బీజేపీ నేతలకు కొత్త ఇన్‌ఛార్జ్‌ల ‘క్లాస్’!?
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు, నాయకుల పనితీరుపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా దృష్టి పెట్టింది. పార్టీలో నెలకొన్న స్తబ్ధతను, బాధ్యతారహిత్య ధోరణికి చెక్ పెట్టేందుకు పార్టీ కొత్త ఇంచార్జ్‌లు మధుకర్, అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. తాజాగా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో వీళ్లిద్దరూ.. నేతల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. కఠిన హెచ్చరికలు జారీ చేశారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేయని వారికి భవిష్యత్తులో పదవులు దక్కవని తేల్చిచెప్పారు.
పార్టీ నూతన ఇంచార్జ్‌లుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మధుకర్, అభయ్ పాటిల్ తొలి సమావేశంలోనే దూకుడు ప్రదర్శించారు. రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కేవలం హైదరాబాద్‌లోని హెడ్‌క్వార్టర్స్‌కే పరిమితం కావడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీలోని ముగ్గురు మినహా మిగతా అందరూ ఎప్పుడూ రాష్ట్ర కార్యాలయంలోనే ఉంటున్నారని, క్షేత్రస్థాయికి వెళ్లే సాహసం చేయడం లేదని వారు తప్పుబట్టారు. కేవలం కార్యాలయాలకే పరిమితమైతే ప్రజల్లోకి ఎలా వెళ్తామని, అధికారంలోకి ఎలా వస్తామని ప్రశ్నించారు. కనీసం క్రియాశీల సభ్యత్వం కూడా లేని వారు రాష్ట్ర స్థాయి కీలక బాధ్యతల్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లకే జవాబుదారీతనం లేకపోతే, జిల్లా అధ్యక్షులను ప్రశ్నించగలమా అని నిలదీశారు.
ఇవి కూడా చదవండి
కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో మేనేజ్మెంట్ ద్వారా పదవులు తెచ్చుకునే సంస్కృతి పెరిగిపోయిందని, ఇకపై అది నడవదని ఇంచార్జ్‌లు స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారికి, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే వారికే తగిన గుర్తింపు ఉంటుందని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా నాయకులు తమ వైఖరిని మార్చుకుని విధిగా జిల్లాల వారీగా టూర్లు చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాల కోసం, దాని ఉనికి కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల ఆశయాలను నెరవేర్చాలంటే ప్రతి ఒక్కరూ గ్రౌండ్లోకి దిగి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇటీవల బీజేపీలో కొంత నిరుత్సాహం, వర్గపోరు తలెత్తాయన్నది బహిరంగ రహస్యమే. రాష్ట్ర నాయకత్వంపై పట్టు సడలుతోందనే విమర్శలు వస్తున్న తరుణంలో, హైకమాండ్ రంగంలోకి దిగిన తీరు పార్టీ శ్రేణుల్లో కదలిక తెచ్చే ప్రయత్నంగా భావించవచ్చు. అయితే, దశాబ్దాలుగా పదవులు అనుభవిస్తూ కేవలం నగర రాజకీయాలకే పరిమితమైన సీనియర్లను గాడిలో పెట్టడం కొత్త ఇంచార్జ్‌లకు కత్తి మీద సాము లాంటిదే. క్షేత్రస్థాయిలో క్రియాశీలతను పెంచేందుకు ఈ క్లాస్‌లు సరిపోతాయా, లేక పార్టీలో అంతర్గత అసంతృప్తిని మరింత పెంచుతాయా అనేది రానున్న కాలంలో తేలనుంది.








