భారత్‌పై విద్వేషాన్ని అరికట్టడమే ధ్యేయం: అమీష్ షా
అమెరికాలో భారతీయులపై విద్వేషాలను అరికట్టడమే తమ ధ్యేయమని భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ అమిష్ షా తెలిపారు. జనవరి 3న తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అమెరికాలో భారత్ వ్యతిరేక ద్వేషాన్ని అరికట్టడంతో పాటు సుంకాలపై వైట్ హౌస్ నుండి అధికారాన్ని తొలగించి కాంగ్రెస్ అధికారాన్ని పునరుద్ధరించడం తన ప్రధాన ప్రాధాన్యతలలో ఉంటాయన్నారు. నవంబర్ 3, 2026న జరిగిన మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ జే ఫీలీని ఓడించి అరిజోనా 1వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌ను గెలుచుకోవడం ద్వారా, యూఎస్ కాంగ్రెస్‌లో అరిజోనాకు ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.
కాంగ్రెషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ (CAPAC) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుంకాలు భారతీయ పారిశ్రామికవేత్తలను, వ్యాపార వర్గాలను దెబ్బతీస్తున్నాయని, అమెరికా వినియోగదారులకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఆపాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోని భారతీయ-అమెరికన్ వర్గంతో తనకున్న అనుబంధం నేపథ్యంలో తాను ‘ఇండియా కాకస్’లో చేరాలని యోచిస్తున్నట్లు షా వెల్లడించారు.
తన నియోజకవర్గంలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ అందుబాటు ధరలు, బీమా కవరేజీ, నీటి సరఫరా వంటి దేశీయ సమస్యలతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులకు కారణమైన అవినీతిని అరికట్టడానికి మొదటి రోజు నుంచే కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.







