రోబో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తే గంటకు రూ.1,800 జీతం! ఏంటీ ఉద్యోగం?!
ఒకప్పుడు కుక్కలను పెంచుకునేవాళ్లు వాటిని ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు తీసుకెళ్లేవారు. ఇప్పుడు కాలం మారింది. కుక్కలను కాదు.. రోబో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లినా జీతం ఇచ్చే రోజులు వచ్చేశాయి. అదీ మామూలు జీతం కాదు.. గంటకు 20 డాలర్లు! అంటే మన కరెన్సీలో దాదాపు రూ.1,800. అమెరికాలోని ఓ ఏఐ స్టార్టప్ ఇలాంటి వింత ఉద్యోగాన్ని ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపై పడింది. అయితే ఈ ఉద్యోగం వెనుక ఏదో సరదా ప్రయోగం ఉందనుకుంటే పొరబడినట్లే. భవిష్యత్తులో మనుషుల పనులన్నీ రోబోలతో చేయించాలనే పెద్ద ప్రణాళికలో ఇదొక భాగం!
కుక్కలను కాదు.. రోబోలను వాకింగ్‌కు తీసుకెళ్లాలి!
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన Dimensional అనే ఏఐ స్టార్టప్ ఈ ఉద్యోగాలను ప్రకటించింది. అక్టోబర్ 5న కంపెనీ పెట్టిన ఉద్యోగ ప్రకటన ప్రకారం.. ఎంపికైనవాళ్లు నగర వీధుల్లో రోబో కుక్కలను తీసుకుని తిరగాలి. రోజుకు నాలుగు నుంచి ఆరు గంటలపాటు వాటిని నడిపించాలి. ఇందుకోసం గంటకు 20 డాలర్లు చెల్లిస్తారు. అంటే నాలుగు గంటలు పనిచేస్తే 80 డాలర్లు, ఆరు గంటలు పనిచేస్తే 120 డాలర్లు చేతికి వస్తాయి. మన కరెన్సీలో లెక్కేస్తే రోజుకు సుమారు రూ.7,200 నుంచి రూ.10,800 వరకు సంపాదించవచ్చన్నమాట.
ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఉద్యోగం చేయడానికి రోబోటిక్స్‌లో డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు. టెక్నికల్ నాలెడ్జ్ కూడా అక్కర్లేదు. కంపెనీ ఇచ్చే పెయిడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే చాలు, వెంటనే పనిలో చేరిపోవచ్చు. పైగా ప్రతి షిఫ్ట్ పూర్తయిన వెంటనే డబ్బులు చెల్లిస్తామని కూడా కంపెనీ చెప్పింది. ఫేస్బుక్ ఉద్యోగాల గ్రూపులో ఈ ప్రకటన పెట్టినప్పటికీ, తర్వాత దాన్ని తొలగించారు.
అయితే ఈ ఉద్యోగంలో ఓ చిన్న చిక్కు ఉంది. రోబో కుక్క బరువు దాదాపు 15 కిలోలు ఉంటుంది. దాన్ని సొంతంగా ఎత్తగలిగే శక్తి ఉండాలి. ఎందుకంటే మధ్యలో రోబో వేడెక్కినా, పనిచేయడం ఆగిపోయినా దాన్ని అలాగే వదిలేసి వెళ్లిపోవడానికి వీల్లేదు. తిరిగి కంపెనీకి మోసుకెళ్లాల్సిందే. నిజమైన కుక్క అయితే దారిలో అలసిపోయినా కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. కానీ ఈ రోబో మొరాయిస్తే మాత్రం దాన్ని మనమే మోయాలి!
చైనా రోబో కుక్కలతో అమెరికా కంపెనీ ప్రయోగం!
ఈ ఉద్యోగంలో ఉపయోగించేది సాధారణంగా కనిపించే కుక్కలు కావు. చైనాకు చెందిన Unitree Robotics తయారు చేసిన నాలుగు కాళ్ల రోబోలు. ఒక్కో రోబో ధర సుమారు 2,000 డాలర్లు. అంటే దాదాపు రూ.1.8 లక్షలు. వీటిని చేతిలో ఉండే రిమోట్ కంట్రోల్తోనో, స్మార్ట్‌ఫోన్ యాప్తోనో నడిపించవచ్చు. బయటకు చూస్తే ఎవరో తమ పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తున్నట్లే కనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలు కుక్కే లేదు. దాని స్థానంలో కెమెరాలు, సెన్సార్లతో నిండిన ఓ యంత్రం ఉంటుంది.
మరి లక్షల రూపాయలు పెట్టి కొన్న ఈ రోబోలను వీధుల్లో తిప్పడానికి మనుషులకు డబ్బులిచ్చి మరీ ఎందుకు నియమిస్తున్నారు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కంపెనీకి రోబోలను వాకింగ్ చేయించడం ముఖ్యం కాదు. అవి నడుస్తున్నప్పుడు చుట్టూ ఏం జరుగుతోంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, వాటికి ఎలా స్పందించాలి అనే విషయాలపై డేటా సేకరించడమే అసలు లక్ష్యం.
ఏఐకి అన్నీ వచ్చు.. కానీ రోడ్డుపై నడవడం మాత్రం రాదు!
ఇప్పుడు ఏఐ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, కథలు రాయడం, ఫొటోలు తయారు చేయడం, పెద్ద పెద్ద సమాచారాన్ని విశ్లేషించడం.. ఇలా కంప్యూటర్లో చేయాల్సిన పనులను ఏఐ చాలా సులభంగా చేసేస్తోంది. కానీ అదే ఏఐని ఒక రోబోకు అప్పగించి బయట రోడ్డుపై నడవమంటే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది.
ఎదురుగా ఒక మనిషి వస్తే ఎలా తప్పుకోవాలి? రోడ్డుపై గుంత కనిపిస్తే ఏం చేయాలి? అకస్మాత్తుగా సైకిల్ అడ్డొస్తే ఎలా స్పందించాలి? ఒకచోట జనాలు ఎక్కువగా ఉంటే ఎటువైపు వెళ్లాలి? ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా రోబోలకు చాలా శిక్షణ అవసరం. కంప్యూటర్ స్క్రీన్ మీద తెలివిగా సమాధానాలు చెప్పడం ఒక ఎత్తయితే, నిజ జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను అర్థం చేసుకుని కదలడం మరో ఎత్తు.
అందుకే Dimensional సంస్థ మనుషులనే రోబో కుక్కలకు తాత్కాలికంగా డ్రైవర్లుగా ఉపయోగిస్తోంది. వాళ్లు రిమోట్‌తో రోబోలను నడిపిస్తున్నప్పుడు వాటికి అమర్చిన కెమెరాలు, సెన్సార్లు పరిసరాలను రికార్డ్ చేస్తుంటాయి. ఈ వీడియోలు, ఇతర డేటా ఆధారంగా ఏఐకి బయట ప్రపంచం గురించి శిక్షణ ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. అంటే ప్రస్తుతం మనిషి రోబోకు దారి చూపిస్తుంటే, భవిష్యత్తులో అదే రోబో ఎలాంటి సహాయం లేకుండానే తన దారిని తాను ఎంచుకోవాలన్నమాట.
100 రోబో కుక్కలు.. 50 మనుషుల్లాంటి రోబోలు!
ఈ కంపెనీ లక్ష్యం కేవలం రోబో కుక్కలను వీధుల్లో తిప్పడంతోనే ఆగిపోవడం లేదు. మనుషులు సాధారణ భాషలో ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకుని, వాటి ప్రకారం వివిధ రకాల రోబోలు పనిచేసేలా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం అమెరికా, చైనా, జర్మనీకి చెందిన తయారీదారుల నుంచి ఇప్పటికే 100కు పైగా రోబో కుక్కలు, 50 హ్యూమనాయిడ్ రోబోలను కొనుగోలు చేసింది.
ఇవి కూడా చదవండి
భవిష్యత్తులో ఈ రోబోలను ఫ్యాక్టరీల్లో, నిర్మాణ ప్రదేశాల్లో, డేటా సెంటర్లలో, భద్రతా కార్యకలాపాల్లో ఉపయోగించాలన్నది కంపెనీ ఆలోచన. అంతేకాదు.. మనుషులు రోజూ చేసే శారీరక శ్రమతో కూడిన పనులను కూడా రోబోలతో చేయించాలని చూస్తోంది. రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని డెలివరీ చేయడం, భారీ పెట్టెలను ఒకచోటు నుంచి మరోచోటుకు మోయడం వంటి పనులు వాటికి అప్పగించాలనుకుంటోంది.
Dimensional వ్యవస్థాపకుడు Stash Pomichter అభిప్రాయం కూడా ఇదే. మనుషులు ఇప్పటికీ భారీ వస్తువులను స్వయంగా మోయాల్సి రావడం పాతకాలపు పద్ధతిలా ఉందని, ఇలాంటి శారీరక శ్రమతో కూడిన పనులను రోబోలు చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన భావిస్తున్నారు.
ఫైనల్ గా…
ఏఐ ప్రపంచంలో అసలు పోటీ ఇప్పుడు కంప్యూటర్లలో మాత్రమే జరగడం లేదు. మనుషుల్లాగే కదిలే, పనిచేసే యంత్రాలను తయారు చేయడంపైనా మొదలైంది. ఇప్పటివరకు మనుషులు యంత్రాలకు ఆదేశాలు ఇస్తే.. రేపు యంత్రాలే తమ పనులను తాము నిర్ణయించుకునే స్థాయికి చేరుకోవాలన్నది టెక్ కంపెనీల కల. ఆ కల నిజమవ్వడానికి అవసరమైన డేటాను ఇప్పుడు మనుషులే అందిస్తున్నారు. విచిత్రంగా అనిపించినా.. భవిష్యత్తులో మనుషుల పనులను రోబోలు చేయాలంటే, ముందుగా ఆ రోబోలకు మనుషులే శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







