గంగూలీని కోర్టుకు వెళ్లేలా చేసిన సినిమా.. ‘దూస్రా’లో అసలేం ఉంది?
ఒకప్పుడు లార్డ్స్ మైదానంలో షర్ట్ విప్పి గాల్లో తిప్పుతూ భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపిన సౌరవ్ గంగూలీ.. ఇప్పుడు అదే సంచలన ఘట్టం ఆధారంగా తెరకెక్కిన సినిమా విషయంలో న్యాయపోరాటం చేస్తున్నారు. తన క్రికెట్ కెరీర్‌కు, వ్యక్తిగత గుర్తింపునకు సంబంధించిన అంశాలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ వివాదం మధ్యలోనూ సినిమా విడుదలకు అడ్డుకట్ట వేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్.. గంగూలీ పిటిషన్‌పై విచారణ ఎప్పుడు?
మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభ్యంతరాలతో ‘దూస్రా’ (Doosra) సినిమా విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. అక్టోబర్ 23, 2026న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమాను నిలిపివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
అయితే, గంగూలీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయలేదు. సినిమా విడుదలను ఆపడం లేదని స్పష్టం చేస్తూనే, ఆయన అభ్యర్థనపై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. అంటే, సినిమా విడుదలకు ప్రస్తుతం మార్గం సుగమమైనప్పటికీ, వ్యక్తిత్వ హక్కులకు సంబంధించిన న్యాయవివాదం ఇంకా పరిష్కారం కాలేదు.
ఇవి కూడా చదవండి
గంగూలీకి అభ్యంతరం ఎందుకు?
2002లో ఇంగ్లండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించడం క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే ఘట్టం. ఆ విజయానంతరం లార్డ్స్ బాల్కనీలో గంగూలీ తన షర్ట్ విప్పి గాల్లో తిప్పుతూ సంబరాలు చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఈ చారిత్రక ఘట్టంతో పాటు తన నాయకత్వం, క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన గుర్తింపును సినిమాలో ఉపయోగించడంపై గంగూలీ అభ్యంతరం వ్యక్తం చేసారు. తన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇక్కడ ప్రధానమైన అంశం వ్యక్తిత్వ హక్కులు (Personality Rights). ఒక ప్రముఖ వ్యక్తి పేరు, ప్రతిష్ఠ, గుర్తింపు వంటి అంశాలను వాణిజ్యపరంగా ఎలా ఉపయోగించాలనే దానిపై ఈ హక్కులు చర్చకు వస్తాయి. అయితే, ఒక వ్యక్తి జీవితంలోని చారిత్రక సంఘటనను ఆధారంగా చేసుకుని కథ చెప్పడం, ఆయన గుర్తింపును వాణిజ్యపరంగా దుర్వినియోగం చేయడం రెండూ ఒకటేనా? అన్నది ఈ వివాదంలో కీలకమైన చర్చగా మారింది.
‘దూస్రా’ సినిమాలో గంగూలీ కథే ఉందా?
‘దూస్రా’ సినిమా గంగూలీ జీవిత చరిత్ర కాదు. ఆయన 2002లో చేసిన సంచలన సంబరాన్ని స్ఫూర్తిగా తీసుకుని, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక ఆంక్షలను ఎదిరించడం వంటి అంశాల చుట్టూ కథను రూపొందించారు.
ఈ సినిమాలో తార అనే యువతి ప్రధాన పాత్ర. సంప్రదాయాలు, కుటుంబ ఆంక్షల మధ్య పెరుగుతున్న ఆమె తన జీవితంపై తానే నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటుంది. ఒకరోజు టెలివిజన్‌లో గంగూలీ లార్డ్స్ బాల్కనీలో సంబరాలు చేసుకున్న దృశ్యాన్ని చూస్తుంది. ఆ సంఘటన ఆమెపై ప్రభావం చూపుతుంది. ఇతరులు విధించిన నియమాలకు తలవంచకుండా తనదైన మార్గంలో ముందుకు సాగేందుకు ఆ దృశ్యం ఆమెకు స్ఫూర్తినిస్తుంది.
అంటే, క్రికెట్లో గంగూలీ చేసిన తిరుగుబాటు తరహా సంబరాన్ని.. ఒక యువతి తన జీవితంలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటానికి ప్రతీకగా ఈ సినిమా ఉపయోగించుకుంటోంది.
అసలు సమస్య ఇప్పుడే మొదలైంది!
గంగూలీ పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడకముందే సినిమా విడుదలకు మార్గం సుగమం కావడంతో, ఈ వివాదం ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. చరిత్రలో నిలిచిపోయిన ఒక క్రీడా ఘట్టం నుంచి స్ఫూర్తి పొంది కొత్త కథను చెప్పే హక్కు చిత్రనిర్మాతలకు ఎంతవరకు ఉంటుంది? అదే సమయంలో, ఆ ఘట్టంతో ముడిపడిన వ్యక్తి గుర్తింపును వాణిజ్యపరంగా ఉపయోగించడంపై అభ్యంతరం చెప్పే హక్కు ఎంతవరకు ఉంటుంది?
ఈ రెండు అంశాల మధ్య గీత ఎక్కడ ఉందన్నది ఈ కేసులో కీలకంగా మారవచ్చు. ప్రస్తుతానికి ‘దూస్రా’ విడుదలకు అడ్డంకి తొలగినప్పటికీ, గంగూలీ వ్యక్తిత్వ హక్కుల వివాదంపై న్యాయస్థానం ఇచ్చే తదుపరి నిర్ణయమే అసలైన ఆసక్తికరమైన అంశం.
ఇక ప్లబితా బోర్తాకూర్, అంకుర్ వికల్, సమిధా గురు, త్విషా సీమా, కృష్ణ గోకాని ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. మాషా సజ్దే, రోహన్ సజ్దే ఈ చిత్రాన్ని నిర్మించగా, నీతా షా సహ నిర్మాతగా వ్యవహరించారు. అగ్నెల్లో ఓస్విన్ డయాస్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్ సంపత్ సంగీతాన్ని సమకూర్చారు.
విడుదల తేదీ: అక్టోబర్ 23, 2026.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








