హలాల్ మాంసం వివాదం: లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ ముందు వందల మంది నిరసనలు!
ఒక రెస్టారెంట్లో ఏం వండాలి? ఎలాంటి మాంసం అమ్మాలి? అన్నది ఆ యజమాని వ్యక్తిగత నిర్ణయం కదా! కానీ లండన్‌లో ఓ రెస్టారెంట్ విషయంలో ఇదే ప్రశ్న పెద్ద వివాదానికి దారితీసింది. హలాల్ మాంసం విక్రయించనని చెప్పడమే కాకుండా, బయటే ‘ప్రౌడ్లీ నాన్ హలాల్’ అని బోర్డు పెట్టిన ఓ సిక్కు రెస్టారెంట్ యజమానిపై వందలాది మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ ముందు గుమిగూడి మూసేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు కూడా భారీగా మోహరించాల్సి వచ్చింది. ఇంతకీ ఈ వివాదం వెనుక ఉన్న కథ ఏమిటి? నిరసనల మధ్య ప్రముఖ నటుడు జాన్ క్లీస్ ఎందుకు ఆ రెస్టారెంట్‌కు మద్దతుగా నిలిచారు?
హలాల్ మాంసం అమ్మను.. బోర్డు పెట్టి మరీ చెప్పిన యజమాని!
పశ్చిమ లండన్‌లోని హామర్స్మిత్ ప్రాంతంలో ‘సింగ్స్ డైనింగ్’ (Singh’s Dining) పేరుతో ఓ భారతీయ రెస్టారెంట్ నడుస్తోంది. హర్మన్ సింగ్ కపూర్ అనే సిక్కు వ్యక్తి దీనికి యజమాని. తన రెస్టారెంట్లో హలాల్ పద్ధతిలో తయారుచేసిన మాంసాన్ని విక్రయించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిర్ణయాన్ని మెనూలో పేర్కొనడం దగ్గరే ఆపేస్తారు. కానీ కపూర్ మాత్రం మరో అడుగు ముందుకేసి రెస్టారెంట్ బయటే ‘Proudly Non-Halal’ (గర్వంగా నాన్ హలాల్) అని పెద్ద అక్షరాలతో బోర్డు పెట్టారు.
దీంతో ఈ విషయం క్రమంగా వివాదంగా మారింది. నవంబర్ 13న శుక్రవారం రాత్రి వందలాది మంది నిరసనకారులు రెస్టారెంట్ బయటకు చేరుకున్నారు. కొందరు పాలస్తీనా జెండాలు పట్టుకుని, ‘ఫ్రీ పాలస్తీనా’, ‘షేమ్ ఆన్ యూ’, ‘అల్లాహు అక్బర్’ అంటూ నినాదాలు చేశారు. రెస్టారెంట్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఒక దశలో నిరసనకారుల ఆగ్రహం పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వారిని రెస్టారెంట్‌కు దూరంగా నిలువరించారు.
మాంసం వివాదం వెనుక సోషల్ మీడియా పోస్టులు కూడా!
అయితే ఈ గొడవకు కేవలం హలాల్ మాంసం అంశమే కారణం కాదని తెలుస్తోంది. హర్మన్ సింగ్ కపూర్ గతంలో సోషల్ మీడియాలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ముస్లింలను కించపరిచేలా పోస్టులు పెట్టారని, ప్రవక్త మహమ్మద్‌ను అవమానించేలా వ్యవహరించారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
ఒకసారి చేతిలో బేకన్ ముక్కలు పట్టుకుని ఫొటో దిగిన కపూర్.. దానికి ‘బేకన్ పాశ్చాత్య దేశాలను కాపాడగలదు’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. మరోసారి తన రెస్టారెంట్‌లోని మాంసం కౌంటర్‌ను వీడియో తీసి, ‘హారోడ్స్‌లో దొరికే అత్యుత్తమ నాణ్యత గల పోర్క్’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, వలసదారులను ఉద్దేశించి ‘ఇక్కడి సమాజంలో కలిసిపోండి.. లేదంటే వెళ్లిపోండి’ అనే తీవ్ర పదజాలంతో పోస్టులు పెట్టినట్లు ది టెలిగ్రాఫ్ వెల్లడించింది.
మరో వీడియోలో ‘సాసేజ్ స్ప్రే’ అని రాసి ఉన్న బాటిల్ పట్టుకుని, దానికి ‘ఇన్బ్రెడ్ రిపెల్లెంట్’ అనే పదాన్ని జోడించారు. ఇలాంటి పోస్టులు, వీడియోలు వివాదాన్ని మరింత పెంచాయి. దీంతో నిరసనకారుల అభ్యంతరాలు కేవలం రెస్టారెంట్ మెనూకే పరిమితం కాలేదన్న విషయం స్పష్టమవుతోంది.
వందలాది డెత్ థ్రెట్స్ వచ్చాయంటున్న యజమాని!
ఇదంతా ఒకవైపు ఉంటే, తమ కుటుంబం కూడా తీవ్ర వేధింపులు ఎదుర్కొంటోందని హర్మన్ సింగ్ కపూర్ చెబుతున్నారు. హలాల్ మాంసం అమ్మకూడదన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి వందలాది మరణ బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తున్నారు. కొందరు రెస్టారెంట్ అద్దాలపై గుడ్లు విసురుతూ ఇబ్బంది పెడుతున్నారని, తమ వ్యాపారాన్ని బహిష్కరించాలంటూ ప్రచారం చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.
తన కుటుంబానికి రక్షణ కల్పించాలని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులను పలుమార్లు కోరినట్లు కూడా ఆయన వెల్లడించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, తన భార్య, కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఒకవైపు తన సోషల్ మీడియా వ్యాఖ్యలపై విమర్శలు వస్తుంటే, మరోవైపు తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తున్నారని ఆయన వాదిస్తున్నారు.
నిరసనలు మొదలవ్వడానికి ముందే పోలీసుల అరెస్ట్!
ఈ వివాదంలో మరో ఆసక్తికరమైన మలుపు ఉంది. రెస్టారెంట్ ముందు నిరసనలు మొదలవ్వడానికి కొన్ని గంటల ముందే హర్మన్ సింగ్ కపూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 13న శుక్రవారం ఉదయం ఆయన పశ్చిమ లండన్ నివాసానికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనను వాహనంలో తీసుకెళ్తున్న వీడియోను కపూర్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే ఆయన అరెస్టుకు కారణం ఏమిటన్న విషయంలో పోలీసుల ప్రకటన కీలకంగా మారింది. ఇస్లాంకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టు నేపథ్యంలోనే తనను అరెస్టు చేశారని కపూర్ పేర్కొనగా, మెట్రోపాలిటన్ పోలీసులు మాత్రం 54 ఏళ్ల వ్యక్తిని ‘తీవ్రవాద స్వభావం కలిగిన చిత్రాన్ని కలిగి ఉండటం, పంపిణీ చేయడం’ అనే అనుమానంతో అరెస్టు చేసినట్లు తెలిపారు.
అరెస్టుకు ముందు కపూర్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. “కొన్ని రోజులుగా నా కుటుంబానికి, మా వ్యాపారానికి రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నాను. కానీ ఇప్పుడు నన్నే అరెస్టు చేశారు. మరోవైపు నా కుటుంబం నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నచ్చిన ఆహారాన్ని విక్రయించుకునే హక్కు కూడా లేకుండా పోతోందా అని ప్రశ్నించారు.
జాన్ క్లీస్ ఎంట్రీ.. రెస్టారెంట్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ!
ఈ వివాదంలోకి ప్రముఖ బ్రిటిష్ నటుడు, హాస్యనటుడు జాన్ క్లీస్ రావడంతో కథ మరో మలుపు తిరిగింది. ‘ఫాల్టీ టవర్స్’ (Fawlty Towers) టీవీ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన.. హర్మన్ సింగ్ కపూర్ రెస్టారెంట్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు. నిరసనల సమయంలో రెస్టారెంట్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడంలోనూ ఆయన సహకారం అందించినట్లు కపూర్ భార్య ఖుషీ వెల్లడించారు.
రెస్టారెంట్ బయట నిలబడి జాన్ క్లీస్కు కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఒక ప్లకార్డు ప్రదర్శించారు. దానిపై ‘మెట్రోపాలిటన్ పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో ఈ రెస్టారెంట్‌ను కాపాడటానికి జాన్ క్లీస్ డబ్బులు చెల్లిస్తున్నారు’ అని రాసి ఉంది. “మాకు మద్దతుగా నిలిచినందుకు, సెక్యూరిటీ పంపించినందుకు ధన్యవాదాలు” అంటూ ఆమె వీడియోలో పేర్కొన్నారు.
అయితే సెక్యూరిటీ ఖర్చును తానే వ్యక్తిగతంగా భరించానని క్లీస్ స్పష్టంగా చెప్పలేదు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఆ ఏర్పాట్లకు డబ్బులు చెల్లించారని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. నిరసనకారులు ఒక కుటుంబాన్ని, వారి జీవనోపాధిని భయపెట్టడం సరికాదని విమర్శించారు. సెక్యూరిటీ ఉండటంతో కనీసం రెస్టారెంట్‌కు ప్రత్యక్షంగా నష్టం కలిగించకుండా అడ్డుకోగలిగామని వ్యాఖ్యానించారు.
— సూర్య ప్రకాష్ జోశ్యుల







