రాముడుగా, సీతగా ఒకే నటుడు… 1917 నాటి రామాయణ విశేషాలు!
ఒక సినిమాలో హీరోగా, హీరోయిన్గా ఒకే వ్యక్తి నటిస్తే ఇప్పుడు అదో పెద్ద వింతగా చూస్తాం. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒకే నటుడు రెండు, మూడు పాత్రల్లో కనిపించడం కూడా సాధారణమైపోయింది. కానీ వందేళ్లకు పైగా వెనక్కి వెళ్తే.. సినిమాల్లో మహిళలు నటించడమే చాలా అరుదు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఏకంగా రాముడిగా, సీతగా రెండు పాత్రల్లో నటించాడు. అది కూడా మామూలు సినిమా కాదు.. మనం ఎంతో భక్తితో చూసే రామాయణంలోని పాత్రలు! ఈ విషయం వింటేనే ఆసక్తిగా అనిపిస్తోంది కదా! ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆయన రాముడిగా ఒకసారి, సీతగా మరోసారి తెరపై కనిపిస్తే ప్రేక్షకులు ఎలా స్పందించారు? అప్పట్లో కంప్యూటర్లు లేవు, గ్రాఫిక్స్ లేవు, భారీ సెట్లు లేవు. మరి హనుమంతుడు లంకకు ఎగురుకుంటూ వెళ్లడం, రావణుడి లంకను తగలబెట్టడం లాంటి సన్నివేశాలను ఎలా చిత్రీకరించారు?
నిజానికి రామాయణానికి సినిమాతో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ హీరోలు వేల కోట్ల బడ్జెట్‌తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్న ఈ రోజుల్లో.. దాదాపు 109 ఏళ్ల క్రితమే ఈ కథలోని ఓ కీలక ఘట్టాన్ని వెండితెరపై చూపించారు. భారతీయ సినిమా పితామహుడిగా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే 1917లో రూపొందించిన ఆ సినిమా పేరే ‘లంకా దహన్’ (Lanka Dahan). ఈ సినిమా గురించి తెలుసుకుంటే అప్పటి సినిమా ప్రపంచం ఎంత భిన్నంగా ఉండేదో అర్థమవుతుంది.
రాముడిగా కనిపించిన వ్యక్తే.. సీతగా కూడా!
1917లో సినిమాల్లో మహిళలు నటించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా సంప్రదాయ కుటుంబాలకు చెందిన మహిళలు సినిమాల్లో నటించడానికి ముందుకు వచ్చేవారు కాదు. దీంతో అప్పట్లో మహిళా పాత్రలను కూడా పురుషులే పోషించేవారు. ‘లంకా దహన్’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ సినిమాలో రాముడిగా, సీతగా కనిపించింది ఇద్దరు వేర్వేరు నటులు కాదు. అన్నా సాలుంకే (Anna Salunke) అనే ఒకే నటుడు రెండు పాత్రల్లో కనిపించాడు. అంటే ఒకవైపు రాముడిగా గంభీరంగా కనిపించిన ఆయనే, మరోవైపు సీతగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇప్పుడు ఒకే నటుడిని రెండు పాత్రల్లో చూపించాలంటే డిజిటల్ టెక్నాలజీతో ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. కానీ 1917లో అలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. అప్పట్లో మూకీ సినిమాల కాలం. అయినా ఫాల్కే తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రయోగాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అందుకే భారతీయ సినిమా చరిత్రలో తొలి డబుల్ రోల్స్‌లో ఒకటిగా, తరచుగా తొలి డబుల్ రోల్‌గా కూడా ‘లంకా దహన్’ ప్రస్తావనకు వస్తుంది.
మొత్తం రామాయణం కాదు.. హనుమంతుడి లంకా ప్రయాణమే కథ!
‘లంకా దహన్’ అనగానే రామాయణం మొత్తం సినిమాలో చూపించారేమో అనుకోవచ్చు. కానీ అలా కాదు. రామాయణంలోని సుందరకాండలో వచ్చే హనుమంతుడి లంకా ప్రయాణం, సీతాన్వేషణ, లంకాదహనం వంటి ఘట్టాలనే ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. రావణుడు సీతను అపహరించి లంకలో బంధించడం, ఆమెను వెతుక్కుంటూ హనుమంతుడు సముద్రాన్ని దాటి వెళ్లడం, అశోకవనంలో సీతను కలుసుకుని రాముడి సందేశాన్ని అందించడం.. ఇలా కథ ముందుకు సాగుతుంది.
సీతకు రాముడి గుర్తుగా ఉంగరాన్ని అందించిన హనుమంతుడు, ఆ తర్వాత రావణుడి సైనికులకు చిక్కుతాడు. ఆయనను అవమానించాలనే ఉద్దేశంతో తోకకు నిప్పు పెట్టాలని రావణుడు ఆదేశిస్తాడు. కానీ ఆ మంటలే చివరకు లంకానగరానికి నిప్పంటించడానికి కారణమవుతాయి. హనుమంతుడు లంకను దహనం చేసి తిరిగి రాముడి దగ్గరకు చేరుకుంటాడు. ఈ ఘట్టాలనే అప్పటి ప్రేక్షకులకు తెరపై చూపించారు. కథ ముందుగానే అందరికీ తెలిసి ఉండటంతో, మాటలు లేని సినిమా అయినప్పటికీ ప్రేక్షకులకు సన్నివేశాలను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాలేదు.
కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే హనుమంతుడి విన్యాసాలు!
ఇప్పుడు ఒక పౌరాణిక సినిమా తీయాలంటే ముందుగా విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. హనుమంతుడు సముద్రం దాటే సన్నివేశం కావచ్చు, లంకాదహనం కావచ్చు.. వీటిని అద్భుతంగా చూపించడానికి దర్శకులు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ 1917లో పరిస్థితి వేరు. కంప్యూటర్లు లేవు, గ్రీన్ స్క్రీన్లు లేవు, CGI అనే మాటే లేదు. అయినా దాదాసాహెబ్ ఫాల్కే ప్రేక్షకుల ఊహలకు తెరపై ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు.
హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరే సన్నివేశాల్లో కెమెరా ట్రిక్స్, దృశ్యాల అమరికను ఉపయోగించారు. ఆయన పైకి వెళ్లేకొద్దీ చిన్నగా కనిపించేలా చిత్రీకరించడం అప్పట్లో ప్రేక్షకులకు కొత్త అనుభవం. అలాగే లంకాదహనం కోసం చిన్న చిన్న నమూనాలను ఉపయోగించి, మినియేచర్ ఫోటోగ్రఫీ వంటి పద్ధతులతో నగరం కాలిపోతున్న భావనను సృష్టించారు. ఇప్పటి సినిమాల్లో ఇవన్నీ సాధారణంగా కనిపించినా, అప్పట్లో ఇలాంటి ప్రయోగాలు చేయడమే పెద్ద విషయం. అందుకే ‘లంకా దహన్’ను కేవలం పౌరాణిక కథ ఆధారంగా తీసిన సినిమాగా కాకుండా, తొలి భారతీయ సినిమా సాంకేతిక ప్రయోగాల్లో ఒకటిగా కూడా గుర్తుంచుకోవాలి.
ఎడ్లబండ్లలో థియేటర్లకు …
ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిన మరో ఆసక్తికరమైన విషయం దానికి వచ్చిన ప్రేక్షకాదరణ. అప్పట్లో సినిమా అనేది ఇప్పటిలా అందరికీ అందుబాటులో ఉన్న వినోదం కాదు. అయినా ‘లంకా దహన్’ చూడటానికి బొంబాయిలోని వెస్ట్ ఎండ్ థియేటర్‌కు జనం భారీగా తరలివచ్చేవారు. ఉదయం 7 గంటలకు మొదలైన ప్రదర్శనలు మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగాయని పేర్కొంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కొందరు ఎడ్లబండ్లలో థియేటర్లకు వచ్చేవారట. తెరపై రాముడి పాత్ర కనిపించగానే భక్తితో కొందరు చెప్పులు కూడా తీసేసేవారని అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
ఇక సినిమా టికెట్ల ద్వారా వచ్చిన నాణేలను గోనె సంచుల్లో నింపి, ఎడ్లబండ్లలో తరలించాల్సిన పరిస్థితి వచ్చిందని సినిమా చరిత్రకు సంబంధించిన కథనాలు చెబుతున్నాయి. ఈ వివరాలు చూస్తే అప్పట్లోనే రామాయణ కథకు ప్రేక్షకుల్లో ఎంతటి ఆదరణ ఉండేదో అర్థమవుతుంది. ఇప్పుడంటే ఓ సినిమా హిట్ అయిందా లేదా అని ఓపెనింగ్స్, వీకెండ్ కలెక్షన్లతో లెక్కలు వేస్తున్నాం. కానీ అప్పట్లో ఒక మూకీ సినిమా కోసం ఇంతమంది ప్రేక్షకులు థియేటర్లకు రావడమే పెద్ద విజయంగా చెప్పుకోవాలి.
అసలు ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు?
ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారతీయ సినిమా పితామహుడిగా గుర్తింపు పొందిన ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. 1870లో జన్మించిన ఫాల్కే, సినిమాపై ఆసక్తితో అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని భారతీయ చిత్ర పరిశ్రమకు పునాదులు వేశారు. 1913లో ఆయన రూపొందించిన ‘రాజా హరిశ్చంద్ర’ భారతదేశపు తొలి పూర్తి నిడివి ఫీచర్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత పౌరాణిక, చారిత్రక కథలను సినిమాలుగా రూపొందిస్తూ తనదైన ముద్ర వేశారు.
ఆయనకు పురాణ కథలపై ఉన్న ఆసక్తి వల్లే రామాయణంలోని హనుమంతుడి లంకా ప్రయాణం వంటి ఘట్టాలను కూడా సినిమాగా చూపించగలిగారు. ఇప్పుడు మనం భారీ సెట్లు, గ్రాఫిక్స్, అత్యాధునిక కెమెరాలతో చూస్తున్న పౌరాణిక సినిమాలకు అప్పట్లోనే ఒక దారి చూపించిన వ్యక్తి ఫాల్కే అని చెప్పొచ్చు.

1917 నుంచి నేటి వరకు.. రామాయణం సినిమా ప్రయాణం!
‘లంకా దహన్’తో మొదలైన రామాయణ సినిమాల ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. తర్వాత వివిధ భాషల్లో దర్శకులు ఈ ఇతిహాసాన్ని తమదైన శైలిలో తెరకెక్కించారు. 1934లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తెలుగు ‘లవకుశ’ పౌరాణిక సినిమాల చరిత్రలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. 1943లో విజయ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్ రాజ్య’ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. మహాత్మా గాంధీ చూసిన ఏకైక సినిమాగా ఈ చిత్రానికి ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది.
1958లో ‘సంపూర్ణ రామాయణం’ వంటి చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత 1963లో ఎన్టీఆర్, అంజలీదేవి నటించిన ‘లవకుశ’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక 1987లో రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణ్’ టెలివిజన్ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆదివారం ఉదయం టీవీ ముందు కుటుంబమంతా కూర్చుని చూసే స్థాయిలో ఆ సీరియల్ ప్రేక్షకుల జీవితాల్లో భాగమైంది. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో మళ్లీ ప్రసారం చేసినప్పుడు కూడా కోట్లాది మంది వీక్షించడం దాని ప్రజాదరణకు నిదర్శనం.
మారింది టెక్నాలజీ.. కానీ రామాయణంపై ఆసక్తి మాత్రం తగ్గలేదు!
— సూర్య ప్రకాష్ జోశ్యుల







