టీమిండియా మేనేజ్మెంట్పై మురళీ కార్తీక్ ఫైర్..!
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని(Vaibhav Suryavanshi) బ్యాటింగ్ ఆర్డర్లో నెంబర్ 3 స్థానంలో పంపడంపై మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాయపడిన ఇషాన్ కిషన్(Ishan Kishan) స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వైభవ్.. కేవలం 4 పరుగులు (8 బంతుల్లో) మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే, ఈ వైఫల్యానికి ఆ చిన్నారిని బ్లేమ్ చేయలేమని, టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయమే తప్పు అని మురళీ కార్తీక్ స్పష్టం చేశారు.
మ్యాచ్ అనంతరం జరిగిన విశ్లేషణలో మురళీ కార్తీక్ మాట్లాడుతూ.. “వైభవ్ సూర్యవంశీ అసలైన బలం ఓపెనింగ్ బ్యాటింగ్. అలాంటి ఆటగాడిని తీసుకొచ్చి అలవాటు లేని మిడిల్ ఆర్డర్లో ఆడించడం ఏమాత్రం సరికాదు” అని మండిపడ్డారు. అతను ఇంకా 15 ఏళ్ల చిన్న పిల్లాడని, అతనికి ఒకే శైలిలో ఆడటం తెలుసని గుర్తుచేశారు. ఒకవేళ అభిషేక్ శర్మతో పాటు వైభవ్‌ను కూడా ఆడించాలనుకుంటే.. వారిద్దరితోనే ఓపెనింగ్ చేయించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉన్నది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విభిన్న పాత్రలు పోషించడానికేనని కార్తీక్ వ్యాఖ్యానించారు. “సంజూ శాంసన్ జట్టులో ఎంతో అనుభవజ్ఞుడైన ఆటగాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ఒక సీనియర్‌గా శాంసన్ నెంబర్ 3 స్థానంలో వచ్చి బాధ్యత తీసుకుని, ఆ కుర్రాడికి ఓపెనింగ్ చేసే అవకాశం ఇవ్వాల్సింది” అని సూచించారు. ఒకవేళ మిడిల్ ఆర్డర్ కోసమే చూస్తే, వైభవ్‌కు బదులుగా శివమ్ దూబేను జట్టులోకి తీసుకోవాల్సిందని మేనేజ్మెంట్ ప్రణాళికలను తప్పుబట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ, యువ ఆటగాళ్ల నైపుణ్యాన్ని సరైన స్థానంలో వాడుకోవడంలో మాత్రం విఫలమైందని స్పష్టం చేసారు.








