అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు భారీ షాక్.. వీసా వెయిటింగ్ లెక్కలు మారాయి!
అమెరికాలో ఉంటున్న పిల్లల దగ్గరకు వెళ్లాలనుకుంటున్నారా? అక్కడ చదువుకుంటున్న మీ అబ్బాయి లేదా అమ్మాయిని చూడాలని ప్లాన్ చేస్తున్నారా? లేదంటే కుటుంబంతో కలిసి అమెరికా ట్రిప్‌కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ ప్రయాణ ప్రణాళిక కంటే ముందే వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారతీయులకు విజిటర్ వీసా ఇంటర్వ్యూ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ అక్టోబర్ 21న నవీకరించిన గ్లోబల్ వీసా వెయిట్ టైమ్స్ ట్రాకర్ ప్రకారం.. భారత్‌లోని ఐదు అమెరికా కాన్సులర్ కేంద్రాల్లో విజిటర్ వీసా ఇంటర్వ్యూ కోసం తదుపరి అందుబాటులో ఉన్న అపాయింట్మెంట్కు 7.5 నెలల నుంచి 12 నెలల వరకు వేచి చూడాల్సి రావచ్చు.
విజిటర్ వీసా దరఖాస్తుదారులకు భారీ వెయిటింగ్
అమెరికా B1/B2 విజిటర్ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు నగరాన్ని బట్టి నిరీక్షణ సమయం మారుతోంది. తాజా సమాచారం ప్రకారం..
– ముంబై: 12 నెలలు
– న్యూఢిల్లీ: 11 నెలలు
– హైదరాబాద్: 10.5 నెలలు
– కోల్‌కతా: 8.5 నెలలు
– చెన్నై: 7.5 నెలలు
అంటే హైదరాబాద్‌లోనే అపాయింట్మెంట్ కావాలనుకునేవారు దాదాపు ఏడాది ముందే ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే హైదరాబాద్‌లో టైమ్ ఎక్కువ పడుతుందని వేరే నగరానికి వెళ్లాలనుకున్నా, అక్కడ స్లాట్ల లభ్యతను ముందే చెక్ చేసుకోవడం మంచిది.
విద్యార్థులకు హైదరాబాద్‌లో ఊరట
టూరిస్ట్ వీసాల సంగతి ఇలా ఉంటే, అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు (F, M, J వీసాలు) మాత్రం కాస్త ఉపశమనం లభించే వార్త ఇది. విద్యార్థి వీసాల విషయంలో హైదరాబాద్ కాన్సులేట్ చాలా వేగంగా స్పందిస్తోంది. ఇక్కడ కేవలం ఒక్క నెల వ్యవధిలోనే ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులోకి వస్తున్నాయి.
మిగతా నగరాలతో పోలిస్తే విద్యార్థులకు హైదరాబాద్‌లోనే వేగంగా అపాయింట్మెంట్ దొరుకుతోంది. కోల్‌కతాలో 2.5 నెలలు, న్యూఢిల్లీలో 3 నెలలు, చెన్నైలో 3.5 నెలలు, ముంబైలో 4 నెలల సమయం పడుతోంది. అమెరికా యూనివర్సిటీల్లో సీటు సాధించిన తెలుగు విద్యార్థులకు ఇది నిజంగా పెద్ద ఊరటే.
వర్క్ వీసాల పరిస్థితి ఏమిటి?
H-1B, L-1 సహా ఇతర వర్క్ వీసాల (H, L, O, P, Q) విషయంలో హైదరాబాద్‌లో కొంత సమయం పడుతోంది. హైదరాబాద్ కాన్సులేట్‌లో ఉద్యోగ వీసాల కోసం ఇంటర్వ్యూ దొరకాలంటే సుమారు 6.5 నెలలు వేచి చూడాల్సి వస్తోంది. అయితే మిగతా నగరాల్లో ఈ నిరీక్షణ సమయం కాస్త తక్కువగా ఉంది. న్యూఢిల్లీలో 3.5 నెలలు, చెన్నైలో 2.5 నెలలు, ముంబైలో 2 నెలలు కాగా, కోల్‌కతాలో కేవలం ఒక్క నెలలోనే స్లాట్లు లభిస్తున్నాయి.
త్వరగా అపాయింట్మెంట్ పొందడం ఎలా?
అమెరికా విదేశాంగ శాఖ ఎంబసీలు, కాన్సులేట్లు ఎప్పటికప్పుడు అదనపు ఇంటర్వ్యూ స్లాట్లను విడుదల చేస్తుంటాయని తెలిపింది. ఇప్పటికే ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తీసుకున్నవారు అధికారిక అపాయింట్మెంట్ వ్యవస్థలో ముందస్తు తేదీల కోసం పరిశీలించవచ్చు. అనుకూలమైన తేదీ అందుబాటులోకి వస్తే, నిబంధనలకు అనుగుణంగా అపాయింట్మెంట్ను మార్చుకోవచ్చు.
ఫైనల్ గా..
అమెరికా వెళ్లేందుకు టికెట్లు, హోటళ్లు బుక్ చేసుకోవడం మాత్రమే సరిపోదు. వీసా ఇంటర్వ్యూ ఎప్పుడు దొరుకుతుందన్నది కూడా ప్రయాణ ప్రణాళికలో కీలక అంశంగా మారింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








