హ్యాపీ న్యూస్: UPI పేమెంట్స్‌కు ఛార్జీలు లేనట్లేనా? సామాన్యులకు కేంద్రం భారీ ఊరట!
ఇకపై ఫోన్‌పే, గూగుల్ పే వాడాలంటే కూడా డబ్బులు కట్టాలా? రూ.2,000 దాటిన ప్రతిసారీ అదనపు ఛార్జీలు పడతాయా? ఇన్నాళ్లూ చిల్లర సమస్య లేకుండా ఫోన్‌తోనే పేమెంట్లు చేసుకున్నాం.. ఇప్పుడు ఆ సౌకర్యానికి కూడా ఖర్చు చేయాల్సి వస్తుందా? UPI పేమెంట్లపై కొత్త ఛార్జీల వార్తలు బయటకు రావడంతో చాలామందిలో ఇలాంటి ప్రశ్నలే మొదలయ్యాయి. ముఖ్యంగా రోజూ చిన్న చిన్న కొనుగోళ్ల నుంచి పెద్ద బిల్లుల వరకు డిజిటల్ పేమెంట్లపైనే ఆధారపడేవాళ్లకు ఈ వార్త కాస్త టెన్షన్ పెట్టింది. అయితే అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. సామాన్యులు చేసే UPI లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని చెప్పడంతో వినియోగదారులకు ఊరట లభించింది. మరి అసలు ఛార్జీలు ఎవరికి పడతాయి? రూ.2,000 దాటితే ఏం జరుగుతుంది?
సామాన్యులకు ఛార్జీలు లేనట్లేనా?
కేంద్రం ఇచ్చిన క్లారిటీ ప్రకారం.. వ్యక్తుల మధ్య జరిగే UPI లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. మీరు స్నేహితుడికి డబ్బులు పంపినా, కుటుంబ సభ్యులకు ఎంత పెద్ద మొత్తం ట్రాన్స్ఫర్ చేసినా ఉచితమే. షాపుల్లో రూ.2,000 వరకు చేసే పేమెంట్లకు కూడా MDR ఉండదు. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు కూడా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. UPI QR కోడ్ ద్వారా నెలకు రూ.లక్ష వరకు పేమెంట్లు స్వీకరించే అర్హత కలిగిన చిన్న వ్యాపారులపై కూడా ఛార్జీలు విధించరు.
ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 96 శాతం మర్చంట్ లావాదేవీలపై ఈ కొత్త విధానం ప్రభావం ఉండదు. అంటే రోజూ టీ కొట్టు, కిరాణా షాపు, చిన్న హోటళ్లలో UPI వాడేవాళ్లకు పెద్దగా మార్పేమీ ఉండదు.
రూ.2,000 దాటితే ఎవరికి ఛార్జీలు?
ఇక్కడే అసలు విషయం ఉంది. రూ.2,000 దాటిన ప్రతి పేమెంట్‌పై ఛార్జీలు పడవు. ఎంపిక చేసిన పెద్ద మొత్తాల వ్యాపార లావాదేవీలపై మాత్రమే 0.4 శాతం MDR వర్తిస్తుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠ ఛార్జీ రూ.300గా నిర్ణయించారు. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని చెల్లింపులపై రూ.5 ఫ్లాట్ ఛార్జీ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీల చెల్లింపులకు 0.02 శాతం రేటు వర్తిస్తుంది.
షాపుల్లో అదనంగా డబ్బులు అడిగితే?
MDR ఛార్జీలను వినియోగదారులపై వేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాపారులు ఈ పేరుతో కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయకుండా చూడాలని బ్యాంకులకు సూచించింది. UPI యాప్స్ కూడా ప్లాట్‌ఫామ్ ఫీజు లేదా దాచిన ఛార్జీల పేరుతో వినియోగదారులపై భారం వేయకూడదు. కాబట్టి UPI ద్వారా పేమెంట్ చేస్తున్నారనే కారణంతో షాపు యజమాని అదనంగా డబ్బులు అడిగితే అది నిబంధనలకు విరుద్ధం.
దీపావళి తర్వాత కొత్త ఛార్జీలు ఎప్పటి నుంచి?
ఈ MDR విధానం వాస్తవానికి అక్టోబర్ 15 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే పండుగల సమయంలో వ్యాపారులపై అదనపు భారం పడుతుందన్న అభ్యంతరాలతో NPCI దీన్ని దీపావళి తర్వాతకు వాయిదా వేసింది. నవంబర్ 8 తర్వాత కొత్త తేదీని ప్రకటించాల్సి ఉంది. వ్యాపార సంఘాలు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చల అనంతరం తమ నిరసనను విరమించుకున్నాయి.
UPI వ్యవస్థ నిర్వహణకు వేల కోట్ల ఖర్చు!
దేశంలో డిజిటల్ పేమెంట్లు ఎంతగా పెరిగాయో అక్టోబర్ గణాంకాలే చెబుతున్నాయి. ఒక్క నెలలోనే UPI లావాదేవీల విలువ 16 శాతం పెరిగి రూ.31.53 లక్షల కోట్లకు చేరింది. ఈ వ్యవస్థను నిర్వహించడానికి ఏడాదికి సుమారు రూ.21,000 కోట్లు ఖర్చవుతోందని NPCI CEO దిలీప్ ఆస్బే వెల్లడించారు. కొత్త MDR విధానం ద్వారా మొదటి ఏడాదిలో రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
మొత్తానికి UPI పేమెంట్లకు ఛార్జీలు పడతాయనే వార్తలతో కంగారు పడిన సామాన్యులకు కేంద్రం ప్రకటన ఊరటనిచ్చింది. ఫోన్ తీసి QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసే అలవాటుకు ఇప్పటికిప్పుడు బ్రేక్ పడే పరిస్థితి లేదు. అయితే ఎంపిక చేసిన పెద్ద మొత్తాల వ్యాపార లావాదేవీలపై MDR అమలు మాత్రం దీపావళి తర్వాత ప్రారంభం కానుంది.
— సూర్య ప్రకాష్ జోశ్యుల







