వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో మంత్రి లోకేష్ భేటీ
డ్వాక్రా గ్రూపులు-ఏపీ ఉత్పత్తులకు వాల్ మార్ట్, ఫ్లిఫ్‌కార్ట్ సప్లై చైన్లలో చేర్చండి
వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో భేటీలో మంత్రి లోకేష్ ప్రతిపాదన
విశాఖపట్నం: వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ & బిజినెస్ డిప్లొమసీ) పాల్ డైక్ తో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆహారం, వస్త్రవ్యాపారంలో బలమైన భాగస్వామ్యాలు, పెట్టుబడులను అన్వేషించడానికి ఏపీలో జరిగే ఎంఎస్ఎంఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కొనుగోలుదారులను ఏపీకి తీసుకురావాల్సిందిగా కోరారు. గతంలో న్యూఢిల్లీలో జరిగిన వాల్‌మార్ట్ గ్రోత్ సమ్మిట్ భారతదేశానికి చెందిన సరఫరాదారులు, వ్యవస్థాపకులు తమ ఉత్పత్తులను వాల్‌మార్ట్ గ్లోబల్ కొనుగోలుదారులకు పరిచయం చేయడానికి సహాయపడిందని గుర్తుచేశారు. స్వయం ఏపీ, లేపాక్షి బ్రాండ్ల కింద స్థానిక కళాకారులు, మహిళలు నడిపే ఎస్‌హెచ్‌జీలను వాల్‌మార్ట్, ఫ్లిప్ కార్ట్ దేశీయ, ప్రపంచ సప్లై చైన్లలోకి ప్రత్యేకంగా చేర్చడానికి మార్గాన్ని సులభతరం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్ స్పందిస్తూ… ఏపీ రొయ్యల అతిపెద్ద కొనుగోలుదారులలో వాల్ మార్ట్ ఒకటిగా ఉంది, సంవత్సరానికి 6.5 కోట్ల పౌండ్లకు పైగా రొయ్యలను తమ సంస్థ కొనుగోలు చేస్తోంది, దీనితో పాటు రాష్ట్రం నుంచి ఫార్మా, వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల వల్ల 28,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ-ఉపాధి అవకాశాలు లభించాయి. సుమారు 12 లక్షల చదరపు అడుగుల మౌలిక సదుపాయాల స్థలం, 0.33 మిలియన్ చదరపు అడుగుల హోల్‌సేల్ స్థలంతో రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా లాజిస్టిక్స్ హబ్‌ల ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ఎంఎస్ఎంఈ కార్పోరేషన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) తో ఎంవోయూ మేరకు ఏపీలో 3,200కు పైగా ఎంఎస్ఎంఈలకు శిక్షణ ఇచ్చాం, వాటిలో 900కు పైగా ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ మార్కెట్‌ప్లేస్‌లో చేర్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని పాల్ డైక్ చెప్పారు.







