శాండ్‌పేపర్‌గేట్ వివాదంపై మిచెల్ మార్ష్ షాకింగ్ ఆన్సర్..!
ఇంగ్లండ్‌తో(England) శుక్రవారం నుండి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా వైట్-బాల్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ‘శాండ్‌పేపర్‌గేట్'(SandPaperGate) కుంభకోణం గురించి ఇటీవల మాజీ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. బంతిని గరుకుగా మార్చడానికి శాండ్‌పేపర్ ఉపయోగించే ప్లాన్ గురించి అప్పటి ఆస్ట్రేలియా జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసని ఖవాజా పేర్కొనడంతో ఆ పాత వివాదం మళ్లీ రాజుకుంది.
ఈ నేపథ్యంలో గురువారం పెర్త్‌లో మీడియా ముందుకు వచ్చిన మిచెల్ మార్ష్‌కు తొలి ప్రశ్నే శాండ్‌పేపర్‌గేట్ గురించి ఎదురైంది. దీంతో ఏమాత్రం తడబడని మార్ష్, తనదైన శైలిలో చమత్కారంగా స్పందిస్తూ “నువ్వు తొలి బంతికే సిక్సర్ కొట్టావు మిత్రమా, వెల్ డన్” అంటూ విలేకరిని అభినందించాడు. ఈ వారం ఈ అంశంపై చాలా చర్చ జరుగుతున్న మాట వాస్తవమేనని, కొందరు తమ అనుభవాలను పంచుకోవడాన్ని తాను గౌరవిస్తానని మార్ష్ అన్నాడు. అయితే తాను ఈరోజు తన కథను చెప్పడానికి ఇక్కడికి రాలేదని, తమకు ఇది చాలా కీలకమైన వారమని, ప్రస్తుతం తన పూర్తి దృష్టి రేపటి వన్డే మ్యాచ్ సన్నద్ధతపైనే ఉందని స్పష్టం చేస్తూ ఆ వివాదాస్పద ప్రశ్నను తెలివిగా దాటవేశాడు.
మరోవైపు, ఇదే వివాదంపై స్పందించేందుకు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ సిద్ధమయ్యాడు. ఖవాజా చేసిన ఆరోపణల పూర్తి స్థాయిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నానని, సిడ్నీలో మీడియాతో మాట్లాడి అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానని కమిన్స్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించాడు. కాగా, 2018 నాటి ఆ బాల్ ట్యాంపరింగ్ ఘటనలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల పాటు క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.







