లాస్ ఏంజెలెస్ మేయర్ రేసులో నిత్యా రామన్…లాస్ట్ మినిట్ లో లెక్కలు మారిపోయాయా?
అమెరికాలో ఇండియన్స్ పొలిటికల్ గేమ్‌లోనూ తమ మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించి ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మరో భారతీయ మూలాలున్న మహిళ పేరు తెగ ట్రెండ్ అవుతోంది. ఆమె నిత్యా రామన్. కేరళలో పుట్టి అమెరికాలో పెరిగిన ఈ 45 ఏళ్ల మహిళ లాస్ ఏంజెలెస్ మేయర్ రేసులో ఉన్నారు. గెలిస్తే ఆ నగరానికి తొలి ఇండియన్ అమెరికన్ మేయర్‌గా రికార్డు సృష్టిస్తారు.
అయితే ఎన్నికల రేసు ఇప్పుడు అస్సలు ఈజీగా లేదు. మొదట్లో నిత్యా రామన్ పేరు గట్టిగా వినిపించింది. సర్వేల్లో ప్రత్యర్థి కంటే భారీ ఆధిక్యం కూడా సాధించారు. దీంతో ఆమె గెలుపు దాదాపు ఖాయమనే అంచనాలు వచ్చాయి. కానీ సీన్ ఒక్కసారిగా మారింది. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్ స్పీడ్ పెంచారు. ఇద్దరి మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు రామన్ గెలుపును డిసైడ్ చేయబోయే ఐదు అంశాలు ఆసక్తికరంగా మారాయి.
1. విన్నింగ్ పొజిషన్ నుంచి టైట్ ఫైట్‌లోకి!
సెప్టెంబర్‌లో వచ్చిన సర్వేలు చూస్తే నిత్యా రామన్ కు తిరుగులేదనిపించింది. ఆమెకు 39 శాతం మద్దతు ఉంటే, కరెన్ బాస్‌కు 28 శాతం మాత్రమే ఉంది. అంటే 11 శాతం ఆధిక్యం. కానీ ఎన్నికల ముందు వచ్చిన తాజా సర్వే మొత్తం సీన్ మార్చేసింది. అక్టోబర్ 28న విడుదలైన ఫలితాల్లో ఇద్దరికీ చెరో 40 శాతం మద్దతు వచ్చింది.
ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఇంకా 19 శాతం మంది ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో ఫిక్స్ కాలేదు. అంటే చివరి నిమిషంలో వీళ్లు ఎవరివైపు మొగ్గుతారో వారిదే పైచేయి కావచ్చు. మరో సర్వేలో మాత్రం రామన్ 46.7 శాతంతో ముందున్నారు. కానీ ప్రిడిక్షన్ మార్కెట్లు కరెన్ బాస్ గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే.. రామన్‌కు ఉన్న అడ్వాంటేజ్ ఇప్పుడు గాల్లో కలిసిపోయింది. ఎన్నికల ఫలితం వచ్చే వరకు ఎవరి గెలుపు గురించి క్లారిటీ లేదు.
2. పాత వీడియోలు, పాత స్టేట్మెంట్లు ఇప్పుడు తలనొప్పిగా మారాయి!
ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. గతంలో మీరు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చెబుతున్నారు? అనే లెక్కలన్నీ బయటకు తీస్తారు. రామన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
2020లో పోలీసులకు నిధులు తగ్గించాలనే డిఫండ్ ద పోలీస్ ఉద్యమానికి నిత్యా రామన్ మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు మేయర్ రేసులో పోలీస్ శాఖలో సిబ్బందిని కొనసాగిస్తానంటున్నారు. పోలీసుల అవసరాన్ని తాను వ్యతిరేకించడం లేదని, ఖరీదైన ఒప్పందాలపైనే తన అభ్యంతరమని వివరణ ఇస్తున్నారు.
నిరాశ్రయుల విషయంలోనూ ఆమె పాత నిర్ణయాలను ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు. ఒకప్పుడు బహిరంగ ప్రదేశాల్లో నిరాశ్రయులు ఉండకుండా నిషేధించడాన్ని వ్యతిరేకించిన రామన్, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అలాంటి నిబంధనలకు అడ్డుపడనని చెబుతున్నారు. ఈ మార్పులన్నింటినీ కరెన్ బాస్ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు.
మరోవైపు తొలుత బాస్ మళ్లీ మేయర్ కావాలని మద్దతు ఇచ్చిన రామన్, ఆ తర్వాత ఆమెపైనే పోటీకి దిగడం కూడా విమర్శలకు కారణమైంది. నగర పాలనపై అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రామన్ చెబుతున్నా, ప్రత్యర్థి మాత్రం ఆమె మాట మార్చే నాయకురాలని ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు దీన్ని ఎలా తీసుకుంటారన్నదే కీలకం.
3. ఒలింపిక్స్ ముందు పోలీస్ చీఫ్‌ను మార్చడం అవసరమా?
2028లో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ప్రపంచం మొత్తం ఆ నగరంపై ఫోకస్ పెట్టే సమయంలో పోలీస్ శాఖలో నాయకత్వ మార్పులు చేయాలన్న రామన్ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
తాను మేయర్ అయితే ప్రస్తుత పోలీస్ చీఫ్ జిమ్ మెక్డొనెల్ను తొలగిస్తానని ఆమె చెప్పారు. కానీ ఎప్పుడు తొలగిస్తారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. మొదటి రోజే కొత్త చీఫ్ కోసం వెతుకుతానని ఒకసారి చెబితే, మరోసారి 2030 నాటికి కొత్త చీఫ్‌ను నియమిస్తానని అన్నారు.
ఇదే పాయింట్‌ను కరెన్ బాస్ గట్టిగా పట్టుకున్నారు. ఒలింపిక్స్‌కు ముందు పోలీస్ చీఫ్‌ను మార్చడం అంటే భద్రతా వ్యవస్థతో రిస్క్ ఆడటమేనని ఆమె వాదిస్తున్నారు.
ఇక పోలీస్ చీఫ్‌పై రామన్ చేసిన ఆరోపణలు, మాజీ పోలీస్ చీఫ్ డారిల్ గేట్స్ పేరును ప్రస్తావించడం కూడా వివాదాలకు దారితీశాయి. ఒకదాని తర్వాత మరొకటి ఇలాంటి వివాదాలు రావడం ఆమె ప్రచారానికి మైనస్‌గా మారే అవకాశం ఉంది.
4. పొలిటికల్ సపోర్ట్ మొత్తం బాస్ వైపే!
ప్రజల్లో ఎవరికెంత క్రేజ్ ఉందన్నది ఒక లెక్క. రాజకీయ వ్యవస్థలో ఎవరి వెనుక ఎంతమంది ఉన్నారన్నది మరో లెక్క. రెండో విషయంలో కరెన్ బాస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు.
లాస్ ఏంజెలెస్ సిటీ కౌన్సిల్‌లోని 14 మంది సభ్యుల్లో 13 మంది బాస్‌కు మద్దతు ప్రకటించారు. కౌంటీ సూపర్వైజర్లలోనూ ఐదుగురికి నలుగురు ఆమెవైపే ఉన్నారు. అంటే నగర రాజకీయాల్లో కీలకమైన నేతలంతా దాదాపు ప్రస్తుత మేయర్‌కు అండగా నిలిచారు.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2022లో బాస్‌తో మేయర్ పదవికి పోటీ పడిన రిక్ కారుసో కూడా ఇప్పుడు ఆమెకే మద్దతు ప్రకటించారు. రామన్ ఇంకా మేయర్ బాధ్యతలకు సిద్ధంగా లేరని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే రామన్‌కు కూడా కొందరు కీలక నేతల మద్దతు ఉంది. కానీ బాస్‌కు ఉన్నంత రాజకీయ బలం ఆమెకు లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల మద్దతును ఓట్లుగా మార్చుకోవడమే రామన్‌కు అసలైన ఛాలెంజ్.
5. యువత ఫ్యాన్స్ ఉన్నారు.. మరి ఓట్లు వేస్తారా?
ఇది నిత్యా రామన్ కు సంబంధించిన అసలైన గేమ్ ఛేంజర్ కావచ్చు. ఎందుకంటే యువ ఓటర్లలో ఆమెకు మంచి మద్దతు ఉంది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 69 శాతం మంది రామన్‌కు సపోర్ట్ చేస్తున్నారు. 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఈ సంఖ్య 74 శాతంగా ఉంది.
కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. సపోర్ట్ చేయడం వేరు.. ఓటు వేయడం వేరు. ముందస్తు ఓటింగ్ లెక్కలు చూస్తే యువత కంటే పెద్ద వయసు వాళ్లే ఎక్కువగా స్పందిస్తున్నారు.
అక్టోబర్ 28 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారికి పంపిన బ్యాలెట్లలో కేవలం 12 శాతం మాత్రమే తిరిగి వచ్చాయి. అదే 65 ఏళ్లు పైబడిన వారి విషయంలో ఈ సంఖ్య 47 శాతం. అంటే యువత రామన్‌కు మద్దతు ఇస్తున్నామని చెబుతున్నా, ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి వెనకబడుతున్నారు.
ఇప్పుడు రామన్ ఆశలన్నీ యువ ఓటర్లపైనే ఉన్నాయి. వాళ్లు చివరి నిమిషంలో పెద్ద సంఖ్యలో ఓటు వేస్తే లెక్కలు మారిపోవచ్చు. లేదంటే సర్వేల్లో కనిపించిన యువత మద్దతు కేవలం కాగితాలకే పరిమితం కావచ్చు.
మమ్దానీ తర్వాత మరో ఇండియన్ అమెరికన్ విక్టరీ సాధ్యమేనా?
న్యూయార్క్‌లో జోహ్రాన్ మమ్దానీ విజయం తర్వాత అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలున్న నాయకుల గురించి చర్చ పెరిగింది. ఇప్పుడు నిత్యా రామన్ గెలిస్తే ఆ చర్చ మరో లెవల్‌కు వెళ్తుంది. అమెరికాలోని రెండు అతిపెద్ద నగరాలకు భారతీయ మూలాలున్న మేయర్లు నాయకత్వం వహించే పరిస్థితి వస్తుంది.
కేరళలో పుట్టిన రామన్ ఆరేళ్ల వయసులోనే అమెరికాకు వెళ్లారు. 2013లో లాస్ ఏంజెలెస్‌కు వచ్చారు. తాను అక్కడ పుట్టకపోయినా ఆ నగరం తనదేనని చెబుతుంటారు. హాలోవీన్ సందర్భంగా నగరానికి ప్రసిద్ధి చెందిన P-22 పర్వత సింహం గుర్తుగా ప్రత్యేకమైన చెవుల అలంకరణ ధరించి ప్రచారం చేయడం కూడా యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగమే.
ఇప్పుడు ఆమె ముందు ఉన్నది ఒక్కటే టార్గెట్. ప్రచారంలో వచ్చిన క్రేజ్‌ను ఓట్లుగా మార్చుకోవాలి. ప్రత్యర్థి రాజకీయ బలాన్ని తట్టుకోవాలి. యువతను పోలింగ్‌కు రప్పించాలి.
ఒకవైపు కేరళ మూలాలున్న మహిళ అమెరికా రాజకీయాల్లో చరిత్ర సృష్టించే అవకాశం.. మరోవైపు చివరి నిమిషంలో గట్టిగా పుంజుకున్న ప్రస్తుత మేయర్. రామన్‌కు ఇది హిస్టారికల్ విన్ అవుతుందా? లేక కరెన్ బాస్ మరోసారి తన సీటును కాపాడుకుంటారా? ఈ పొలిటికల్ క్లైమాక్స్ మాత్రం ఆసక్తికరంగా మారింది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







