‘భారత్ సమ్మిట్’ వివాదం.. విదేశీ నేతలపై బీజేపీ ఫిర్యాదు!
హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ‘భారత్ సమ్మిట్-2026’ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్రబిందువుగా మారింది. నవంబర్ 13, 14 తేదీల్లో హెచ్ఐసీసీ వేదికగా 70 దేశాల ప్రతినిధులతో ఈ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఇందులో కొంతమంది విదేశీ రాజకీయ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో తెలంగాణ బీజేపీ ఇప్పుడు నేరుగా న్యాయ, దర్యాప్తు సంస్థల తలుపు తట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
ఈ వివాదానికి కేంద్రబిందువు ‘పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్’ (PES) సెక్రటరీ జనరల్, ఇటలీ రాజకీయ నాయకుడు గియాకోమో ఫిలిబెక్ చేసిన ప్రసంగం. సదస్సులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో మాట్లాడిన ఫిలిబెక్, భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన నిరసన ర్యాలీని ప్రస్తావిస్తూ ఏకంగా ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ అంటూ నినాదాలు చేశారు. దాన్ని ఇంగ్లీషులోకి అనువదించి మరీ పునరుద్ఘాటించారు. విదేశీ నేత నోటి వెంట ఈ నినాదం రాగానే వేదికపై ఉన్న రాహుల్ గాంధీ చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడం బీజేపీ ఆగ్రహానికి ఆజ్యం పోసింది.
ఇవి కూడా చదవండి
ఈ పరిణామంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సహా జాతీయ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఈ సదస్సులో నేతల వ్యాఖ్యలపై బీజేపీ పలు అభ్యంతరాలు లేవనెత్తుతోంది. విదేశీ గడ్డపై నుంచి వచ్చిన నేతలు మన రాజ్యాంగ సంస్థలను, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరిచ్చారని బీజేపీ ప్రశ్నిస్తోంది. విదేశీ ప్రతినిధులు భారత్‌కు వచ్చినప్పుడు ఇక్కడి వీసా నిబంధనలకు కట్టుబడి ఉండాలని తేల్చి చెప్తోంది. అంతర్జాతీయ విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై మేధోమథనం పేరుతో అనుమతులు తీసుకుని, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు చేయడం చట్టవిరుద్ధమని బీజేపీ వాదిస్తోంది. విదేశీయులు భారత ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టడం దేశద్రోహంతో సమానమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు.
ఈ అంశాన్ని కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా చట్టపరంగా ఎదుర్కోవాలని బీజేపీ అధిష్టానం తెలంగాణ శాఖకు దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ లీగల్ టీమ్‌తో కలిసి శంషాబాద్ విమానాశ్రయ పరిధిలోని ఎఫ్ఆర్ఆర్ఓ (ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు చేయనున్నారు. విదేశీ ప్రతినిధులు వీసా నిబంధనలను అతిక్రమించి భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారని, వారిపై ‘ఫారినర్స్ యాక్ట్’ కింద కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో వారిని బ్లాక్‌లిస్ట్ చేయాలని బీజేపీ తన ఫిర్యాదులో కోరనుంది. మరోవైపు సదస్సు నిర్వాహకులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విదేశీ ప్రతినిధులపై హైదరాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకు కమలదళం సిద్ధమైంది.
మొత్తానికి, హైదరాబాద్‌ను అంతర్జాతీయ చర్చలకు వేదికగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావించిన ‘భారత్ సమ్మిట్’, ఇప్పుడు జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ రణరంగానికి తెరలేపింది. ఎఫ్ఆర్ఆర్ఓ, పోలీసులకు బీజేపీ చేసే ఫిర్యాదులు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.







