సూర్యరశ్మితో బ్లడ్ షుగర్ కు షాకింగ్ లింక్? రీసెర్చ్ ఏం తేల్చిందంటే…!
మన ఆరోగ్యం కోసం రోజూ కాసేపైనా ఎండలో ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి అవసరమని, ఉదయం సూర్యరశ్మి శరీరానికి మంచిదని మనకు తెలుసు. అయితే సూర్యరశ్మికి మరో ఆసక్తికరమైన ప్రయోజనం కూడా ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అదేంటంటే.. ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల శరీరంలోని జీవక్రియలు మెరుగుపడటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గే అవకాశం ఉందట!
ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు షుగర్ నియంత్రణ గురించి మాట్లాడినప్పుడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మందుల గురించే ఎక్కువగా చర్చించేవాళ్లం. కానీ ఇప్పుడు సహజమైన వెలుతురు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయగలదని శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు.
షుగర్ నియంత్రణలో సూర్యరశ్మి పాత్ర ఏంటి?
జర్మనీలోని డ్యూసెల్డార్ఫ్కు చెందిన జర్మన్ డయాబెటిస్ సెంటర్లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న పాట్రిక్ ష్రౌవెన్ ఈ అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. మన శరీర జీవక్రియల విషయంలో సహజమైన వెలుతురును ఇప్పటివరకు పెద్దగా పట్టించుకోలేదు.
ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో సహజమైన వెలుతురు కూడా అంతే కీలకమైన పాత్ర పోషించవచ్చని ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు పరిశోధకులు 13 మంది టైప్-2 డయాబెటిస్ బాధితులతో ఒక చిన్న అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిని కొన్ని రోజుల పాటు రెండు వేర్వేరు వాతావరణాల్లో ఉంచారు. ఒక బృందం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కిటికీల ద్వారా వచ్చే సహజమైన పగటి వెలుతురులో గడిపింది. మరో బృందం మాత్రం కృత్రిమ లైట్ల వెలుతురులోనే ఉంది.
వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పరిశీలించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. సహజమైన పగటి వెలుతురు అందుబాటులో ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ పరిధిలో ఎక్కువ సమయం కొనసాగించగలిగారు.
4.20 లక్షల మందిపై పరిశోధన.. మరో ఆసక్తికరమైన విషయం!
ఇది కేవలం 13 మందిపై నిర్వహించిన చిన్న అధ్యయనంతోనే ఆగిపోలేదు. బ్రిటన్‌లో 4.20 లక్షల మందికి పైగా ప్రజల ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించిన మరో పరిశోధన కూడా ఇదే తరహా విషయాలను వెల్లడించింది.
ఆగస్టులో వెలువడిన ఈ అధ్యయనంలో పరిశోధకులు UK Biobank డేటాను ఉపయోగించారు. ఇందులో పాల్గొన్నవారి రక్తంలో గ్లూకోజ్ పరీక్షల ఫలితాలను, వారు నివసించే ప్రాంతాల్లో ఎంత సూర్యరశ్మి అందుబాటులో ఉందనే ఉపగ్రహ సమాచారంతో పోల్చి చూశారు.
రక్త పరీక్షకు ముందు రెండు రోజుల నుంచి ఏడు రోజుల మధ్య కాలంలో ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గడిపినవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు.
ఎందుకంటే శీతాకాలంలో పగటి వెలుతురు తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కొద్దిగా ఎక్కువ సూర్యరశ్మి అందినా శరీరంపై దాని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
ట్యానింగ్ బెడ్స్ వాడేవారిలోనూ డయాబెటిస్ ముప్పు తక్కువేనా?
ఈ పరిశోధనలో మరో ఆసక్తికరమైన అంశం కూడా బయటపడింది. సూర్యరశ్మికి ప్రత్యామ్నాయంగా UV కిరణాలను అందించే ట్యానింగ్ బెడ్స్ ఉపయోగించే వ్యక్తుల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
మన శరీరంలోని బయోలాజికల్ క్లాక్‌కు వెలుతురుతో సంబంధం!
అసలు సూర్యరశ్మి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ప్రభావితమవుతున్నాయి? దీనికి శాస్త్రవేత్తలు ప్రధానంగా మన శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm)ను కారణంగా భావిస్తున్నారు.
సాధారణంగా మన శరీరానికి ఒక అంతర్గత గడియారం ఉంటుంది. ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు మేల్కొనాలి? ఎప్పుడు హార్మోన్లు విడుదల కావాలి? శరీరంలోని జీవక్రియలు ఎలా పనిచేయాలి? వంటి అనేక విషయాలను ఈ వ్యవస్థ నియంత్రిస్తుంది.
ఈ అంతర్గత గడియారాన్ని సరిగా పనిచేయించే ప్రధాన సంకేతం సహజమైన వెలుతురు.
హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన న్యూరో సైంటిస్ట్ ఫ్రాంక్ షీర్ ప్రకారం.. పగటిపూట సహజమైన వెలుతురు మన శరీర అంతర్గత గడియారాన్ని బలంగా ఉంచుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర బరువు, గుండె సంబంధిత పనితీరుపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే రాత్రిపూట ఎక్కువ వెలుతురు ఉండటం ఈ వ్యవస్థను దెబ్బతీయవచ్చు.
పగటిపూట చీకటి గదుల్లో.. రాత్రిపూట ఫోన్ల వెలుతురులో!
మన జీవనశైలి ఇప్పుడు ఎలా మారిపోయిందో ఒక్కసారి గమనించండి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు చాలామంది ఇళ్లలోనో, ఆఫీసుల్లోనో గడిపేస్తున్నారు. బయట ఎంత ఎండ ఉన్నా మనకు అందే సహజమైన వెలుతురు చాలా తక్కువ.
మరోవైపు రాత్రి పడుకునే సమయానికి కూడా ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి గడుపుతున్నాం. అంటే పగటిపూట మన శరీరానికి అందాల్సిన సహజమైన వెలుతురు అందడం లేదు. రాత్రిపూట మాత్రం అవసరానికి మించి కృత్రిమ వెలుతురు అందుతోంది.
ఇదే మన శరీర అంతర్గత గడియారాన్ని గందరగోళానికి గురిచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రాత్రిపూట వెలుతురు వల్ల శరీరంలోని సింపథటిక్ నాడీ వ్యవస్థ (Sympathetic Nervous System) చురుకుగా మారవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా ఇది ప్రమాదం ఎదురైనప్పుడు శరీరాన్ని అప్రమత్తం చేసే వ్యవస్థ. దీనినే ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ రెస్పాన్స్ అంటారు. రాత్రి సమయంలో ఈ వ్యవస్థ అనవసరంగా చురుకుగా ఉంటే శరీరంలోని గ్లూకోజ్ జీవక్రియ దెబ్బతినే అవకాశం ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు.
చర్మంలో జరిగే మరో ప్రక్రియ కూడా కారణమేనా?
సూర్యరశ్మి మన జీవక్రియలను ప్రభావితం చేయడానికి సిర్కాడియన్ రిథమ్ ఒక్కటే కారణం కాకపోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రయోగశాలల్లో నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో UVA అనే అతినీలలోహిత కిరణాలు చర్మంలోని నైట్రైట్ నిల్వలను నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చగలవని గుర్తించారు.
నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను వెడల్పు చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడటంతో పాటు రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలు గ్లూకోజ్ నియంత్రణకు కూడా ఉపయోగపడవచ్చని క్రిస్ డిబెన్ వివరిస్తున్నారు.
ఈ పరిశోధనలన్నింటినీ కలిపి చూస్తే.. సహజమైన వెలుతురు మన జీవక్రియలు, గుండె ఆరోగ్యం, శరీర బరువుపై కూడా ప్రభావం చూపవచ్చనే విషయం స్పష్టమవుతోంది. ఎక్కువ సూర్యరశ్మి అందుకునేవారిలో ఊబకాయం ముప్పు తక్కువగా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశాన్ని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అందుకే పగటిపూట వీలైనంత ఎక్కువ సమయం బయట గడపాలని పరిశోధకులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే అవకాశం లేకపోతే కిటికీ దగ్గర కూర్చోవడం, పని చేసే ప్రదేశంలో సహజమైన వెలుతురు వచ్చేలా చూసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే నిద్రపోయే కొన్ని గంటల ముందు ఫోన్లు, టీవీలు వంటి కృత్రిమ వెలుతురు వనరులను తగ్గించాలని సూచిస్తున్నారు.\
ఏదైమైనా…
మన ఆరోగ్యం కోసం జిమ్‌కు వెళ్లడం, డైట్ పాటించడం ఎంత ముఖ్యమో.. పగటిపూట మన శరీరానికి సహజమైన వెలుతురు అందేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే సూర్యరశ్మి వల్ల డయాబెటిస్ తగ్గుతుందని ఇంకా నిర్ధారణ కాలేదు. షుగర్ మందులు, డాక్టర్ సూచించిన చికిత్సలకు ఇది ప్రత్యామ్నాయం కూడా కాదు. కానీ రోజంతా నాలుగు గోడల మధ్యే ఉండిపోయే మన లైఫ్‌స్టైల్‌ను ఒక్కసారి మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం ఈ అధ్యయనాలు గుర్తుచేస్తున్నాయి.
–సూర్య ప్రకాష్ జోశ్యుల







