ట్రంప్ దిగిపోయేలోపే టెస్లా–స్పేస్ఎక్స్ డీల్‌కు మస్క్ ప్లాన్.. ఎందుకంటే?
ఎలక్ట్రిక్ కార్లతో ఆటోమొబైల్ ప్రపంచాన్ని, రాకెట్లతో అంతరిక్ష రంగాన్ని ఊపేస్తున్న ఎలాన్ మస్క్.. ఇప్పుడు తన రెండు దిగ్గజ కంపెనీలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల విలీనంపై అధికారికంగా చర్చలు నడుస్తున్నట్లు వార్తలు బయటకు రావడంతో వ్యాపార వర్గాల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.
ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవీకాలం ముగిసేలోపే ఈ భారీ డీల్‌ను పూర్తి చేయాలని మస్క్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగానే ఈ రెండు కంపెనీలు కలిసిపోతే ఆటోమొబైల్, అంతరిక్ష రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌లో సరికొత్త సంచలనాలు నమోదవ్వడం ఖాయం. అయితే మరీ అంత తొందర ఎందుకు? రెండు కంపెనీలను కలపడం వల్ల మస్క్‌కు కలిగే ప్రయోజనం ఏమిటి?
విలీనం దిశగా రెండు సంస్థలు: అసలేం జరుగుతోంది?
ఈ రెండు కంపెనీలను ఒకటి చేయాలనే ఆలోచనను మస్క్ స్వయంగా సమర్థించారు. ఇటీవల జరిగిన స్పేస్ఎక్స్ మూడో త్రైమాసిక ఆదాయాల భేటీలో ఆయన మాట్లాడుతూ, రెండు కంపెనీలలో స్వతంత్ర డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీలను వేసి ఈ విలీన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు.
అయితే, కమిటీలు ఇంకా ఒక నిబంధనపై ఏకాభిప్రాయానికి రాలేదని, లావాదేవీల షరతులపై చర్చలు కొనసాగుతున్నందున ఒప్పందం ఖాయమని ఇప్పుడే చెప్పలేమన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ రెండు సంస్థలు అధికారికంగా విలీనంపై చర్చలు జరపడం ఇదే తొలిసారి. స్పేస్ఎక్స్ కంపెనీయే స్వయంగా టెస్లాను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి.
ట్రంప్ పదవీకాలమే సరిగ్గా ఎందుకు?
2027 మొదటి ఆరు నెలల్లోనే ఈ విలీనానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీకాలం పూర్తయ్యేలోపే ఈ డీల్ ముగించాలని మస్క్ భావిస్తున్నప్పటికీ, దానికి స్పష్టమైన రాజకీయ లేదా ఆర్థిక కారణాలేంటో పూర్తిగా బయటకు రాలేదు.
ప్రభుత్వ నియంత్రణ సంస్థల (Regulators) అడ్డంకులు తప్పించుకోవడానికా లేక స్పేస్ఎక్స్కున్న అమెరికా రక్షణ రంగ బంధాల వల్లా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చర్చల్లో మస్క్ నేరుగా పాల్గొనకపోవడం మరో విశేషం. రెండింటిలోనూ తన పర్సనల్ ఇంట్రెస్ట్‌లు ఉన్నాయి కాబట్టి ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ ఎదురుకాకుండా ఉండేందుకు నిర్ణయాధికారాన్ని ఆ ప్రత్యేక కమిటీలకే వదిలేసినట్లు ఆయన వెల్లడించారు.
అసలు మస్క్ ప్లాన్ ఏంటి? AI, రోబోటిక్స్ రంగాల్లో కొత్త విప్లవమా?
ఈ విలీనం వెనుక సాంకేతిక ప్రయోజనాలే ప్రధాన కారణమని మస్క్ స్పష్టం చేస్తున్నారు. ఏఐ సాఫ్ట్వేర్, మైక్రోచిప్ డిజైన్, రోబోటిక్స్, కనెక్టివిటీ సాంకేతికతలో రెండు కంపెనీల అనుభవాన్ని ఒక్కటి చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన అంచనా. ప్రస్తుతం టెస్లా ఎలక్ట్రిక్ రవాణా, సూపర్ కంప్యూటింగ్, ఆటోమేటిక్ డ్రైవింగ్, హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌పై తీవ్రంగా కృషి చేస్తుంటే; స్పేస్ఎక్స్ ఏమో రాకెట్ టెక్నాలజీ, ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ (స్టార్‌లింక్), అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతోంది. ఈ రెండింటి శక్తిని ఒక్కటి చేయడం ద్వారా ఏఐ, రోబోటిక్స్ ప్రపంచంలో ఎవరికీ అందని స్థాయికి ఎదగాలనేది మస్క్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
వాల్‌స్ట్రీట్‌లో జోష్: ఊపందుకున్న టెస్లా షేర్లు
విలీన వార్తలు రావడమే ఆలస్యం, షేర్ మార్కెట్లో టెస్లా హవా మొదలైంది. సోమవారం రోజున టెస్లా షేర్లు ఏకంగా 5 శాతం పెరిగి, గత మూడు నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బార్కిలేస్.. టెస్లా షేర్లపై తన రేటింగ్‌ను ‘ఓవర్‌వెయిట్’కు పెంచడమే కాకుండా, టార్గెట్ ప్రైస్‌ను 370 డాలర్ల నుంచి 450 డాలర్లకు సవరించింది.
ఈ విలీన ప్రతిపాదన టెస్లా భవిష్యత్తుకు సానుకూల సంకేతమని సంస్థ విశ్లేషించింది. బిఎన్‌పి పారిబాస్, సీఎల్ఎస్ఏ వంటి సంస్థలు కూడా టెస్లాపై తమ ప్రతికూల అంచనాలను వెనక్కి తీసుకున్నాయి. ప్రముఖ విశ్లేషకుడు డాన్ ఐవ్స్ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి ఈ రెండు కంపెనీలు విలీనమయ్యే అవకాశాలు 80 నుంచి 90 శాతం వరకు ఉన్నాయి.
షేర్‌హోల్డర్ల అనుమతి: మస్క్ ముందనున్న అతిపెద్ద పరీక్ష
సాంకేతిక అనుకూలతలు, పెట్టుబడిదారుల ఉత్సాహం ఉన్నప్పటికీ, ఈ విలీనం ముందుకు సాగాలంటే షేర్‌హోల్డర్ల ఆమోదం పొందుట అతిపెద్ద సవాలుగా మారనుంది. టెస్లాలో ఈ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండబోతోంది, ఎందుకంటే కేవలం ఓటింగ్‌లో పాల్గొన్న వారి మెజారిటీ మాత్రమే కాకుండా, మొత్తం బకాయి ఉన్న షేర్లలో మెజారిటీ సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది.
స్పేస్ఎక్స్లో మస్క్‌కు ఏకంగా 85 శాతం ఓటింగ్ అధికారం ఉండటంతో అక్కడ నిర్ణయం సులభమే కానీ, టెస్లాలో ఆయన వాటా 20 శాతం మాత్రమే. అందువల్ల టెస్లా ఇన్వెస్టర్లను ఒప్పించడం అంత తేలికైన విషయం కాదని, అది తనకు పెద్ద అడ్డంకి అని మస్క్ స్వయంగా అంగీకరించారు.
చైనా అభ్యంతరాలు, పోటీ పరీక్షలు
జెపి మోర్గాన్ విశ్లేషకుడు రాజత్ గుప్తా అభిప్రాయం ప్రకారం, ఈ ఒప్పందానికి చైనా నుంచి ఎదురయ్యే నియంత్రణపరమైన చిక్కులు అత్యంత ప్రమాదకరంగా మారవచ్చు. టెస్లాకు చైనాలోని షాంఘైలో భారీ తయారీ ప్లాంట్ ఉంది, అదే సమయంలో స్పేస్ఎక్స్ అమెరికా రక్షణ రంగానికి సాంకేతిక సేవలు అందిస్తోంది. పైగా స్పేస్ఎక్స్కు చెందిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు చైనాలో ఎలాంటి అనుమతులు లేవు.
ఈ రెండు ఒకే కంపెనీగా మారితే చైనా ప్రభుత్వం డేటా, భద్రతా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. దాంతో పాటు చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల మార్కెట్ పోటీ నియంత్రణ సంస్థలు కూడా ఈ డీల్ వల్ల ఇతర కంపెనీలకు అన్యాయం జరుగుతుందేమోనని నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.
వ్యాపార విలీనమా.. లేదా పవర్ గేమా?
విలియం బ్లెయిర్ సంస్థకు చెందిన విశ్లేషకులు ఈ విలీనంపై మరొక ఆసక్తికరమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ప్రతిపాదన వెనుక వ్యాపార విస్తరణ కంటే, కంపెనీలపై తన నియంత్రణను పెంచుకోవాలనే మస్క్ ఆలోచనే ప్రధానంగా ఉండి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. రెండు సంస్థలను ఒకే వ్యవస్థలోకి తెస్తే ఏఐ, రోబోటిక్స్, శాటిలైట్ ప్రాజెక్టులను మస్క్ తన ఇష్టారీతిన ఏకధాటిగా నడిపించవచ్చు.
అయితే ఒకే వ్యక్తి చేతికి ఇన్ని రంగాలు వెళ్లడం వల్ల ఇన్వెస్టర్లు, కార్పొరేట్ గవర్నెన్స్ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 2027 ఆరంభంలో ఈ ఒప్పందం రూపుదిద్దుకుంటుందా లేక చర్చల స్థాయిలోనే ఆగిపోతుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, ఇది నిజమైతే మాత్రం సాంకేతిక ప్రపంచంలో కొత్త అధ్యాయం మొదలైనట్లే.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








