‘తెలంగాణ రేవంత్ సేన’గా కవిత పార్టీ..! బీఆర్ఎస్ ఫైర్..!!
కవిత వర్సెస్ బీఆర్ఎస్ వివాదం మరింత ముదిరింది. నిన్న సిద్దిపేటలో జరిగిన సభలో కవిత తన తండ్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కవితపై, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల బీఆర్ఎస్ ఒక పెనుముప్పు, దుర్మార్గమైన దోపిడీ నుంచి బయటపడిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి సౌజన్యంతోనే ‘పాంచజన్యం’ ఎజెండాతో కవిత టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీ దోపిడీపై పోరాడాల్సిన కవిత, నిత్యం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కవిత పార్టీ కాంగ్రెస్‌కు నాలుగో అనుబంధ సంస్థగా, ‘తెలంగాణ రేవంత్ సేన’గా పనిచేస్తోందని, ఆ పార్టీని డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలని ఆయన ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి, కవిత, సూదిని సృజన్ రెడ్డి మధ్య పాత వ్యాపార సంబంధాలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ చేశారు. 2010లో కవిత, 2012లో రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డిలు ‘ఆడి కోర్ ఇన్ ఫ్రా’ కంపెనీకి డైరెక్టర్లుగా వ్యవహరించారని, ఒకే చిరునామాతో 30 కంపెనీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వెయ్యి కోట్ల రూపాయల కాలువ పనులు సృజన్ రెడ్డికి దక్కే వరకు కవిత పట్టువదల్లేదని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, కేవలం ముఖ్యమంత్రి వద్ద మాత్రమే ఉండాల్సిన విజిలెన్స్ విభాగం రహస్య నివేదికలు కవిత చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి ఆ పత్రాలను కవితకు అందించారని, రేవంత్ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే కవిత సిద్దిపేటలో చదివారని, ఈ నెల 19న సీఎం కూడా అవే అంశాలను మాట్లాడతారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
మల్లన్నసాగర్ ప్రాజెక్టును భూకంప జోన్లో నిర్మించారన్న కవిత వ్యాఖ్యల్లో కనీస అవగాహన లేదని ప్రవీణ్ కుమార్ కొట్టిపారేశారు. కేంద్ర జలసంఘం, జీఎస్ఐ అనుమతుల తర్వాతే 50 టీఎంసీల జలాశయాన్ని నిర్మించారని స్పష్టం చేశారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కింద ఉన్న కేసీఆర్ భూములకు నీరు వెళ్తే తప్పేంటని నిలదీశారు. అలాగే, నిమ్స్ ఆసుపత్రిలో హరీశ్ రావు 200 కోట్ల కుంభకోణం చేశారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. నిమ్స్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ప్రయోజనాలు కల్పించడం హరీశ్ రావు చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఈ ప్రక్రియలో ప్రస్తుత సలహాదారు రామకృష్ణారావుతో పాటు ఐఏఎస్ అధికారులు, వైద్యుల సంతకాలు ఉన్నాయని గుర్తుచేశారు. జీపీఎఫ్ ఉద్యోగుల నిధులను ఈపీఎఫ్‌కు మళ్లించారని కవిత పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, అసలు పెన్షన్ వద్దని ఏ ఉద్యోగి అయినా ఫిర్యాదు చేస్తారా అని ఆయన నిలదీశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆశ్చర్యకర విషయాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ముందే ఎలా చెబుతున్నారని, ఆయనేమైనా సిట్ అధిపతా అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల భూములపై విచారణకు జీఓ ఇచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ నేతల భూములను కూడా ఆ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలపై కవిత చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది కేవలం మొదటి ఎపిసోడ్ మాత్రమేనని, త్వరలోనే మరిన్ని ఆధారాలు బయటపెడతామని హెచ్చరించారు. అబద్ధాలతో ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరని, కవిత రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూచించారు. పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కవితపై న్యాయపరంగా ముందుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.







