పరిషత్ పోరుకు కూటమి మున్సిపల్ ఫార్ములా..!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటును కొలిక్కి తెచ్చేందుకు అధికార కూటమి అగ్రనేతలు కసరత్తు ముమ్మరం చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే MPTC, ZPTC మరియు జడ్పీ చైర్మన్ స్థానాల కేటాయింపులపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల సీట్ల పంపకాలకు ఉపయోగించిన సక్సెస్ఫుల్ ఫార్ములా ఆధారంగానే, ఈ పరిషత్ ఎన్నికల సీట్ల కేటాయింపులు కూడా జరపాలని ఇరు నేతలు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సర్దుబాటులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కనీసం 7 లేదా 8 జెడ్పీ చైర్మన్ స్థానాలను ఆశిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, తిరుపతి, కాకినాడ జిల్లాల్లోని కీలకమైన జడ్పీటీసీ స్థానాలపై జనసేన గట్టిగా గురిపెట్టగా.. వీటితో పాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో సైతం తమ పార్టీకి బలమున్న మరికొన్ని స్థానాలను కేటాయించాలని కోరినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీట్ల కేటాయింపుల ప్రక్రియ ఒకవైపు అధికారికంగా సాగుతుండగానే, మరోవైపు అవకాశం ఉన్నచోట్ల కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఆశావహులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు.
ఈ తరుణంలో కూటమిలో ఎలాంటి అంతర్గత విభేదాలు రాకుండా చూసుకోవడమే ప్రధాన లక్ష్యంగా బాబు-పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్య త్వరలోనే పూర్తి ఏకాభిప్రాయం సాధించి, తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్న రెబల్స్ మరియు అసంతృప్త నేతలను తక్షణమే బుజ్జగించేలా జిల్లా స్థాయి ఇన్ఛార్జులకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల మధ్య ఎక్కడా ఘర్షణ వాతావరణం లేకుండా, మూడు పార్టీల క్యాడర్ కలిసికట్టుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఇరు నేతలు భావిస్తున్నారు. పొత్తుల నేపథ్యంలో కొన్ని స్థానాలు చేతులు మారినందున తలెత్తే ఇబ్బందులను స్థానిక నాయకత్వాలు సమన్వయం చేసుకోవాలని, అధికారికంగా ఖరారైన అభ్యర్థుల గెలుపు కోసమే ప్రతి ఒక్కరూ పనిచేసేలా దిగువ శ్రేణిని సరుద్దబాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.








