మానసికంగా బలమైన వ్యక్తుల్లో ఉండే 7 ప్రత్యేక అలవాట్లు ఇవే!
జీవితంలో ఎదురయ్యే సమస్యలను అందరూ ఒకేలా ఎదుర్కోలేరు. కొందరు చిన్న సమస్య వచ్చినా ఆందోళనకు గురవుతారు. మరికొందరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం వెతుకుతారు. అలాంటి వారినే మానసికంగా బలమైన వ్యక్తులుగా చెప్పవచ్చు. మానసిక బలం (Mental Strength) అంటే ఎప్పుడూ బాధపడకపోవడం, ఏడవకపోవడం లేదా ఎవరి సహాయం అవసరం లేకపోవడం కాదు. కష్టాలు ఎదురైనప్పుడు వాటిని అర్థం చేసుకుని, భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ముందుకు సాగడం. ఇలాంటి వ్యక్తుల్లో కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు కనిపిస్తాయి. వాటిని మన జీవితంలోనూ భాగం చేసుకుంటే ఆలోచనా విధానంలో మంచి మార్పు వస్తుంది.
తమ నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించరు
మానసికంగా బలంగా ఉండే వ్యక్తులు ప్రతి విషయాన్నీ తమ నియంత్రణలో ఉంచుకోవాలని ప్రయత్నించరు. తమ చేతుల్లో లేని విషయాల గురించి అతిగా ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయరు. పరిస్థితులను అంగీకరించి, తాము చేయగలిగిన పనిపై దృష్టి పెడతారు. దీనివల్ల అనవసరమైన ఒత్తిడి (Stress) తగ్గుతుంది.
ఇతరులతో తమను పోల్చుకోవడం కూడా వీరికి తక్కువ. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం, అవకాశాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని అర్థం చేసుకుంటారు. ఎదుటివారు సాధించిన విజయాలను చూసి అసూయపడకుండా, వాటి నుంచి ప్రేరణ పొందుతారు. తమ నిన్నటి స్థితితో నేటి పరిస్థితిని పోల్చుకుంటూ ఎదగడానికి ప్రయత్నిస్తారు.
విమర్శలను స్వీకరిస్తూ.. అవసరమైనప్పుడు నో చెబుతారు
విమర్శలను స్వీకరించే విధానం కూడా మానసిక బలానికి సంకేతం. ఎవరైనా తమలోని లోపాలను ఎత్తిచూపితే వెంటనే కోపం తెచ్చుకోవడం లేదా బాధపడటం చేయరు. ఆ విమర్శలో నిజం ఎంత ఉందో ఆలోచిస్తారు. ఉపయోగపడే సూచనలను స్వీకరించి, అవసరం లేని మాటలను పట్టించుకోకుండా వదిలేస్తారు.
అలాగే, ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నం చేయరు. తమకు ఇష్టం లేని పనులకు అవసరమైనప్పుడు సున్నితంగా ‘నో’ (No) చెప్పగలుగుతారు. ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇస్తూనే తమ వ్యక్తిగత హద్దులను కాపాడుకుంటారు. దీనివల్ల అనవసరమైన బాధ్యతలు, ఒత్తిళ్లు తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి
తప్పుల నుంచి నేర్చుకుంటూ భావోద్వేగాలను నియంత్రించుకుంటారు
తప్పులు జరిగినప్పుడు వాటిని దాచిపెట్టకుండా అంగీకరిస్తారు. ఒకసారి విఫలమయ్యామని తమ సామర్థ్యంపై సందేహం పెంచుకోరు. ఆ అనుభవం నుంచి నేర్చుకుని మరోసారి మెరుగ్గా ప్రయత్నిస్తారు. వైఫల్యాన్ని తమ జీవితానికి ముగింపుగా కాకుండా, నేర్చుకునే అవకాశంగా చూస్తారు.
మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు తమ భావోద్వేగాలను (Emotions) కూడా గుర్తించగలుగుతారు. కోపం, బాధ, భయం కలిగినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుంటారు. అవసరమైతే నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడతారు. భావాలను మనసులోనే దాచుకోవడం మానసిక బలం కాదని వారికి తెలుసు.
మానసిక బలాన్ని పెంచే రోజువారీ అలవాట్లు ఇవే
వీటితో పాటు రోజువారీ జీవితంలో చిన్న లక్ష్యాలను పెట్టుకోవడం, తగినంత నిద్రపోవడం, శారీరక చురుకుదనానికి సమయం కేటాయించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి అలవాట్లకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతిరోజూ కొద్దిగా అయినా తమను తాము మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు.
మానసిక బలం అనేది పుట్టుకతోనే వచ్చే లక్షణం కాదు. నిరంతర సాధన, సరైన ఆలోచనా విధానం, అనుభవాల నుంచి నేర్చుకోవడం ద్వారా దాన్ని పెంచుకోవచ్చు. సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, అవసరమైనప్పుడు సహాయం తీసుకుంటూ ముందుకు సాగడం నేర్చుకుంటే మనమూ మానసికంగా మరింత దృఢంగా మారవచ్చు.







