వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి షాకింగ్ పిటీషన్..!
వైసీపీ(YSRCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి(Lella Appireddy) జైలులో ప్రత్యేక కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలనే వ్యవహారంపై గుంటూరు కోర్టులో ఉత్కంఠ భరితమైన వాదనలు జరిగాయి. జైలు నిబంధనల ప్రకారం తనకు ప్రత్యేక కేటగిరీ సదుపాయాలు కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, ఖైదీ హోదాను బట్టి చట్టప్రకారం అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని తొలుత జైలు అధికారులను ఆదేశించింది.
అయితే, కోర్టు ఆదేశాలపై గుంటూరు జిల్లా కేంద్ర కారాగారం అధికారులు న్యాయస్థానానికి ఒక సంచలన నివేదికను సమర్పించారు. ప్రస్తుతం గుంటూరు జైలులో లేళ్ల అప్పిరెడ్డి కోరుతున్న విధంగా ప్రత్యేక కేటగిరీ సదుపాయాలు ఏవీ అందుబాటులో లేవని అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు అత్యంత కీలకమైన భద్రతా పరమైన అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. జైలులోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లేళ్ల అప్పిరెడ్డికి పూర్తి స్థాయి రక్షణ లేదా ప్రత్యేక భద్రతను కూడా తాము కల్పించలేమని అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.
గుంటూరు జైలులో సదుపాయాలు, భద్రత కల్పించడం సాధ్యం కాదు కాబట్టి.. అప్పిరెడ్డిని అన్ని వసతులు, కట్టుదిట్టమైన భద్రత ఉండే మరో వేరే జైలుకు తరలించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని జైలు అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. జైలు అధికారుల అభ్యర్థనపై స్పందించిన గుంటూరు కోర్టు.. ఈ విషయమై తమ పూర్తి వాదనలను, అభ్యంతరాలను తదుపరి విచారణ నాటికి లిఖితపూర్వకంగా కోర్టులో దాఖలు చేయాలని జైలు అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.







