శాంతియుత నిరసనలు ఆరోగ్యకర పరిణామం.. మార్కో రూబియో కామెంట్స్..!
భారత్ లో జరుగుతున్న నిరసనలు.. ఆదేశం యొక్క అంతర్గత విషయమన్నారు అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో. అంతే కాదు…ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసనలు, రాజకీయ విభేదాలు సర్వసాధారణమని, ఇలాంటివి తమ దేశంలోనూ నిత్యం జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో జరుగుతున్న నిరసనల గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.
భారత్‌లో నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం మితిమీరిన బలప్రయోగం చేస్తోందంటూ ఐక్యరాజ్యసమితి నిపుణులు ఇటీవల చేసిన విమర్శలపైనా రూబియో అభిప్రాయం కోరారు. దీనిపై ఆయన బదులిస్తూ, “ఒక దేశ అంతర్గత అంశాల్లో నేను జోక్యం చేసుకోను. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలు బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారంటే, అక్కడ రాజకీయ చర్చలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయని అర్థం. ఇది ఆరోగ్యకరమైన సంకేతమే,” అని వివరించారు.
మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న మార్కో రూబియో.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన చమురు శుద్ధి కర్మాగారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌ను “రిఫైనింగ్ సూపర్‌పవర్”గా అభివర్ణించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, వెనెజువెలా చమురుకు అమెరికా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్న తరుణంలో రూబియో పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఇంధన, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.








