గౌతమ్ గంభీర్ అది తెలుసుకోవాలి: చిక్కా కీలక వ్యాఖ్యలు..!
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ప్రయోగాలు, వ్యూహాలపై భారత మాజీ ఓపెనర్, 1983 ప్రపంచకప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను లోయర్ ఆర్డర్లో ఆడిస్తూ, అతడి కంటే ముందు అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపడంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైఖరిని ఆయన గట్టిగా తప్పుబట్టారు. కేఎల్ రాహుల్ లాంటి అగ్రశ్రేణి ఆటగాడికి ఇలాంటి రోల్ ఇచ్చి తగ్గించడం ముమ్మాటికీ అన్యాయమని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో పిచ్ పరిస్థితులు కఠినంగా ఉన్న సమయంలో కేఎల్ రాహుల్ ఎంతో క్లాస్‌గా ఆడి 38 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడని శ్రీకాంత్ గుర్తుచేశారు. “ఆ మ్యాచ్‌లో రాహుల్ గనుక త్వరగా అవుట్ అయి ఉంటే టీమిండియా పని అయిపోయేది. క్లిష్ట పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే జట్టును ఆదుకోగలరు. అలాంటిది రాహుల్ కంటే ముందు అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపడాన్ని ఎలా సమర్థించుకుంటారు..? గంభీర్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాహుల్ గతంలో భారత్ తరఫున నంబర్ 3, నంబర్ 4 స్థానాల్లో సెంచరీలు కొట్టాడు. అతడిని నంబర్ 6కు పరిమితం చేయడం అస్సలు బాలేదు” అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నారు.
మరోవైపు, ఈ బ్యాటింగ్ ఆర్డర్ మార్పులపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. జట్టులో మొదటి నలుగురు బ్యాటర్లు కుడిచేతి వాటం వారే కావడంతో, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం నంబర్ 5, నంబర్ 6 స్థానాల్లో మ్యాచ్ పరిస్థితులను బట్టి అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్‌లను ఫ్లోటింగ్ ఆర్డర్లో ఆడిస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ రెండు వన్డేల్లో 7 వికెట్లు పడగొట్టిన యువ పేసర్ గుర్నూర్ బ్రార్ ప్రదర్శనపై శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు.







