‘వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే..’ పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో షాక్!
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన మినీ మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా, అప్పటి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను దూషించారన్న కేసులో దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసుల విచారణలో భాగంగా తన వాయిస్ శాంపిల్ ఇవ్వాలంటూ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఈ వివాదాస్పద కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగినట్లయింది.
ఈ ఏడాది జనవరి నెలాఖరులో వీణవంక మండల కేంద్రంలో జరిగిన మినీ మేడారం జాతర సందర్భంగా ఈ వివాదం రాజుకుంది. జాతరలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు. అయితే, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్‌తో అక్కడికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం అన్ని వాహనాలను అనుమతించలేమని పోలీసులు అడ్డుకోవడంతో, ఎమ్మెల్యే రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు.
ఇవి కూడా చదవండి
ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో జరిగిన వాగ్వాదంలో కౌశిక్ రెడ్డి అప్పటి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని, మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని పోలీసులు అభియోగాలు మోపారు. ఆ తర్వాత పోలీసులు నాలుగు వాహనాలకు అనుమతించడంతో గద్దెల వద్దకు వెళ్లిన ఆయన, స్థానిక దళిత మహిళా సర్పంచ్ చేత కొబ్బరికాయ కొట్టించాలని పట్టుబట్టారు. దీనిపై స్థానిక ఆలయ ట్రస్టీ వర్గానికి, ఎమ్మెల్యే వర్గానికి మధ్య విభేదాలు తలెత్తడంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. కౌశిక్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను అక్కడి నుంచి తరలించారు.
ఈ ఘటనపై వీణవంక పోలీసులు కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలో రికార్డయిన ఆడియో, వీడియో ఆధారాలను శాస్త్రీయంగా నిర్ధారించేందుకు కౌశిక్ రెడ్డి వాయిస్ శాంపిల్ తప్పనిసరి అని భావించిన పోలీసులు, అందుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎవరినీ దూషించలేదని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించిందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. వాయిస్ శాంపిల్ సేకరణ పేరుతో వేధించే ప్రయత్నం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే.. పోలీసుల తరఫు న్యాయవాదులు ఈ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఉన్నత పోలీసు అధికారిని మతం పేరుతో దూషించడం, విధులను అడ్డుకోవడం తీవ్రమైన నేరమని, నిజానిజాలు నిగ్గుతేలాలంటే శాస్త్రీయ ఆధారాల సేకరణ అత్యవసరమని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను సమగ్రంగా విన్న ధర్మాసనం, దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ ఎమ్మెల్యే పిటిషన్‌ను కొట్టివేసింది.







