ఖవాజా బయోగ్రఫీపై దక్షిణాఫ్రికా పేసర్ రబాడా షాకింగ్ రియాక్షన్..!
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన 2018 నాటి శాండ్‌పేపర్(Sandpapergate) బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) తన ఆత్మకథ సబ్ర్ పుస్తకంలో ఈ వివాదంపై సంచలన విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ మాత్రమే ఈ తప్పు చేసినట్లు శిక్ష అనుభవించారని, కానీ ఆ సమయంలో జట్టులోని ప్రతి ఒక్కరికీ బంతిని శాండ్‌పేపర్‌తో రుద్దబోతున్నారనే విషయం ముందే తెలుసని ఖవాజా పేర్కొన్నాడు.
ఆ ముగ్గురినే బలిపశువులను చేయకుండా ఆనాటి జట్టులోని అందరూ ఉమ్మడి బాధ్యత వహించాలని ఖవాజా డిమాండ్ చేశాడు. అయితే ఈ వివాదంపై దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ ఆసక్తికరంగా స్పందించాడు. విలేకరుల సమావేశంలో ఖవాజా వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు రబాడ సూటిగా సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియా జట్టులో ఏం జరిగిందనే దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా వారి అంతర్గత విషయమని స్పష్టం చేశాడు. ఆ వివాదంలో తాము తలదూర్చాల్సిన అవసరం ఏమాత్రం లేదని రబాడ తేల్చి చెప్పాడు.
ఇవి కూడా చదవండి
ఇదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించడం, ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుండటంపై రబాడ సంతోషం వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఆడటం తనకు దక్కిన గొప్ప వరమని, ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుని ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకోవడం ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు. అభిమానుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే తమ అంతిమ లక్ష్యమని అన్నాడు. ఇక దక్షిణాఫ్రికా జట్టు నవంబర్ 15 నుంచి జోహన్నెస్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.







