తెలంగాణలో జనసేన ‘ఆపరేషన్ క్లీన్’!
తెలంగాణలో తన ఉనికిని చాటుకుని, రాబోయే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు జనసేన పార్టీ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం మేరకు, రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణాన్ని సమూలంగా మార్చేస్తూ తెలంగాణ జనసేన రాష్ట్ర కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 2వ తేదీకి ముందు నియమించిన దాదాపు అన్ని పాత పదవులు, కమిటీలు, ఇన్ఛార్జ్ బాధ్యతలను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. కేవలం నామమాత్రపు హోదాలకు స్వస్తి పలికి, క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే క్రియాశీలక నాయకత్వాన్ని తయారు చేయడమే ఈ భారీ ప్రక్షాళన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
ఈ సంస్థాగత ప్రక్షాళనలో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, జిల్లాల బాధ్యులు, జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఇన్ఛార్జ్ పదవులను రద్దు చేశారు. వీటితో పాటు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పదవులు, విద్యార్థి, యువజన, వీరమహిళ విభాగాల పాత నియామకాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోఆర్డినేటర్లు, గతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక అడ్హక్ కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. అయితే, రాష్ట్ర ముఖ్య నాయకుల బాధ్యతలతో పాటు, 2026 జూన్ 2 తర్వాత నియమితులైన ‘తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ’, అధికార ప్రతినిధులు మాత్రం యథావిధిగా తమ పదవుల్లో కొనసాగుతారని వెల్లడించింది.
పాత కమిటీలను రద్దు చేయడం వెనుక ఎవరినీ పక్కనపెట్టే ఉద్దేశం లేదని, పాత వారి అనుభవాన్ని గౌరవిస్తూనే మరింత జవాబుదారీతనంతో కూడిన నూతన వ్యవస్థను నిర్మిస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పడబోయే కమిటీల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయనున్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, మేధావులు, విద్యావంతులతో పాటు అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని నాయకత్వం భావిస్తోంది. కేవలం పైరవీల ద్వారా కాకుండా, క్షేత్రస్థాయిలో జనసైనికులు, వీరమహిళలు కనబరిచిన అంకితభావం, పనితీరు, నాయకత్వ సామర్థ్యాలను బట్టే కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ ఏడాది జనవరిలోనే కొన్ని విభాగాలను రద్దు చేసి అడ్హక్ కమిటీల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన అధిష్ఠానం, జూన్ 24న ‘పార్టీ నిర్మాణ సారథుల’ సమాచార సేకరణ ప్రక్రియ ద్వారా క్రియాశీలక కార్యకర్తల డేటాను క్రోడీకరించింది. ఆ సమగ్ర కసరత్తు తర్వాతే ఇప్పుడు ఈ తుది నిర్ణయం తీసుకుంది. 2029 ఎన్నికల్లో తెలంగాణలో పూర్తిస్థాయిలో పోటీ చేయడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. అంతకంటే ముందే జరగనున్న జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గ్రామ స్థాయి నుంచి వార్డులు, డివిజన్లు, మండలాల వరకు పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ, ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్న తరుణంలో.. తెలంగాణలోనూ పార్టీని అదే స్థాయిలో బలోపేతం చేయాలన్న పట్టుదల ఈ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి, ఈ సంస్థాగత ప్రక్షాళన తెలంగాణ జనసేనకు కొత్త జవసత్వాలను అందించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2029 సార్వత్రిక సమరం వరకు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబెడుతుందో లేదో వేచి చూడాలి.







