చంద్రబాబు.. నిత్యానంద స్వామి: పేర్ని నాని..!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రెస్ మీట్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికలు ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ అరాచకాలకు, దౌర్జన్యాలకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు.
నామినేషన్ల స్వీకరణ పర్వంతో మొదలైన టీడీపీ దౌర్జన్యాలు డిక్లరేషన్ ఫారాలు ఇచ్చే వరకు నిరాటంకంగా కొనసాగాయని ఆరోపించారు. గెలుపుపై చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆవు తోలు కప్పుకున్న తోడేలు వంద అబద్ధాలు, యాభై నీతులు చెప్పినట్లుందని, బయట ప్రవచనాలు చెబుతూ ఆశ్రమంలో ఆగడాలు చేసే నిత్యానంద స్వామిలా బాబు ద్వంద్వ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) పక్షవాతం వచ్చిన రోగిలా మార్చేశారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే దుశ్శాసనుడిలా మారి వ్యవస్థను చెరబట్టారని పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు.
టీడీపీ రౌడీలు, గుండాల బెదిరింపులతో రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీల్లో, బాబు సొంత జిల్లా చిత్తూరు కార్పొరేషన్లో 51 చోట్ల, కడప కార్పొరేషన్లో 51 స్థానాల్లో ప్రతిపక్ష అభ్యర్థులు లేకుండా దౌర్జన్యంగా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 84 జెడ్పీటీసీ, 2 వేలకు పైగా ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు లేకుండా కుట్రలు చేశారన్నారు. పులివెందులలో టీడీపీ గుండాలు బ్యాలెట్ పేపర్లు లాక్కొని దొంగ ఓట్లు గుద్దిన వీడియోలు బట్టబయలయ్యాయని, తాము అడిగే పోలింగ్ బూత్‌లు, మున్సిపల్ వార్డుల సీసీటీవీ ఫుటేజీలను మీడియాకు విడుదల చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు.







