అమెరికాలో 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోనుందా? వైరల్ ప్రచారంలో నిజమెంత?
అమెరికాలో నవంబర్ 17న నిర్వహించనున్న జాతీయ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పరీక్ష ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు కరెంట్, ఇంటర్నెట్, బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు, పెంటగాన్ చేపట్టిన ఓ సైనిక సన్నద్ధత కార్యక్రమం ఈ భయాలను మరింత పెంచాయి. అయితే, నిజంగానే అమెరికా మూడు నెలల పాటు చీకట్లో ఉండబోతోందా? ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది?
సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వేదికగా 90 రోజుల బ్లాక్అవుట్ గురించి పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్ 17న జరగనున్న ఎమర్జెన్సీ అలర్ట్ పరీక్షకు, దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేతకు సంబంధం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. మరికొందరైతే ప్రపంచవ్యాప్తంగా జరిగే సైబర్ దాడి కారణంగా విద్యుత్, ఇంటర్నెట్, బ్యాంకింగ్ వ్యవస్థలు మూడు నెలల పాటు పనిచేయవని చెబుతున్నారు.
అయితే, అమెరికా ప్రభుత్వం కానీ, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (FEMA) కానీ దేశవ్యాప్తంగా విద్యుత్ నిలిపివేసే ప్రణాళికను ప్రకటించలేదు. మరి ఈ 90 రోజుల బ్లాక్అవుట్ ప్రచారం ఎలా మొదలైంది?
నవంబర్ 17న అమెరికాలో ఏం జరగబోతోంది?
అమెరికా ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (FEMA), ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) నవంబర్ 17న దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ (EAS) పరీక్ష నిర్వహించనున్నాయి.
అమెరికా తూర్పు కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ఈ పరీక్ష ప్రారంభం కానుంది. ఇందులో రేడియో, టెలివిజన్ ప్రసార సంస్థలు, కేబుల్ నెట్‌వర్క్‌లు, శాటిలైట్ టీవీ, రేడియో సేవలు పాల్గొంటాయి.
ఈ పరీక్షలో భాగంగా సాధారణ ప్రసారాలను కొద్దిసేపు నిలిపివేసి అత్యవసర హెచ్చరిక సందేశాన్ని ప్రసారం చేస్తారు. ఈ సందేశం సుమారు ఒక నిమిషం పాటు ఉంటుంది.
అందులో ‘ఇది కేవలం పరీక్ష మాత్రమే. ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అనే సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఈసారి నిర్వహించే పరీక్షలో మొబైల్ ఫోన్లకు వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ పంపించరు.
ఇది కొత్తగా చేపడుతున్న కార్యక్రమం కూడా కాదు. అమెరికా చట్టం ప్రకారం ప్రతి మూడేళ్లకు కనీసం ఒకసారైనా జాతీయ స్థాయిలో ప్రజా హెచ్చరిక వ్యవస్థను పరీక్షించాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం.
ఇవి కూడా చదవండి
ఒకవేళ నవంబర్ 17న ఈ పరీక్ష నిర్వహించడం సాధ్యం కాకపోతే, డిసెంబర్ 3ను ప్రత్యామ్నాయ తేదీగా నిర్ణయించారు.
90 రోజుల బ్లాక్అవుట్ ప్రచారం వెనుక పెంటగాన్ కార్యక్రమం!
ఈ పుకార్లు వ్యాపించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి పెంటగాన్ ప్రకటించిన ‘FORTRESS America’ కార్యక్రమం.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సెప్టెంబర్ 30న ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు అమెరికా సైనిక స్థావరాలు బయటి సరఫరాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంచడం దీని లక్ష్యం.
ఈ కార్యక్రమం ప్రకారం సైనిక స్థావరాలకు అవసరమైన విద్యుత్, ఆహారం, తాగునీరు వంటి కీలక వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అలాగే సరఫరా వ్యవస్థలు, రక్షణ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కనీసం 90 రోజుల పాటు సైనిక స్థావరాలు స్వతంత్రంగా పనిచేయగలిగేలా సిద్ధం చేయడం ఈ కార్యక్రమంలోని కీలక అంశం.
అయితే, ఈ 90 రోజుల సన్నద్ధత అంశాన్నే కొందరు సోషల్ మీడియాలో తప్పుగా అర్థం చేసుకున్నారు. సైనిక స్థావరాలు 90 రోజుల పాటు స్వతంత్రంగా పనిచేయాలనే నిబంధనను, అమెరికా మొత్తం 90 రోజుల పాటు చీకట్లో ఉండబోతోందంటూ ప్రచారం చేస్తున్నారు.
కానీ ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం సైనిక స్థావరాల అత్యవసర సన్నద్ధతకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే.
90 రోజుల బ్లాక్అవుట్పై ట్రంప్ నిజంగానే ప్రకటన చేశారా?
ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు.
ట్రంప్ స్వయంగా 90 రోజుల పాటు అమెరికాలో విద్యుత్ అంతరాయం ఏర్పడబోతోందని ప్రకటించినట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నవంబర్ 14న టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో ట్రంప్ ‘ఈ ఏడాది చివరిలోపు 90 రోజుల బ్లాక్అవుట్ జరగబోతోంది’ అని చెప్పినట్లుగా కనిపిస్తుంది.
అయితే, ఈ వీడియో నిజమైనది కాదు. నవంబర్ 16న PolitiFact వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వీడియోను నవంబర్ 9న వైట్‌హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లో ట్రంప్ పాల్గొన్న ఓ కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫుటేజీ నుంచి మార్చారు.
అసలు వీడియోలో ట్రంప్ మాజీ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఇరాన్ యుద్ధం తదితర అంశాలపై మాట్లాడారు. కానీ ఎక్కడా 90 రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ప్రకటించలేదు.
ది వాషింగ్టన్ టైమ్స్ కూడా ట్రంప్ 90 రోజుల బ్లాక్అవుట్ ప్రకటించినట్లుగా చూపించే మార్ఫింగ్ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారంలోకి వచ్చినట్లు వెల్లడించింది.
‘ది సింప్సన్స్’ కూడా బ్లాక్అవుట్ను ముందే ఊహించిందా?
ఈ ప్రచారంలో మరో ఆసక్తికరమైన అంశం ప్రముఖ యానిమేటెడ్ టీవీ సిరీస్ ‘ది సింప్సన్స్’. 2023లో ప్రసారమైన ‘It’s a Blunderful Life’ అనే ఎపిసోడ్లో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్అవుట్ జరుగుతుందని, అది కూడా నవంబర్ 17, 2026న జరుగుతుందని ముందే చూపించారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గతంలోనూ వాస్తవ ప్రపంచంలో జరిగిన కొన్ని సంఘటనలను ‘ది సింప్సన్స్’ ముందే ఊహించిందంటూ అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఈసారి కూడా కొందరు అదే విషయాన్ని ఆధారంగా చేసుకుని భయాందోళనలు సృష్టిస్తున్నారు.
కానీ వాస్తవం వేరేలా ఉంది. ఆ ఎపిసోడ్లో నవంబర్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా బ్లాక్అవుట్ జరుగుతుందని ఎక్కడా చెప్పలేదు. అందులో చూపించిన విద్యుత్ అంతరాయం మంచు తుఫాను కారణంగా కల్పిత పట్టణమైన స్ప్రింగ్ఫీల్డ్లో మాత్రమే చోటుచేసుకుంటుంది.
మైక్రోసాఫ్ట్, విమాన సర్వీసుల్లో అంతరాయాలు కూడా కారణమా?
ఇటీవల అమెరికాలో చోటుచేసుకున్న కొన్ని సాంకేతిక అంతరాయాలు కూడా ఈ పుకార్లకు బలం చేకూర్చాయి. నవంబర్ 12 నుంచి 14 మధ్య మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఔట్‌లుక్‌తో పాటు పలు వర్క్‌ప్లేస్ అప్లికేషన్ల సేవలు ప్రభావితమయ్యాయి.
అదే సమయంలో నవంబర్ 13న టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఈ రెండు ఘటనలను కొందరు ఒకదానితో మరొకటి ముడిపెట్టి, అమెరికాపై భారీ సైబర్ దాడి జరుగుతోందని ప్రచారం చేశారు. అయితే, ఈ రెండు ఘటనలకు పరస్పర సంబంధం లేదని సంబంధిత సంస్థలు స్పష్టం చేశాయి. మైక్రోసాఫ్ట్ కూడా తన సేవల్లో ఏర్పడిన అంతరాయం సాంకేతిక సమస్య కారణంగానే జరిగిందని, సైబర్ దాడి వల్ల కాదని నవంబర్ 13న ఎక్స్‌లో వెల్లడించింది.
మరోవైపు, FAA విమానాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను తొలగించడంతో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.
90 రోజుల బ్లాక్అవుట్పై అమెరికా అధికారులు ఏమంటున్నారు?
అమెరికాలో మూడు నెలల పాటు విద్యుత్, నీరు, ఆహార సరఫరా నిలిచిపోతాయనే ప్రచారాన్ని అధికారులు ఖండించారు. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి మార్క్వేన్ ముల్లిన్ ఈ పుకార్లపై స్పందిస్తూ, ప్రజలు ఇలాంటి పరిస్థితుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. 90 రోజుల బ్లాక్అవుట్ గురించి ఆందోళన చెందాలా అని అడిగిన ప్రశ్నకు ఆయన ‘ఖచ్చితంగా అవసరం లేదు’ అని సమాధానమిచ్చారు.
తాను ఎలాంటి నిత్యావసర వస్తువులను ముందుగానే పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం లేదని, తన పిల్లలకు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెబుతుంటానని అన్నారు. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.
ఇదే అంశంపై క్రోనస్ ఇంటెలిజెన్స్‌కు చెందిన ప్రొటెక్టివ్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, గతంలో బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ విభాగంలో పనిచేసిన రిచర్డ్ మరియానో కూడా స్పందించారు.
సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద సమాచారాన్ని నమ్మే ముందు దాని మూలాలను పరిశీలించాలని సూచించారు. ఆధారాలు లేని పోస్టులను షేర్ చేయడం వల్ల అనవసరమైన భయాందోళనలు ఏర్పడతాయని హెచ్చరించారు.
సైబర్ భద్రతా సంస్థ SpecterOpsకు చెందిన రాబీ వించెస్టర్ కూడా ఎమర్జెన్సీ అలర్ట్ పరీక్షలపై ప్రజల్లో ఆందోళన కలగడం సహజమేనని అన్నారు. అయితే, ప్రస్తుతం సమీప భవిష్యత్తులో భారీ సంక్షోభం ఏర్పడబోతోందని సూచించే నిర్దిష్ట సమాచారం లేదని స్పష్టం చేశారు.
మరి అమెరికా విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి ముప్పులూ లేవా?
90 రోజుల బ్లాక్అవుట్ ప్రచారంలో వాస్తవం లేకపోయినా, అమెరికా విద్యుత్ వ్యవస్థకు కొన్ని నిజమైన సవాళ్లు మాత్రం ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విద్యుత్ పరికరాలు, కీలక మౌలిక సదుపాయాల భద్రత, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు వంటి అంశాలపై అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 26న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని బల్క్ పవర్ సిస్టమ్ భద్రతకు సంబంధించి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విదేశాల్లో తయారయ్యే విద్యుత్ పరికరాల్లో డిజిటల్ బ్యాక్‌డోర్స్ ఉండే అవకాశం, సరఫరా వ్యవస్థల్లో తలెత్తే సమస్యలు దేశ విద్యుత్ మౌలిక సదుపాయాలకు ముప్పుగా మారవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
దీంతో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ప్రసార పరికరాలు, ఇతర కీలక సామగ్రి దేశీయంగా తయారు చేసుకునే సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







