‘ఆకాశంలో ఒక తార’ తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది : డైరెక్టర్ పవన్ సాధినేని
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి. ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పవన్ సాధినేని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఆకాశంలో ఒక తార ఎలా ఉండబోతోంది?
‘ఆకాశంలో ఒక తార’ చాలా ఇష్టంగా రాసుకున్న కథ. సినిమా కూడా అంతే అద్భుతంగా వచ్చింది. అల్లు అరవింద్ గారు, స్వప్న గారు, సందీప్ గున్నం గారు.. ఇలా ప్రతి ఒక్కరూ ఒక సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. ప్రేక్షకులకు చూపించాలనే ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనుసులో నవ్వు కనిపిస్తుంది. ఈ సినిమాను మీ ఫ్యామిలీతో కలిసి చూడండి. పిల్లలు ఉంటే వాళ్లను కూడా తీసుకెళ్లండి. చాలా ఇన్స్పైర్ అవుతారు.
ఆకాశంలో ఒక తార స్త్రీ సాధికారతకు సంబంధించిన కథనా? ఇందులో డ్రామా ఎలా ఉండబోతోంది?
-ఇది ప్రత్యేకంగా స్త్రీ సాధికారతకు సంబంధించిన సినిమా అయితే కాదు. ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ చెప్పాలని కూడా మా ఉద్దేశం లేదు. సమాజంలో ఉన్నప్పుడు స్త్రీలు, పురుషులు కలిసి జీవిస్తారు. అలాంటి సమాజంలో జరిగే కథే ఇది. ప్రత్యేకంగా స్త్రీల గురించి చెప్పాలనే ఉద్దేశం ఏమీ లేదు. ఒక అమ్మాయి తన కలను సాధించుకోవాలనే ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, ఆ ప్రయాణంలో కృష్ణ ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు? ఆమె ప్రయాణం ఎలా ముందుకు సాగింది? అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉండే కథ. ఇది ఒక ఆశను చిగురింపజేసే కథ. ప్రస్తుత సమాజంలో నెగెటివిటీ చాలా ఎక్కువైపోయింది. ఈ సినిమా చూసిన తర్వాత మన జీవితంలో కూడా కృష్ణలాంటి క్యారెక్టర్ ఉంటే ఎంత బాగుంటుందో అనే ఫీలింగ్ ఆడియన్స్‌కు కచ్చితంగా కలుగుతుంది.
అల్లు అరవింద్ గారు, గుణ్ణం గంగరాజు గారు, స్వప్న గారు.. ఇలా లెజెండరీ ప్రొడ్యూసర్స్‌ను ఈ కథతో ఎలా ఒప్పించారు?
-ఈ కథే వాళ్లను ఒప్పించింది. కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా కచ్చితంగా ఈ సినిమా చేయాలనే ఉత్సాహంతో ముందుకు వచ్చారు. కథ చెప్పిన తర్వాత ఎలాంటి మార్పులు సూచించలేదు. నేను ఏ కథ చెప్పానో అదే కథను తీయమని చెప్పారు. ముందుగా గుణ్ణం గంగరాజు గారి అబ్బాయి సందీప్‌కు ఈ కథ చెప్పాను. తర్వాత అల్లు అరవింద్ గారు, స్వప్న గారు ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు. అల్లు అరవింద్ గారికి నా ‘సేనాపతి’ సినిమా చూసిన తర్వాత ఒక సినిమా చేయాలని అడిగారు. ఆయనకి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాను. అలా ఆయన ఇందులోకి వచ్చారు. దుల్కర్ గారికి కథ చెప్తున్నప్పుడు స్వప్న గారికి కూడా ఈ కథ చాలా నచ్చింది. ఇలాంటి మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో స్వప్న గారు కూడా ప్రాజెక్టులోకి వచ్చారు.
కృష్ణ పాత్ర రాసుకున్నప్పుడు దుల్కర్ గారిని ఉద్దేశించుకుని రాసుకున్నారా?
– ముందు నేను కథను, పాత్రలను రాసుకుంటాను. ఆ తర్వాత ఆ పాత్రలకు ఎవరు న్యాయం చేయగలరో చూస్తాను. కృష్ణ పాత్రకు దుల్కర్ గారు 100 శాతం న్యాయం చేశారు. ఆయన ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ఆయనకు కూడా ఈ కథ చాలా నచ్చింది.
ఇవి కూడా చదవండి
హీరోయిన్ సాత్విక గురించి?
-ఈ కథ కోసం హీరోయిన్ను వెతకడం అనేది మొదటి నుంచి మాకు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇది పూర్తిగా తన చుట్టూ నడిచే కథ. ఇలాంటి సినిమాలకు ఆల్రెడీ పేరున్న హీరోయిన్ అయితే సేఫ్ ఆప్షన్. కాకపోతే కొత్త ముఖం అయితే బాగుంటుందని మొదటి నుంచి భావించాం. ఆ సమయంలో సోషల్ మీడియాలో సాత్విక రీల్స్ చూశాను. తనకు భరతనాట్యం కూడా వచ్చు. ఆడిషన్ చేసి ఈ పాత్రకు ఎంపిక చేశాం. తను ఆ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది.
శ్రుతి హాసన్ పాత్ర గురించి?
కథలో శ్రుతి హాసన్ గారిది చాలా కీలకమైన పాత్ర. ఇప్పటివరకు తను చేసిన పాత్రలన్నింటిలోకి ఇది చాలా మంచి పేరు తీసుకొస్తుంది. తన కెరీర్లోనే గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. తన పాత్రను చూసి ప్రతి మహిళా స్ఫూర్తి పొందేలా వుంటుంది.
ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో ప్రొడక్షన్ పరంగా ఇది చాలా పెద్ద సినిమా కదా? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
-నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో పెద్ద స్టార్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. మా నిర్మాతలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు, కథకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు. ఈ సినిమా తెలుగు సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తుంది. ఇది ఒక తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది.
-ఇది యూనివర్సల్ కథ. అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం.
అల్లు అర్జున్ గారు మీ తొలి సినిమా చూసి ప్రశంసించారు కదా? అది ఎలా జరిగింది?
-నా సినిమా చూసి అభినందించిన తొలి స్టార్ హీరో అల్లు అర్జున్ గారు. అప్పుడు ‘రేసుగుర్రం’ షూటింగ్ జరుగుతోంది. ఆయన నన్ను అక్కడికి పిలిపించి సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నాకు ఎంతో బలాన్నిచ్చింది.
-నేను రాసుకున్న చాలా కథలను అల్లు అర్జున్ గారికి చెబుతుంటాను. ఆయన దగ్గర ఏదైనా కథ ఉన్నా నాకు వినిపించేవారు. అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? కాకపోతే అలాంటి కథతో అంత పెద్ద స్టార్‌ను హ్యాండిల్ చేయగలనని నమ్మకం కుదిరినపుడు బన్నీ గారితో సినిమా చేస్తాను.
ఈ కథ రాయడానికి మీకు ఎలాంటి స్ఫూర్తి కలిగింది?
-కరోనా సమయంలో కల్పనా చావ్లా గారి బయోగ్రఫీ చదువుతున్నాను. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు కల్పనా చావ్లా గారి జర్నీ కంటే ఆమెపై ఆమె భర్తకు ఉన్న ప్రేమ నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. అది నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అక్కడే ఈ కథకు బీజం పడింది.
ఈ సినిమా కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?
-రెండేళ్లపాటు చాలా రీసెర్చ్ చేశాం. శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లతో పాటు ఎంతోమందితో కూర్చుని వాళ్ల సూచనలు, సలహాలు తీసుకున్నాం. అలాగే ఇందులో ఉండే అంతరిక్షానికి సంబంధించిన పదజాలం, ఇతర విషయాల గురించి లుసుకుని అవగాహన పెంచుకున్నాం ఏడాదిన్నర ప్రీ ప్రొడక్షన్ చేసిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాం.
కొత్త సినిమాల గురించి?
-కొంతమంది ప్రొడ్యూసర్స్‌తో కొన్ని ప్రాజెక్టుల కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా తర్వాత వాటి పూర్తి వివరాలు తెలియజేస్తాను.







