‘తానా’ పురస్కారాల ప్రదానోత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆహ్వానం…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా – TANA) ఆధ్వర్యంలో డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ‘తానా పురస్కారాల ప్రదానోత్సవం’ అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. వివిధ రంగాలలో అద్భుతమైన సేవలు అందించిన పది మంది ప్రముఖులను ఈ వేదికపై సత్కరించనున్న నేపథ్యంలో, ఈ వేడుకలకు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తుశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావును తానా బోర్డ్ సభ్యుడు రవి పొట్లూరి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తానా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ పురస్కారాల వేడుకకు తాను తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ పూర్తి సహకారం అందించడంతో పాటు తానాతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
కాగా, ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులకు తానా పురస్కారాలను అందజేయనున్నారు. అవార్డులు అందుకోనున్న వారిలో అమరరాజా గ్రూప్ ఫౌండర్ డా. రామచంద్ర నాయుడు గల్లా, ప్రముఖ గీత రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ (తానా అందె శ్రీ పురస్కారం), శ్రీమతి జమీలా నిషాత్, డా. సునితా కృష్ణన్, శ్రీ జయధీర్ తిరుమల రావు, శ్రీ గడ్డం సమ్మయ్య, శ్రీ చింతకింది మల్లేశం, శ్రీ చింతల వెంకట్ రెడ్డి , శ్రీ దాసరి కొండప్ప తదితరులు ఉన్నారు.







