జుకర్‌బర్గ్‌ను విలన్‌గా చూపిస్తున్నారా? ‘The Social Reckoning’ లో అసలు కథేంటి!
–సూర్య ప్రకాష్ జోశ్యుల
సోషల్ మీడియాలో మనం చూసే ప్రతీ పోస్ట్, చేసే ప్రతీ కామెంట్ మన భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ఎప్పుడైనా గమనించారా? కోట్ల మందిని ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చి కలిపిన ఫేస్బుక్, కాలక్రమేణా అదే ప్రజల మధ్య కోపాన్ని, వివాదాలను, రాజకీయ విభజనలను పెంచి లాభాలు ఆర్జించిందా?. సరిగ్గా ఇలాంటి సంచలనాత్మక అంశాల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన చిత్రమే ‘The Social Reckoning’.
ఒక పుట్టుక కథ కాదు.. పెను మార్పుల కథ!
2010లో ఫేస్బుక్ ఆరంభం, దాని సృష్టికర్త ఆలోచనల నేపథ్యంతో వచ్చిన ‘The Social Network’ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించిన ఆరోన్ సోర్కిన్ (Aaron Sorkin), ఇప్పుడు మరోసారి దర్శకుడిగా, రచయితగా అదే ఫేస్బుక్ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తున్నారు.
సీక్వెల్ కాదు
అయితే ఇది కేవలం ఆ సినిమాకు మామూలు సీక్వెల్ కాదు. ఫేస్బుక్ ఎలా ఒక మహా శక్తిగా ఎదిగింది, ఆ అపరిమిత శక్తి సమాజంపై ఎలాంటి ముద్ర వేసింది అని విశ్లేషించే ఒక ప్రత్యేక ‘కంపానియన్ పీస్’. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సిస్ హౌగెన్ కంపెనీలోని అంతర్గత రహస్య పత్రాలను బయటపెట్టడం, దాని ఆధారంగా వాల్ స్ట్రీట్ జర్నల్ ‘ఫేస్బుక్ ఫైల్స్’ పేరుతో చేసిన పరిశోధనలే ఈ సినిమాకు ప్రధాన ఆధారం. ఈ ఉత్కంఠభరిత కథనంలో హౌగెన్గా మైకీ మాడిసన్, జర్నలిస్ట్ జెఫ్ హోర్విట్జ్గా జెరెమీ అలెన్ వైట్ నటిస్తుండగా, మార్క్ జుకర్‌బర్గ్ పాత్రలో జెరెమీ స్ట్రాంగ్ కనిపిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 9, 2026న థియేటర్లలోకి రాబోతోంది.
వ్యవస్థను శాసించే హీరో.. నిజంగానే విలనా?
ఈ సినిమా జుకర్‌బర్గ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దాంతో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో ఆయనను కేవలం ఒక దుర్మార్గుడిగా చూపించడం కంటే, ఒక విప్లవాత్మక వ్యవస్థను సృష్టించి, అది తన చేతులు దాటి పెరిగిపోయినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలను ఎత్తిచూపడమే ప్రధాన లక్ష్యం.
కథకు అసలైన భావోద్వేగ బలం ఫ్రాన్సిస్ హౌగెన్, జర్నలిస్ట్ జెఫ్ల పోరాటమే. వీరిద్దరి ఆశయాలకు ఎదురుగా నిలిచే ఒక అత్యంత శక్తివంతమైన మైండ్ కాబట్టే జుకర్‌బర్గ్ పాత్ర ఇక్కడ నెగిటివ్ షేడ్స్ లో వెళ్తుంది. ఏకకాలంలో ఒక వైపు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజం, మరోవైపు నిజాన్ని బయటపెట్టాలనుకునే ఒకే ఒక్క ఉద్యోగి.. ఈ డేవిడ్ వర్సెస్ గోలియత్ తరహా పోరాటమే ఈ థ్రిల్లర్‌కు ప్రాణం.
మన కోపమే ఒక బిజినెస్ మోడల్ అయితే?
ఈ సినిమాలోని అత్యంత కీలకమైన భాగం ఫేస్బుక్ వాడే ‘అల్గారిథమ్’. మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు ఏం కనిపించాలనేది ఈ వ్యవస్థే నిర్ణయిస్తుంది. 2018 ప్రాంతంలో engagement తగ్గుతున్న సమయంలో, లైక్స్ కంటే కామెంట్లకు, షేర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సిస్టమ్‌ను మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది.
ప్రజలను ఎక్కువగా స్పందించేలా చేసే కంటెంట్‌లో కోపం, వివాదం, రెచ్చగొట్టే విషయాలే ఎక్కువగా ఉంటాయని కంపెనీకి తెలిసినా లాభాల కోసం దాన్ని కొనసాగించారా అనే ప్రశ్నలను సోర్కిన్ చాలా ఘాటుగా సంధించారు. అంటే మన నిత్య జీవితంలో వ్యక్తమయ్యే ఆవేశం, ఆందోళనలే ఒక కంపెనీకి కోటానుకోట్ల బిజినెస్‌గా మారాయా అనే నిజాన్ని ఈ కథ మన ముందుకు తెస్తుంది.
కాలం మారేకొద్దీ మనుషుల తీరూ మారుతుంది!
పదహారేళ్ల క్రితం ‘The Social Network’లో జెస్సీ ఐసెంబర్గ్ పోషించిన జుకర్‌బర్గ్ ఒక నూతన ఉత్సాహం, అహంకారం కలిగిన యువకుడు. కానీ ఇప్పుడు జెరెమీ స్ట్రాంగ్ ప్రతిబింబిస్తున్న జుకర్‌బర్గ్ ఒక ప్రపంచ స్థాయి సోషల్ మీడియా సామ్రాజ్యానికి అధిపతి.
సోర్కిన్ ఉద్దేశం ప్రకారం జుకర్‌బర్గ్ మొదటి నుంచీ సమాజానికి హాని చేయాలని అనుకోలేదు. అందరినీ కలపాలని ఒక మంచి ఆలోచనతో మొదలుపెట్టిన వ్యవస్థ, తన పరిధిని దాటి ఊహించనంత పెద్దదిగా మారింది. మరి అంత భారీ శక్తిగా మారిన తర్వాత దానివల్ల జరిగే మంచి చెడులకు బాధ్యత ఎవరిది అనేదే ఈ సినిమా వేసే అతిపెద్ద ప్రశ్న.
లెక్కలు తేల్చాల్సిన సమయం ‘Reckoning’!
‘The Social Network’ అంటే ఫేస్బుక్ ఎలా పుట్టిందో చెప్పే కథ అయితే, ‘The Social Reckoning’ అంటే అది అంతటి స్థాయికి చేరిన తర్వాత చేసిన పనులకు లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఈ సినిమా కేవలం జుకర్‌బర్గ్ అనే వ్యక్తి గురించి మాత్రమే కాదు; రోజూ మన వేలిముద్రల కింద నడిచే సోషల్ మీడియా మాయాజాలం గురించి, మన సమయాన్ని, దృష్టిని డబ్బుగా మార్చుకునే వ్యవస్థల గురించి.
అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం చూశాక.. అసలు విలన్ జుకర్‌బర్గ్ ఒక్కడేనా లేక మనల్ని ఆవహించిన ఈ సోషల్ మీడియా వ్యవస్థా అనే ఆలోచన ప్రతీ ఒక్కరిలోనూ ఖచ్చితంగా రేకెత్తుతుంది.








