ఉక్రెయిన్ తో త్రైపాక్షిక చర్చలకు సిద్ధమన్న పుతిన్..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు పడింది. శాంతి స్థాపనకు వీలుగా రష్యా, ఉక్రెయిన్, అమెరికాల మధ్య త్రైపాక్షిక చర్చలను పునరుద్ధరించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. అమెరికా-రష్యా ఆర్థిక సంబంధాల పునరుద్ధరణపైనా చర్చలకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో తమకున్న ప్రత్యేక సంబంధాలను ఉపయోగించుకుని అమెరికాతో శాంతికి సహకరిస్తాననీ హామీ ఇచ్చారు.
పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతినిధి (చర్చల రాయబారి) స్టీవ్ విట్కాఫ్ భేటీ అయ్యారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 3 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో యుద్ధం ముగింపుపై చర్చించారు. ట్రంప్ అల్లుడు, చర్చల ప్రతినిధి జేర్డ్ కుష్నర్ వీడియో కాన్ఫరెన్సుద్వారా పాల్గొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా భారీగా దాడులకు దిగడం, ఒప్పందానికి రావాలని జెలెన్స్కీపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధం ముగింపు కోసం ట్రంప్, విట్కాఫ్ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా పుతిన్ ప్రశంసించారు. తమ చర్చలు ఫలవంతమైతే శాంతి యత్నాలపై సాంకేతిక కమిటీలు సమావేశమై ముందుకు తీసుకెళ్తాయని విట్కాఫ్ తెలిపారు. మంగళవారం ఆయన.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు కొందరు యూరప్ నేతలతో నార్వేలోని ఓస్లోలో భేటీ అయ్యారు.
చర్చలకు ఓకే అంటున్న రష్యా..
ఉక్రెయిన్‌పై అమెరికా తాజా ప్రతిపాదనలను వినడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే అద్భుతాలను ఆశించలేమని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల అనంతరం బుధవారం పుతిన్‌తో విట్కాఫ్ భేటీ అయ్యారు.
మరోవైపు రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని జెలెన్స్కీపై ట్రంప్ మంగళవారం ఒత్తిడి తెచ్చారు. ‘‘జెలెన్స్కీ ఒప్పందం చేసుకోవాలని మేం కోరుకుంటున్నాం. ఆ దేశానికి మేం చాలా ఇచ్చాం. దానికి ప్రతిగా మాకు బాధ, ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం తప్ప ఏమీ మిగల్లేదు. ఒప్పందం కుదరకపోతే మరింత పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.








