సెక్స్ స్కాండల్ ని మించి ట్రంప్‌కు భయపెడుతున్న మరో చీకటి నిజం!
ఓ సెక్స్ స్కాండల్.. ఓ చైనా గూఢచర్యం అనుమానం.. తెర వెనుక వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు! ఇవన్నీ కలిపి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా? ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్ చుట్టూ ముసురుకున్న వివాదం చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. కానీ ట్రంప్‌ను నిజంగా భయపెడుతున్నది హువాంగ్ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలు కాదట! ఆ స్కాండల్ బయటపెడుతున్న మరో చీకటి కోణమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు డేవిడ్ రోత్కాఫ్. ఇంతకీ ఆ రహస్యం ఏంటి? ఎన్విడియాతో ట్రంప్‌కు ఉన్న సంబంధమేంటి? ఈ వివాదం ప్రపంచ మార్కెట్లను కూడా కుదిపేయబోతోందా?
సెక్స్ స్కాండల్‌లో ట్రంప్‌కు ఏమిటి ఇంట్రస్ట్?
ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌కు చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఓ మహిళతో పాటు, తన కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులతోనూ వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హువాంగ్ కంపెనీ నుంచి వైదొలగడం సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై ట్రంప్ స్పందిస్తున్న తీరు కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. హువాంగ్ తిరిగి ఎన్విడియా బాధ్యతలు చేపట్టినా తనకు అభ్యంతరం లేదన్న సంకేతాలను ట్రంప్ ఇవ్వడం వెనుక కారణమేంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇవి కూడా చదవండి
ది డైలీ బీస్ట్ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన డేవిడ్ రోత్కాఫ్.. మహిళలతో సంబంధాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులకు ట్రంప్ వెంటనే మద్దతుగా నిలబడే ధోరణి ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యవహారాలు చివరకు తనపై వచ్చిన ఆరోపణల చర్చకు దారితీస్తాయనే కారణంతోనే ట్రంప్ అలా స్పందిస్తుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే హువాంగ్ విషయంలో ట్రంప్ ఆందోళనకు ఇదొక్కటే కారణం కాదని, అసలు కథ ఆర్థిక ప్రయోజనాల దగ్గర మొదలవుతుందని రోత్కాఫ్ విశ్లేషించారు.
తెర వెనుక కోట్ల డాలర్ల లెక్కలు!
ఇక్కడే ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ బయటపడుతోంది. ఎన్విడియాలో ట్రంప్‌కు భారీగా పెట్టుబడులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఆగస్టు చివరి నాటికి ఆయన వద్ద 13 మిలియన్ డాలర్ల నుంచి 62 మిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా షేర్లు ఉన్నట్లు సమాచారం. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.115 కోట్ల నుంచి రూ.550 కోట్లకు పైగా విలువైన పెట్టుబడులన్నమాట. ఇప్పుడు కంపెనీ చుట్టూ వివాదం ముదిరి షేర్ల విలువ పడిపోతే ఆ ప్రభావం ట్రంప్ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలపైనా పడే అవకాశం ఉంది.
ఇదే అంశాన్ని రోత్కాఫ్ ప్రధానంగా ప్రస్తావించారు. అమెరికాలో అధ్యక్షులు, క్యాబినెట్ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు తాము నియంత్రించే కంపెనీల్లోనే పెట్టుబడులు కలిగి ఉండటం పెద్ద సమస్యగా మారుతోందని ఆయన అన్నారు. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే అధికారం, మరోవైపు అదే కంపెనీల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉండటం ప్రయోజనాల సంఘర్షణకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఎన్విడియా వివాదం ట్రంప్‌కు వ్యక్తిగతంగానూ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ఆయన విశ్లేషణ.
చైనా పేరు బయటకు వస్తే ట్రంప్‌కు మరో చిక్కు!
ఈ స్కాండల్‌లో చైనా గూఢచర్యం కోణం ఉండటం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ సంబంధాలు, ఆయన ఆసియా పర్యటన నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాతో మరో దౌత్యపరమైన వివాదాన్ని తెచ్చుకోవడం ట్రంప్‌కు ఇష్టం లేదని రోత్కాఫ్ అభిప్రాయపడ్డారు.
హువాంగ్‌పై వచ్చిన ఆరోపణల ఆధారంగా చైనాపై గూఢచర్యం ఆరోపణలు చేయడం వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. అందుకే ఈ గూఢచర్యం కోణంపై అమెరికా వైఖరిలో కొంత వెనుకడుగు కనిపిస్తోందని చెప్పారు. ఇతర నిఘా సంస్థల నుంచి సమాచారం వచ్చినప్పటికీ, ఆరోపణలను నిర్ధారించడానికి సరిపడా ఆధారాలు ఉన్నాయా లేదా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్విడియా కుప్పకూలితే ట్రంప్‌కే కాదు.. మార్కెట్లకూ షాక్!
ఈ వివాదం ఒక్క ఎన్విడియా షేర్లకే పరిమితమయ్యే అవకాశం లేదని రోత్కాఫ్ హెచ్చరించారు. ఇప్పటికే ఎన్విడియాతో పాటు ఇంటెల్, ఏఎండీ షేర్లు కూడా పడిపోయాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి చెందిన స్టాక్స్‌తో పాటు మొత్తం టెక్నాలజీ రంగం ఒత్తిడిని ఎదుర్కొందని ఆయన వివరించారు. ఈ వ్యవహారం మరింత ముదిరితే ప్రపంచ మార్కెట్లలో భారీ పతనానికి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా ఆయన బయటపెట్టారు. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ కుమారుడికి చెందిన కంపెనీకి కూడా ఎన్విడియాలో భారీ పెట్టుబడులు ఉన్నాయని ప్రస్తావించారు. అంటే ఈ కంపెనీ చుట్టూ ఏర్పడిన సంక్షోభం ట్రంప్ పెట్టుబడులకే కాకుండా, ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆర్థిక వర్గాల ప్రయోజనాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్నది ఆయన విశ్లేషణ.
ఇవి కూడా చదవండి
ట్రంప్‌కు అసలు భయం..అదేనా?
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్‌కు మరింత ఇబ్బంది కలిగించగల అంశం దర్యాప్తు పరిణామాలేనని రోత్కాఫ్ అభిప్రాయపడ్డారు. ఎన్విడియా చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించి ట్రంప్‌కు ముందే సమాచారం అందిందా? అలా తెలిసినా హువాంగ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా పట్టించుకోలేదా? చైనాతో సంబంధాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో గూఢచర్యం ఆరోపణలను తేలిగ్గా తీసుకున్నారా? అనే ప్రశ్నలు భవిష్యత్తులో తలెత్తవచ్చని ఆయన విశ్లేషించారు.
ఒకవేళ ఈ వ్యవహారంపై దర్యాప్తు మరింత లోతుగా సాగి, ట్రంప్‌కు ముందే సమాచారం అందినట్లు ఆధారాలు బయటపడితే అది రాజకీయంగానూ ఇబ్బందికరంగా మారవచ్చు. మరోవైపు ఎన్విడియా షేర్ల పతనం కొనసాగితే ఆయన వ్యక్తిగత పెట్టుబడులపైనా ప్రభావం పడుతుంది. చైనాతో దౌత్య సంబంధాలు, టెక్నాలజీ మార్కెట్లు, వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు.. ఇలా మూడు వైపుల నుంచి ఈ వివాదం ట్రంప్‌కు సవాలుగా మారే అవకాశం ఉందని రోత్కాఫ్ అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ….
జెన్సన్ హువాంగ్ చుట్టూ మొదలైన సెక్స్ స్కాండల్ ఇప్పుడు ట్రంప్‌కు ఎందుకు ఇంతటి తలనొప్పిగా మారిందో అర్థమవుతోంది. బయటకు కనిపిస్తున్నది వ్యక్తిగత సంబంధాల వివాదమే అయినా, దాని వెనుక కోట్ల డాలర్ల పెట్టుబడులు, చైనాతో రాజకీయ సమీకరణాలు, ప్రపంచ మార్కెట్ల ఆందోళనలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉంది? ట్రంప్‌కు ముందే ఈ వ్యవహారం గురించి తెలుసా? అన్న ప్రశ్నలకు మాత్రం దర్యాప్తు, తదుపరి పరిణామాలే సమాధానం చెప్పాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







