‘‘ఇదే మీ ఇల్లు’’.. అంటూ అస్తిత్వ, విద్వేషాల ప్రకటనల నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ ప్రకటన
హిందూ వ్యతిరేక ద్వేషం, మత వివక్ష, రాజకీయ ప్రచారాల్లో పెరుగుతున్న విద్వేషపూరిత ధోరణులపై న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీ తీవ్రంగా స్పందించారు. “తమ సొంత ఊళ్లకు తిరిగి వెళ్లిపోండి అని ఎవరినైతే అన్నారో, ఎవరి అస్తిత్వాన్ని అయితే ప్రశ్నించారో, వారందరికీ నేను ఒకటే స్పష్టంగా చెబుతున్నాను — ఇదే మీ ఇల్లు,” అంటూ ప్రకటించారు. దీపావళి వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం “తన జీవితంలోనే దక్కిన గొప్ప గౌరవం, అదృష్టం” అని మమ్దానీ పేర్కొన్నారు. న్యూయార్క్ నగర మేయర్గా పనిచేస్తున్న తొలి భారతీయ-అమెరికన్ తానేనని ఆయన గుర్తు చేశారు.
భారతీయ సంప్రదాయ దుస్తుల్లో వేదికపైకి వచ్చిన ఆయన.. అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, మతపరమైన వర్గాలను లక్ష్యంగా చేసుకునే ద్వేషాన్ని ఎదుర్కోవాల్సిన అవసరంపై సూటిగా మాట్లాడారు.ఇటీవలి నెలల్లో దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలు దాడులకు గురయ్యాయని, అలాగే సిక్కు సమాజం కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాఖ్య ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నాయకులు సైతం సిక్కులను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు సమాజంలో ఏదో ఒక మూలకు మాత్రమే పరిమితమైన పక్షపాత ధోరణి, ఇప్పుడు ప్రధాన స్రవంతి రాజకీయ ప్రచారాల్లో భాగమవుతోందని మమ్దానీ హెచ్చరించారు.
భయం, మతపరమైన గుర్తింపుల ఆధారంగా సాగే రాజకీయ ప్రచారాలను ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. “అది వాషింగ్టన్లో అయినా, ఢిల్లీలో అయినా సరే.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ధోరణులను, ఈ లోకంలో చీకటిని నింపే ఎలాంటి రాజకీయాలనైనా తిరస్కరించాల్సిన ఉమ్మడి బాధ్యత ఈ పండుగ వేళ మనందరిపై ఉంది,” అని ఆయన అన్నారు.ఒకే మార్గాన్ని అనుసరించాలని పట్టుబట్టకుండా, విభిన్న ఆరాధనా పద్ధతులను, సత్యానికి సంబంధించిన అనేక కోణాలను అంగీకరించే గొప్ప సంప్రదాయంగా హిందూ మతాన్ని ఆయన అభివర్ణించారు.
“మన ఉమ్మడి వారసత్వం ఎన్నడూ ఒకే భాషకో, ఒకే విశ్వాసానికో పరిమితం కాలేదు. హిందూ మతంలో ఎంతటి సౌందర్యం, విజ్ఞానం దాగి ఉన్నాయో నా తల్లి తరపు కుటుంబం నాకు చిన్నప్పుడే నేర్పింది,” అని మమ్దానీ పేర్కొన్నారు.హిందూ గ్రంథాలను ప్రస్తావిస్తూ.. సత్యాన్ని వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చనే నమ్మకాన్ని, మత సరిహద్దులకు అతీతంగా ప్రజలందరినీ ఒకే ఆధ్యాత్మిక శక్తి కలుపుతుందనే భావనను ఆయన నొక్కిచెప్పారు. “ఇది అనేక దేవతలను ఆరాధించే విశ్వాసం… ‘సత్యం’ చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని దీని అత్యంత పురాతన గ్రంథం మనకు బోధిస్తుంది. మనం మందిరంలో ప్రార్థించినా, మసీదులో ప్రార్థించినా, గురుద్వారాలో ప్రార్థించినా, లేదా ఎక్కడా ప్రార్థించకపోయినా మనందరిలోనూ ఒకే జ్యోతి వెలుగుతోంది,” అని మమ్దానీ అన్నారు.
మనం ఎలాంటి మానవ సంబంధాలను నిర్మించుకోవాలని ఆశిస్తామో ‘రామాయణం’ చూపిస్తే, కుటుంబ జీవితంలోని సంక్లిష్టతలను, వ్యక్తిగత విధేయతకు, నైతిక బాధ్యతకు మధ్య జరిగే సంఘర్షణను ‘మహాభారతం’ ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
“మనం ఎలాంటి సోదరుడిగా, భార్యగా, భర్తగా, స్నేహితుడిగా ఉండాలనుకుంటామో రామాయణం చూపిస్తుంది. కానీ నిజమైన కుటుంబాలు ఎలా ఉంటాయో, అత్యంత ధైర్యవంతులైన వీరులు, జ్ఞానులైన దేవతలు సైతం ఎలా తడబడతారో, అలాగే వ్యక్తిగత విధేయత కంటే ‘ధర్మానికే’ ఎలా పెద్దపీట వేయాలో మహాభారతం మనకు తెలియజేస్తుంది,” అని ఆయన వివరించారు.







