తమిళనాడులో కొత్త సినిమాలకు రోజుకు ఆరు షోలు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్(vijay) సినీ ఇండస్ట్రీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా రిలీజయ్యే తమిళ సినిమాలకు మొదటి వారం పాటు రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు థియేటర్లకు అనుమతినిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటల వరకు ఈ షో లకు అవకాశం కల్పించింది. సినిమా రిలీజైన మొదటి ఏడు రోజుల పాటు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుంది. స్థానిక పండుగలు, ప్రభుత్వ సెలవులు, శని, ఆదివారాల్లోనూ ఆరు షోలు నిర్వహించుకోవచ్చు. ఇందుకోసం థియేటర్ల యాజమాన్యాలు ప్రత్యేకంగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే థియేటర్ల యాజమాన్యాలు కోరిన టికెట్ ధరల పెంపునకు మాత్రం ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. అదనపు షోలతో పాటు టికెట్ రేట్లను కూడా పెంచాలని ఇండస్ట్రీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం రోజుకు నాలుగు షోలకు మాత్రమే పర్మిషన్ ఉండగా, గతంలో విజయ్ ప్రభుత్వం కొత్త సినిమాల ఫస్ట్ వీక్ కు ఐదు షోల వరకు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది.
తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సమాచార, ప్రచార శాఖ మంత్రి రాజ్మోహన్(rajmohan) ఇండస్ట్రీ ప్రతినిధులతో చర్చించిన అనంతరం ప్రతిపాదనలను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపించారు. తాజాగా ఆరు షోలకు పర్మిషన్ లభించడంతో కొత్త సినిమాలకు ఫస్ట్ వీక్ లో మరిన్ని ప్రదర్శనలు అందుబాటులోకి రానున్నాయి. ఇది బాక్సాఫీస్ కలెక్షన్లకు ఎంతవరకు దోహదపడుతుందో చూడాలి.







