ఒహియో గవర్నర్ ఎన్నికల పోటీలో స్వల్ప ఆధిక్యంలో వివేక్ రామస్వామి.. గెలిస్తే.. జాక్ పాటే
అమెరికాలో జరగబోయే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రవాస భారతీయులు ముందంజలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రామస్వామికి మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఒహాయో గవర్నర్ ఎన్నికల బరిలో డెమొక్రాట్ అమీ ఆక్టన్పై భారతీయ అమెరికన్ రిపబ్లికన్ వివేక్ రామస్వామి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఈయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈయన ఆధిక్యం పెరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
వివేక్ రామస్వామిని గవర్నర్ గా ఎన్నుకోవాలని ఒహాయో ఓటర్లను ఇప్పటికే కోరారు. ఇక వివేక్ రామస్వామి కూడా అంతే స్థాయిలో గట్టి ప్రచారం చేస్తున్నారు. తనను ఎన్నుకుంటే ఓటర్ల జీవితాలను మెరుగుపరుస్తానన్న హామీతో ప్రచార బరిలోకి దిగారు. తాను ఇచ్చిన హామీలను ట్రంప్ జాతీయ అజెండాతో అనుసంధానం కూడా చేస్తానని చెప్పుకొస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్లకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లే.. తాను కూడా ఒహియో ప్రజలకే మొదటి ప్రాధాన్యం ఇస్తానంటూ అనూహ్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. శాంచురీ సిటీస్ ని రద్దు చేస్తానని రామస్వామి హామీ ఇచ్చారు. ఈ హామీని, ప్రభుత్వ వలస విధానాలకు రాష్ట్ర స్థాయిలో పొడిగింపుగా ఆయన పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఈ చర్య తీసుకుంటానని ఆయన చెప్పారు.
టెక్నాలజీ పరిశ్రమ వాణిజ్య సంఘమైన నెట్ఛాయిస్ కోసం ఎచెలాన్ ఇన్సైట్స్ నిర్వహించిన ఈ సర్వేలో, ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లలో రామస్వామికి 47% మద్దతు లభించగా, ఆక్టన్‌కు 45% మద్దతు లభించింది. లిబర్టేరియన్ అభ్యర్థి డాన్ కిస్సిక్కు 4% ఓట్లు వచ్చాయి. అయితే.. WSYX/ABC6 నివేదించిన ఈ ఫలితాలు, ఒహాయో అత్యున్నత ఎన్నికల పదవికి హోరాహోరీ పోరును సూచిస్తున్నప్పటికీ, మరో సర్వేలో యాక్టన్కు స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ‘రెడ్బాక్స్ రీసెర్చ్’ నిర్వహించిన ఒక పోల్‌లో, ఆక్టన్‌కు 48.2% మరియు రామస్వామికి 43.8% ఓట్లు లభించాయి.

అయితే.. మొత్తంగా చూస్తే ఎవరూ కూడా నిర్ణయాత్మకమైన ఆధిక్యాన్ని చూపడం లేదు. ఓటర్లు అభ్యర్థులను కాకుండా ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలు.. లాంటి విషయాలనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కూడా సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయం ఎచెలాన్ ఇన్ సైట్స్ సర్వే పేర్కొంది. సుమారు 57% మంది ఆ సమస్యలను ప్రస్తావించగా, ఆ తర్వాత 24% మంది విదేశాంగ విధానాన్ని, 21% మంది ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పేర్కొన్నారు.
అయితే.. రామస్వామి ఓహియో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నోబుల్, వాషింగ్టన్, మెయిగ్స్, లికింగ్, నాగ్స్ కౌంటీలలో విపరీతంగా పర్యటించారు. ఈ పర్యటనే ఆయనకు బాగా కలిసి వస్తుందన్న అంచనాలు కూడా వున్నాయి. లికింగ్ కౌంటీలో జరిగిన ప్రచారంలో లైసెన్స్ గన్స్ ని కలిగి వుండే హక్కును గట్టిగా సమర్థించారు.
భారత్ లోని కేరళ ప్రాంతం నుంచి రామస్వామి కుటుంబం వలస వచ్చింది. 2024 రిపబ్లిక్ అధ్యక్ష నామినేషన్ కోసం పోటీపడి విఫలం చెందిన సమయంలో రామస్వామి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ తర్వాత ఆయన ట్రంప్‌కు మద్దతు ప్రకటించి, ప్రముఖ రిపబ్లికన్ రాజకీయ నాయకుడిగా కొనసాగారు.ఒకవేళ ఎన్నికైతే, రామస్వామి ఒహాయోకు మొట్టమొదటి భారతీయ అమెరికన్ గవర్నర్ అవుతారు.








