అమెరికాలో NRIల ఇళ్లలో రాజకీయ చిచ్చు : అసలు గొడవ దేనికంటే?
అమెరికాలో ఉన్న మన భారతీయుల ఇళ్లలో గత కొంతకాలంగా ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. అన్ని విషయాల్లో అందరూ కలిసి,మెలిసి బాగానే ఉంటారు కానీ, రాజకీయాల ముచ్చట రాగానే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోతోంది! పెద్దవాళ్లు ఒకవైపు నిలబడితే, వాళ్ల పిల్లలు మాత్రం పూర్తిగా మరోవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రాబోయే అమెరికా ఎన్నికల వేళ ఈ తరాల మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా బయటపడుతోంది.
పెద్దలకు పన్నులు, ఆస్తుల భద్రత, భారత్‌తో అమెరికా సంబంధాలు ముఖ్యం కాగా.. పిల్లలకు వ్యక్తిగత స్వేచ్ఛ, మహిళల హక్కులు, పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా మాట్లాడుతున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్న రెండు తరాలు రాజకీయాల విషయంలో వేర్వేరు దారుల్లో నడుస్తున్నాయి. అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది?
తండ్రి బాట పన్నుల వైపు.. పిల్లల రూటు స్వేచ్ఛ వైపు!
1980ల నుంచి 2000ల ఆరంభంలో భారత్ నుంచి అమెరికా వెళ్లిన మొదటి తరం వాళ్లకు ఎదురైన సవాళ్లు వేరు. వీసా కష్టాలు, గ్రీన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు, ఉద్యోగ భద్రత.. ఇలా ప్రతి అడుగులోనూ ఎన్నో ప్రాసెస్లు దాటుకుని వచ్చారు. అందుకే వాళ్లకు సంపాదన, ఆస్తులను కాపాడుకోవడం, తక్కువ పన్నులు, పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం ప్రాధాన్యతలుగా మారాయి. పన్నులు తగ్గించే, వ్యాపారాలకు మద్దతుగా నిలిచే నాయకుల వైపే వాళ్లు మొగ్గు చూపిస్తున్నారు.
కానీ అమెరికాలోనే పుట్టి పెరిగిన పిల్లల ఆలోచనలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వాళ్లకు కేవలం సంపాదన మాత్రమే సరిపోదు. తాము బతికే సమాజంలో మహిళలకు సమాన హక్కులు ఉన్నాయా, వ్యక్తిగత స్వేచ్ఛ దక్కుతోందా, పర్యావరణాన్ని కాపాడుతున్నారా అనేవి ముఖ్యమైన అంశాలు. అంటే, తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే, పిల్లలు తమ భవిష్యత్తు సమాజం ఎలా ఉండాలనే దానిపై కంగారుపడుతున్నారు.
భారత్‌పై ప్రేమ ఒక్కటే.. కానీ చూసే కోణమే వేరు!
విదేశాంగ విధానం దగ్గరకు వచ్చేసరికి ఈ అభిప్రాయ భేదాలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. మొదటి తరం తల్లిదండ్రులకు భారత్, అమెరికా సంబంధాలు బలంగా ఉండటం చాలా ముఖ్యం. రక్షణ, సాంకేతిక రంగాల్లో రెండు దేశాల మధ్య భాగస్వామ్యంతో పాటు చైనా, పాకిస్థాన్‌లను అమెరికా ఎలా నిలువరిస్తోందనేది వారు నిశితంగా గమనిస్తారు. పైగా భారత్ అంతర్గత విషయాల్లో అమెరికా రాజకీయ నాయకులు వేలు పెడితే వాళ్లు తట్టుకోలేరు.
కానీ, అక్కడే పుట్టి పెరిగిన యువత మాత్రం మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల విషయంలో ఏమాత్రం రాజీ పడటానికి సిద్ధంగా లేరు. వాళ్ల దృష్టిలో తప్పు ఏ దేశం చేసినా తప్పు అని ప్రశ్నించాల్సిందేనంటారు. అమెరికా అయినా, ఇండియా అయినా ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలనేది వారి వాదన. దీంతో ఇరు తరాల మధ్య చురుకైన చర్చలు, వాదోపవాదాలు నడుస్తుంటాయి.
అబార్షన్ల హక్కులు, పర్యావరణంపై కుండబద్దలు!
అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు అబార్షన్ల హక్కుల వివాదం చాలా పెద్దది. 2022లో సుప్రీంకోర్టు తీర్పు మారినప్పటి నుంచి ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా మారింది. తల్లిదండ్రులు పన్నులు, ఉద్యోగ భద్రతకే ప్రాధాన్యమిచ్చినా, యంగ్ ఇండియన్-అమెరికన్ మహిళలు మాత్రం తమ శరీరాలపై తమకే హక్కు ఉండాలని బలంగా నమ్ముతున్నారు.
ఏ పార్టీ అయినా పన్నులు తగ్గిస్తామని చెప్పినా, మహిళల ఆరోగ్య హక్కులపై ఆంక్షలు విధిస్తే ఆ పార్టీకి ఓటు వేసేది లేదని తెగేసి చెప్తున్నారు. దీనికితోడు వాతావరణ మార్పులు, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, పునరుత్పాదక ఇంధనం, అలాగే LGBTQ+ హక్కులు, జాతి సమానత్వం వంటి అంశాలు కూడా యువత నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. కాలేజీల్లో జరిగే చర్చలు, సోషల్ మీడియా ప్రభావం వల్ల వారి ఆలోచనా దృక్పథం పూర్తిగా మారుతోంది.
యువతలోనూ కొత్త ట్విస్ట్.. జెండర్ ఆధారంగా ఓట్లు!
అయితే, ఇంట్లో పెద్దలందరూ ఒకవైపు, పిల్లలందరూ ఒకవైపు ఉన్నారని అనుకుంటే పొరపాటే. ఇక్కడ మరో ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. భారతీయ సంతతికి చెందిన యువతుల్లో ఎక్కువమంది మహిళల హక్కులు, సామాజిక సమానత్వం కోసం ప్రగతిశీల (ప్రోగ్రెసివ్) రాజకీయాలకు మద్దతు ఇస్తుంటే, కొంతమంది యువకులు మాత్రం సంప్రదాయవాద (కన్సర్వేటివ్) రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు.
క్రిప్టోకరెన్సీ విధానాలు, ప్రభుత్వ ఆంక్షలు తగ్గించడం, మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వంటి విషయాల వల్ల కొంతమంది యువకులు తమ తండ్రుల ఆలోచనలకు దగ్గరవుతున్నారు. అలాగే, ఇంట్లోని కొందరు యువతులు తమ తల్లులకు ఈ విషయాలు అర్థమయ్యేలా చెప్పి, తమ వైపు తిప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు విభేదాలు కేవలం రెండు తరాల మధ్య మాత్రమే కాదు, ఒకే తరానికి చెందిన అబ్బాయిలు, అమ్మాయిల మధ్య కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అమెరికన్ డ్రీమ్‌కు మారుతున్న కొత్త అర్థం!
ఈ రోజు అమెరికాలోని దాదాపు 49 లక్షల మంది భారతీయ సంతతి ప్రజల్లో 26 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా వంటి కీలకమైన రాష్ట్రాల్లో వీరి ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలవు. అందుకే ఈ నవంబర్ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలన్నీ వీరిని ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అయితే ఇక్కడ అసలు సమస్య రాజకీయాల గురించి కాదు.. అసలైన ‘అమెరికన్ డ్రీమ్’ అర్థం మారుతుండటం గురించి! తల్లిదండ్రులు అమెరికా వచ్చి ఆర్థిక భద్రత, సొంతిల్లు, మంచి ఉద్యోగమే అమెరికన్ డ్రీమ్ అనుకుని సాధించారు.
కానీ, వాళ్లు కష్టపడి పెంచిన పిల్లలు మాత్రం స్వేచ్ఛ, సమానత్వం, పర్యావరణ భద్రత ఉన్న సమాజమే తమ నిజమైన అమెరికన్ డ్రీమ్ అంటున్నారు. కష్టపడి నిర్మించిన జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటున్న తల్లిదండ్రులు ఒకవైపు, దానికి కొత్త అర్థం ఇవ్వాలనుకుంటున్న పిల్లలు మరోవైపు నిలబడటంతో.. ఈ తరాల పోరు రాబోయే రోజుల్లో భారత్‌తో వీరి సంబంధాలను కూడా ఒక కొత్త కోణంలో ఆవిష్కరించబోతోంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








