TTA న్యూయార్క్ చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
TTA న్యూయార్క్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అత్యంత శ్రద్ధా భక్తులతో, ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. కొందరు మహిళలతో కూరగాయలతో అత్యంత అందంగా అలంకరించి, శాకంబరీ మాత రూపంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. రఘురామ పన్నాల, భారతి గారు ఇలా తీర్చిదిద్దారు.
అయితే 360 డిగ్రీలు తిరిగి అద్భుతమైన12 అడుగుల బతుకమ్మ అందర్నీ విశేషంగా ఆకర్షించింది. సుందరమైన పూలతో అలంకరించి, ఆశీస్సులు అందించేలా దీనిని తయారు చేశారు. టీటీఏ న్యూయార్క్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ ఎంజపురి ఈ బతుకమ్మను ఊహించి, రూపకల్పన చేయగా.. బృందమంతా అసాధారణ అంకితభావం, టీమ్వర్క్ మరియు భక్తితో పూల అలంకరణను చేశారు.

మహిళలందరూ సంప్రదాయ దుస్తుల్లో 600 మందికి పైగా పాల్గొన్నారు. 60 కి పైగా బతుకమ్మలను తయారు చేసి, తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు.ఇంత మంది ఉత్సాహంగా పాల్గొనడంతో తెలంగాణ గొప్ప వారసత్వానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.అంతేకాకుండా తెలుగు రుచులతో కూడిన రుచికరమైన భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమానికి TLCA, NYTTA భాగస్వామ్యాన్ని అందించాయి.
ఇక.. అందమైన బతుకమ్మలను తయారు చేసిన వారికి బహుమతుల ప్రదానం కూడా చేశారు. బతుకమ్మల కోసం డైమండ్ స్టడ్స్, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ స్పాన్సర్ చేసిన దాతలకు టీటీఏ న్యూయార్క్ చాప్టర్ ధన్యవాదాలు తెలిపింది. అదేవిధంగా పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.మన గొప్ప తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో నిరంతరం స్ఫూర్తినిస్తూ, మద్దతునిస్తున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








