70% వెబ్సైట్లు ఏ క్షణంలోనైనా క్రాష్ కావచ్చా? ఇంటర్నెట్ ‘బ్లాక్ డే’ వస్తోందా?
మన రోజువారీ జీవితంలో పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తూనే ఉంటాం. వార్తలు చదవాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నా, బ్యాంకు పనులు పూర్తి చేయాలన్నా అంతా ఇంటర్నెట్టే. మనకి అన్నీ ఎప్పటిలాగే ప్రశాంతంగా, మామూలుగానే కనిపిస్తుంటాయి. కానీ, మనం చూస్తున్న ఆ వెబ్సైట్ వెనుక ఉన్న సర్వర్‌ను ఎవరో తమ కంట్రోల్లోకి తీసుకుని, మనకు తెలియకుండానే డేటాను కొట్టేసే ప్లాన్ చేస్తుంటే? వినడానికే కాస్త భయంగా ఉంది కదూ! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులను నిద్రపోనివ్వకుండా చేస్తున్న అసలు భయం కూడా ఇదే.
ఏంటి ఆ 70 శాతం వెబ్సైట్ల కథ?
మనం చూసే కోట్లాది వెబ్సైట్లు వెనుక సరిగ్గా పనిచేయడానికి రకరకాల సాఫ్ట్వేర్లు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు సహాయపడతాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది ‘PHP’. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం వెబ్సైట్లు ఈ PHP ఆధారంగానే నడుస్తున్నాయని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ఒక కథనంలో తేల్చిచెప్పింది. ఇప్పుడు అసలు చిక్కల్లా ఆ PHP సాంకేతికతలోనే ఒక ప్రమాదకరమైన సెక్యూరిటీ బగ్ బయటపడటంతో వచ్చింది. డెవలపర్లు అక్టోబర్ 21న ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు గనుక దాడి చేస్తే, ఏకంగా సర్వర్లనే తమ చేతుల్లోకి తీసుకోగలరు. అంటే వెబ్సైట్లో ఏదో చిన్న సమస్య రావడం కాదు, ఆ వెబ్సైట్ నడిచే మూల వ్యవస్థనే హ్యాకర్లు మార్చేసే ప్రమాదం ఉందన్నమాట. అయితే PHP వాడుతున్న 70 శాతం వెబ్సైట్లు వెంటనే హ్యాక్ అయిపోయాయని కంగారు పడక్కర్లేదు. కానీ, అవన్నీ ప్రమాదపుటంచున ఉన్నాయనేది మాత్రం పచ్చి నిజం.
AI కనిపెట్టింది సరే.. అదే AI హ్యాక్ చేస్తే?
ఈ బగ్ విషయంలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. దీన్ని కనిపెట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). సాధారణంగా సాఫ్ట్వేర్లలో ఎక్కడో దాగున్న చిన్న చిన్న లోపాలను పట్టుకోవడానికి సైబర్ నిపుణులకు కొన్ని రోజుల సమయం పడుతుంది. కానీ AI రంగంలోకి దిగడంతో ఆ పని చిటికెలో పూర్తవుతోంది.
అంతవరకు బాగానే ఉంది కానీ, నాణేనికి రెండో వైపు చూస్తేనే అసలు భయం మొదలవుతుంది. మంచోళ్లు వాడే AI టెక్నాలజీనే హ్యాకర్లు కూడా వాడితే పరిస్థితి ఏంటి? సెక్యూరిటీ నిపుణులు లోపాన్ని సరిదిద్దే లోపే, హ్యాకర్లు ఆ AI సాయంతో లోపాన్ని వాడుకుని దాడులు చేసేస్తే? దాడికి, దాన్ని అడ్డుకోవడానికి మధ్య ఉండే సమయం తగ్గిపోవడం వల్ల వెబ్సైట్ నిర్వాహకులకు దాన్ని సరిచేసుకునే అవకాశమే దొరక్కపోవచ్చు.
ఇవి కూడా చదవండి
మనకేంటి నష్టం?
వెబ్సైట్ హ్యాక్ అయితే నష్టం కేవలం దాని యజమానులకే అనుకుంటే పొరపాటే. సర్వర్‌పై హ్యాకర్లకు పూర్తి నియంత్రణ వస్తే, అక్కడ ఉన్న కోట్లాది మంది వినియోగదారుల డేటా ప్రమాదంలో పడుతుంది. ఆ వెబ్‌సైట్‌ను నమ్మి వాడుతున్న సాధారణ ప్రజలు, సంస్థలు అన్నీ పరోక్షంగా దెబ్బతింటాయి. అందుకే కొందరు ముందస్తు జాగ్రత్తగా, నష్టం జరగకముందే తమ వెబ్సైట్లను తాత్కాలికంగా ఆఫ్‌లైన్‌లోకి తీసుకెళ్తున్నారు.
కొంతకాలం సైట్ బంద్ అయితే వ్యాపారం తగ్గుతుంది, యూజర్లకు ఇబ్బంది అవుతుంది నిజమే.. కానీ డేటా పోయి పూర్తిగా మునిగిపోవడం కంటే ఇది నయమని వాళ్లు భావిస్తున్నారు. ప్రస్తుతం డెవలపర్లు ఈ సమస్యకు తగిన అప్డేట్స్ ఇస్తున్నారు. వెబ్సైట్ నిర్వాహకులు వెంటనే తమ సెక్యూరిటీ వర్షన్లను చెక్ చేసుకుని, అప్డేట్ చేసుకోవడమే దీనికి తక్షణ పరిష్కారం.
కొత్తగా మొదలైన AI సైబర్ యుద్ధం!
ఇప్పటివరకు మనం AI అంటే ఉద్యోగాలు పోతాయా, కొత్త టెక్నాలజీ వస్తుందా అని మాత్రమే ఆలోచించాం. కానీ ఇప్పుడు అది ఏకంగా ఇంటర్నెట్ భద్రతనే ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ఒకవైపు మన సిస్టమ్స్‌లో ఉన్న తప్పులను వెతికి పెట్టడానికి AI సహాయపడుతుంటే, మరోవైపు అదే వేగంతో మనపై దాడి చేయడానికి కూడా AI ఉపయోగపడుతోంది.
బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్, సర్కారు సేవలు.. ఇలా మనం రోజూ వాడే ప్రతి వ్యవస్థకు ఇది పెద్ద హెచ్చరికే. ఇప్పటివరకు హ్యాకర్లు ఎక్కడ ఖాళీ ఉందో వెతుక్కుంటూ కూర్చునేవారు, కానీ ఇప్పుడు ఆ పనిని AI వాళ్లకు ఎంతో తేలిక చేసేసింది. మరి ఆ లోపాన్ని సెక్యూరిటీ టీమ్స్ ముందుగా సెట్ చేస్తాయా, లేక హ్యాకర్లే ముందుగా దాన్ని వాడుకుని దెబ్బ కొడతారా అన్నదే రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








