వాసమేనని చెప్పారు. అయినప్పటికీ డెమోక్రటిక్ అభ్యర్థి గెలవకూడదనే ఉద్దేశంతో వివేక్‌కు ఓటు వేస్తానన్నారు. తమ నిర్ణయాన్ని ‘రెండు చెడుల్లో తక్కువ చెడును ఎంచుకోవడం’తో పోల్చారు.
మరి కొందరు మాత్రం తమ ప్రాంతంలో వివేక్‌కు సంబంధించిన ప్రచార బోర్డులు కనిపించకపోవడాన్ని ప్రస్తావించారు. ఇతర రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా బోర్డులు కనిపిస్తున్నా, వివేక్ విషయంలో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. బయటకు కనిపించకపోయినా సమాజంలో జాత్యహంకారం, ఇతరుల పట్ల అసహనం బలంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
హిందువు కావడం ఎన్నికల్లో మైనస్ అవుతోందా?
వివేక్ ఎదుర్కొంటున్న పరిస్థితులకు మరో ఆసక్తికరమైన ఆధారం ఒక సర్వేలో కనిపించింది. సెప్టెంబర్‌లో బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ, యూగోవ్ నిర్వహించిన సర్వేలో సగానికి పైగా సంభావ్య ఓటర్లు ఒక అభ్యర్థి హిందువు కావడం అమెరికా ఎన్నికల్లో గెలిచే అవకాశాలను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు, 65 ఏళ్లు పైబడినవారు, కాలేజీ విద్య లేని వారిలో ఈ అభిప్రాయం ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
అయితే వివేక్ తన మత విశ్వాసాలను దాచిపెట్టే ప్రయత్నం చేయడం లేదు. తన ప్రచారంలో కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, అమెరికా పట్ల తనకున్న అనుబంధాన్ని తరచూ ప్రస్తావిస్తున్నారు. సిన్సినాటిలోని సెయింట్ జేవియర్ అనే జెసూట్ పాఠశాలలో చదువుకున్న విషయాన్ని కూడా చెబుతున్నారు.
తన తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వచ్చారని, కష్టపడి పనిచేసి అమెరికన్ డ్రీమ్‌ను సాధించారని వివేక్ ప్రచారం చేస్తున్నారు.
‘నేను చట్టబద్ధంగా ఈ దేశానికి వచ్చిన వలసదారుల బిడ్డను. సరైన మార్గంలో వచ్చి, కష్టపడి పనిచేసి, నిబంధనలు పాటిస్తూ అమెరికన్ డ్రీమ్‌ను సాధించాం’ అని మన్రో కౌంటీలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు.
అంటే అమెరికా సమాజంలో తన మూలాల గురించి గర్వంగా చెబుతూనే, అక్రమ వలసల అంశంలో తన కుటుంబ నేపథ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
భారతీయుల విజయాలే కొందరికి కంటగింపుగా మారుతున్నాయా?
ఈ వివాదంలో మరో కీలకమైన అంశం భారతీయ అమెరికన్ల ఆర్థిక విజయాలు. టెక్నాలజీ, వైద్యం, వ్యాపారం వంటి రంగాల్లో భారతీయులు అమెరికాలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పెద్ద కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. భారీ సంపదను సృష్టిస్తున్నారు. ఒకప్పుడు ఇవన్నీ అమెరికన్ డ్రీమ్‌కు నిదర్శనాలుగా కనిపించేవి.
ఇప్పుడు అదే విజయాలు కొందరిలో వ్యతిరేకతకు కారణమవుతున్నాయా?
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన దక్షిణాసియా అధ్యయనాల ప్రొఫెసర్ దేవేష్ కపూర్ ఈ అంశంపై ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. భారతీయ అమెరికన్ల ఆర్థిక విజయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఒకప్పుడు వాటిని అమెరికన్ డ్రీమ్ సాధనగా చూసేవారని చెప్పారు. ఇప్పుడు అదే విజయాలు కొందరిలో అసహనాన్ని పెంచుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తోంది. భారతీయులు ఉద్యోగాలు చేస్తే, కంపెనీలు నడిపిస్తే, అమెరికా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడితే అభినందనలు. కానీ అదే వ్యక్తులు రాజకీయ అధికారాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం వారి జాతి, మతం ఎందుకు చర్చకు వస్తున్నాయి?
బిలియనీర్ కావడం కూడా వివేక్‌కు సమస్యే!
వివేక్‌కు ఎదురవుతున్న సవాళ్లు జాతి, మతంతోనే ముగియడం లేదు. ఆయన అపారమైన సంపద కూడా ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశమవుతోంది.
అమెరికాలో ప్రస్తుతం జీవన వ్యయం సామాన్యులను ఇబ్బంది పెడుతోంది. పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ఖర్చులు పెరుగుతుండటంతో ప్రజలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో బిలియనీర్ అయిన వివేక్‌కు సామాన్యుల కష్టాలు ఎంతవరకు అర్థమవుతాయనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఆడమ్స్ కౌంటీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బ్రియాన్ మేయర్ అభిప్రాయం కూడా ఇదే. ఒక వ్యక్తి బాగా సంపన్నుడైన తర్వాత సామాన్య ప్రజలు ఎదుర్కొనే రోజువారీ సమస్యలను అర్థం చేసుకోవడం కష్టమవుతుందని ఆయన అన్నారు. తాను గ్రోసరీ డెలివరీ చేస్తూ సంపాదిస్తున్న డబ్బులో పెట్రోల్ ఖర్చులకే ఎక్కువ మొత్తం వెళ్తోందని వివరించారు.
అంటే వివేక్‌కు ఒకవైపు భారతీయ మూలాలు, హిందూ మతం గురించి ప్రశ్నలు ఎదురవుతుంటే.. మరోవైపు ఆయన సంపద, సామాన్య ప్రజలతో ఉన్న సంబంధం కూడా ఎన్నికల చర్చలోకి వస్తోంది.
ముస్లింలపై వ్యతిరేకత.. హిందువుల విషయంలోనూ చర్చ!
వివేక్ ప్రచారంలో మరో ఆసక్తికరమైన కోణం మతపరమైన విభజన. కొందరు రిపబ్లికన్ ఓటర్లు హిందూ మతంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే, ముస్లింల పట్ల మరింత తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు.
ఒహాయో రిపబ్లికన్ పార్టీ స్టేట్ సెంట్రల్ కమిటీ సభ్యురాలు కరోల్ కోల్మన్ హిందువులకు, ముస్లింలకు మధ్య తేడా ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలలో ద్వేషభావం ఎక్కువగా ఉంటుందని ఆమె చేసిన వ్యాఖ్యలపై ముస్లిం హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఒక మతానికి చెందిన వారందరినీ ఒకే విధంగా చూడటం ప్రమాదకరమైన మూసధోరణి అని విమర్శించాయి.
అదే సమావేశానికి హాజరైన బాప్టిస్ట్ పాస్టర్ రికీ ఫార్లీ మాత్రం వివేక్ హిందువు కావడంపై తనకు అభ్యంతరం లేదన్నారు. అయితే ఇస్లాం, ముస్లింలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి.
ఇక్కడ కనిపిస్తున్నది అమెరికా రాజకీయాల్లో మతపరమైన గుర్తింపులు ఎంత బలంగా ప్రభావం చూపుతున్నాయనేదే.
గుర్తింపు రాజకీయాలను వ్యతిరేకించే వివేక్.. మరి ఆయన విషయంలోనే ఎందుకీ చర్చ?
వివేక్ రామస్వామి స్వయంగా గుర్తింపు రాజకీయాలను వ్యతిరేకించే నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకుంటున్నారు. జాతి, మతం పేరుతో ఇతరులను నిందించకుండా వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని యువ రిపబ్లికన్లకు సూచించారు.
‘సమస్య యూదులు కాదు.. తెల్లజాతీయులు కాదు.. పురుషాధిక్యత కాదు.. నల్లజాతీయులు కాదు.. విదేశీయులు కూడా కాదు’ అని మే నెలలో జరిగిన ర్యాలీలో వ్యాఖ్యానించారు.
అయితే తాజాగా మిచిగాన్‌లోని డియర్బోర్న్ నగరాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. అరబ్ అమెరికన్లు అధికంగా నివసించే ఈ నగరాన్ని కమ్యూనిజం పరిణామాల గురించి మాట్లాడే సందర్భంలో ప్రస్తావించారు. ‘మిచిగాన్‌లోని డియర్‌బోర్న్‌లో ఏం జరుగుతోందో చూడండి. అలాంటిది ఒహాయోలో జరగనివ్వం’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ వచ్చిన ప్రశ్నలకు ఆయన ప్రచార బృందం వెంటనే స్పందించలేదు. ఇక తన డెమోక్రటిక్ ప్రత్యర్థి అమీ ఆక్టన్ కుటుంబ నేపథ్యంపై రూపొందించిన ప్రకటన కూడా వివాదాస్పదమైంది. ఆమె తల్లి తన కుమార్తె అబద్ధాలు చెబుతోందంటూ చేసిన ఆరోపణలతో కూడిన ప్రకటనపై విమర్శలు రావడంతో దాని ప్రసారాన్ని నిలిపివేసినట్లు వివేక్ ప్రచార బృందం ప్రకటించింది.
అమెరికాలో భారతీయుడి ఎదుగుదలకు మతం అడ్డంకిగా మారుతోందా?
వివేక్ రామస్వామి ఎన్నికలు ఇప్పుడు ఒక గవర్నర్ పదవి కోసం జరుగుతున్న రాజకీయ పోరాటానికి మించి చర్చకు దారితీస్తున్నాయి. అమెరికాలో పుట్టిన భారతీయ మూలాలున్న వ్యక్తి.. అక్కడే చదువుకుని, వ్యాపారవేత్తగా ఎదిగి, రాజకీయాల్లో కీలక స్థానానికి చేరుకున్నా.. తన జాతి, మతం గురించి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు ఆయన సంపద, ఎన్నికల ప్రచార వ్యూహాలు, రాజకీయ వ్యాఖ్యలు కూడా ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి.
అమెరికన్ డ్రీమ్ అంటే కష్టపడితే ఎవరైనా ఎదగవచ్చని చెబుతారు. కానీ ఆ ఎదుగుదల రాజకీయ అధికారాన్ని చేరుకునే స్థాయికి వస్తే భారతీయ మూలాలు, హిందూ మతం కూడా చర్చనీయాంశాలవుతున్నాయా? వివేక్ రామస్వామి ఎన్నికలు ఇప్పుడు అమెరికా సమాజం ముందుంచుతున్న అసలు ప్రశ్న ఇదే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








