PhonePe ని జనం నమ్మటం లేదా? పేరు మార్చినా ఫలితం లేదా?
ఒకప్పుడు PhonePe అంటే డిజిటల్ పేమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్. టీ కొట్టులో పది రూపాయలు కట్టాలన్నా, ఫ్రెండ్‌కు డబ్బులు పంపాలన్నా, షాపింగ్ బిల్లు పే చేయాలన్నా చాలామందికి గుర్తొచ్చే మొదటి పేరు ఇదే. కోట్లాది మంది ఫోన్లలో ఈ యాప్ ఉంది. UPI మార్కెట్లోనూ తిరుగులేని ఆధిపత్యం. మరి ఇంతటి క్రేజ్ ఉన్న బ్రాండ్ స్టాక్ మార్కెట్లోకి దిగితే సీన్ ఎలా ఉండాలి? యూజర్లతో యాప్ కళకళలాడిపోవాలి. పెట్టుబడులు పెట్టేవాళ్లతో బిజీబిజీగా కనిపించాలి. కానీ PhonePe విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది!
ట్రేడింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన PhonePeకి ఇప్పుడు గట్టి షాక్ తగిలింది. యూజర్లను ఆకర్షించలేకపోతోందా? ఉన్నవాళ్లను నిలబెట్టుకోలేకపోతోందా? పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే.. గతంలో Share.Market పేరుతో నడిచిన తన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ పేరునే మార్చేసింది. కొత్త పేరు PhonePe Invest. పేరు మారింది.. బ్రాండింగ్ మారింది. కానీ యూజర్ల మనసు మారుతుందా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే ఈ కొత్త పేరు వెనుక ఉన్న పాత సమస్య మాత్రం ఇంకా అలాగే కనిపిస్తోంది.
40 శాతం మంది యూజర్లు జంప్!
అందుతున్న సమాచారం మేరకు … PhonePe ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ యాక్టివ్ యూజర్ల సంఖ్య భారీగా పడిపోయింది. మార్చి 2025లో సుమారు 3.55 లక్షల మంది యాక్టివ్ క్లయింట్లు ఉండగా, సెప్టెంబర్ 2026 నాటికి ఆ సంఖ్య కేవలం 2 లక్షలకు చేరింది. అంటే ఏడాదిన్నరలోనే దాదాపు 40 శాతం మంది యాక్టివ్ యూజర్లు తగ్గిపోయారు.
ఇక్కడ యాక్టివ్ యూజర్లు అంటే కేవలం యాప్ డౌన్లోడ్ చేసుకున్నవాళ్లు కాదు. నిజంగా ట్రేడింగ్ చేస్తున్న క్లయింట్లు. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేయడం వేరు.. అందులో డబ్బులు పెట్టి షేర్లు కొనడం, అమ్మడం, మళ్లీ మళ్లీ ట్రేడింగ్ చేయడం వేరు. PhonePe దగ్గర సమస్య రెండో దగ్గరే కనిపిస్తోంది.
అయితే స్టాక్ బ్రోకింగ్ రంగం మొత్తానికి గత 18 నెలలు అంత సులభంగా ఏమీ గడవలేదు. FY26లో పరిశ్రమ మొత్తం యాక్టివ్ క్లయింట్లు 7 శాతం, అంటే దాదాపు 35 లక్షల మేర తగ్గి 4.5 కోట్లకు చేరారు. కానీ పరిశ్రమలో 7 శాతం తగ్గితే, PhonePe ప్లాట్ఫామ్లో ఏకంగా 40 శాతం తగ్గడం మాత్రం కంపెనీని ఆలోచనలో పడేసే అంశం.
PhonePeలో డబ్బులు పంపుతారు.. కానీ పెట్టుబడి పెట్టరా?
ఇదే ఈ కథలో అసలైన ట్విస్ట్! PhonePeకి యూజర్ల కొరత ఉందా అంటే అదీ లేదు. ఈ పేమెంట్స్ యాప్‌కు 70 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. వీరిలో సుమారు 30 కోట్ల మంది యాక్టివ్‌గా ఉంటున్నారు. దేశంలోని UPI పేమెంట్స్ మార్కెట్లో దాదాపు 45 శాతం వాటా PhonePeదే.
అంటే దేశంలో కోట్లాది మంది ప్రతిరోజూ ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ అదే యూజర్లను ఇన్వెస్టర్లుగా మార్చడంలో మాత్రం కంపెనీకి ఆశించిన విజయం దక్కడం లేదు. డబ్బులు పంపడానికి, బిల్లులు కట్టడానికి PhonePeపై నమ్మకం చూపిస్తున్నవాళ్లు.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఇతర ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటున్నారా? అన్న ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తోంది.
దీన్నే క్రాస్ సెల్లింగ్ సమస్య అంటారు. ఇప్పటికే తమ దగ్గర ఉన్న కస్టమర్లకు మరో ప్రొడక్ట్‌ను పరిచయం చేసి, దాన్ని కూడా ఉపయోగించేలా చేయడం. PhonePe దగ్గర కస్టమర్లు ఉన్నారు. మార్కెట్ కూడా ఉంది. కానీ ఆ రెండింటినీ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వృద్ధికి ఉపయోగించుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి.
Zerodha, Groww దగ్గర లేనిది కాదు.. PhonePe దగ్గరే లేనిదేంటి?
ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అంటే కేవలం ఒక యాప్ తయారు చేసి, అందులో Buy, Sell బటన్లు పెట్టేస్తే సరిపోదు. ఇక్కడ కస్టమర్లకు సమాచారం కావాలి. మార్కెట్‌పై అవగాహన కావాలి. తమ డబ్బును పెట్టుబడిగా పెట్టే ప్లాట్‌ఫామ్‌పై నమ్మకం కావాలి.
ఈ విషయంలో Zerodha, Groww, Dhan వంటి సంస్థలు ప్రత్యేకమైన పద్ధతిలో ముందుకెళ్తున్నాయి. ఉదాహరణకు Zerodha సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తరచూ స్టాక్ మార్కెట్, రిటైల్ ట్రేడింగ్, పెట్టుబడిదారుల ప్రవర్తన వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు.
Groww వ్యవస్థాపకుడు లలిత్ కేశ్రే, Dhan వ్యవస్థాపకుడు ప్రవీణ్ జాదవ్ కూడా తమ వ్యాపారానికి సంబంధించిన అంశాల్లో ముందుంటారు. అంటే వీళ్లు కేవలం యాప్‌ను ప్రమోట్ చేయడం లేదు. పెట్టుబడిదారులతో ఒక సంబంధాన్ని నిర్మిస్తున్నారు.
PhonePeలో మాత్రం ఈ విధమైన లోతైన ఇన్వెస్ట్మెంట్ కంటెంట్, యూజర్ ఎంగేజ్మెంట్, ప్రొడక్ట్ ఫోకస్ మరింత పెరగాల్సిన అవసరం ఉందని కంపెనీకి చెందిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అభిప్రాయపడ్డారు.
ఆయన చెప్పిన విషయానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ కూడా ఉంది. ఆయనతో The Ken మాట్లాడుతున్న సమయంలో ఫోన్‌కు Zerodha సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ నుంచి Substack నోటిఫికేషన్ వచ్చింది. రిటైల్ ఫ్యూచర్స్ ట్రేడర్లు నిజంగా ఎంత లాభపడుతున్నారు? అనే అంశంపై కామత్ రాసిన పోస్ట్ అది.
ఆ నోటిఫికేషనే ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని గుర్తుచేసిందట. Groww, Dhan వ్యవస్థాపకులు పెట్టుబడుల గురించి ముందుండి మాట్లాడుతుంటే, PhonePeలో అలాంటి చర్చలు, పెట్టుబడిదారుల ప్రవర్తనపై లోతైన విశ్లేషణలు కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
మార్కెటింగ్‌లో PhonePeకు మంచి పట్టుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్‌లో మార్కెటింగ్ ఒక్కటే గేమ్ ఛేంజర్ కాలేదు. ఇదే కంపెనీ ముందున్న అసలు సవాలు.
రూ.10కే ట్రేడింగ్.. అయినా ఎందుకు రావడం లేదు?
PhonePe Investలో కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌కు ఒక్కో ఆర్డర్‌పై కేవలం రూ.10 ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తోంది. ఇది Paytm Money, Dhan వంటి పోటీ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే దాదాపు 50 శాతం తక్కువ.
సాధారణంగా ఇంత తక్కువ బ్రోకరేజ్ ఉంటే ట్రేడర్లు క్యూ కట్టాలి కదా! కానీ అలా జరగడం లేదు. ఎందుకంటే ట్రేడింగ్ చేసే వాళ్లకు బ్రోకరేజ్ ఫీజు ఒక్కటే ముఖ్యం కాదు. మంచి టూల్స్, రీసెర్చ్ సమాచారం, సౌకర్యవంతమైన ట్రేడింగ్ అనుభవం, ఎక్కువ పెట్టుబడి ఆప్షన్లు కూడా కావాలి.
ఇక్కడే PhonePe Investకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు. MTF (Margin Trading Facility) సదుపాయం కూడా అందుబాటులో లేదు. దీంతో ఇతర ప్లాట్‌ఫామ్‌లలో లభించే కొన్ని సదుపాయాలు ఇక్కడ కనిపించడం లేదు.
అంటే తక్కువ ధరకు టికెట్ ఇచ్చినా, ప్రేక్షకులు కోరుకునే సినిమా మొత్తం చూపించలేకపోతే థియేటర్ నిండదు కదా! PhonePe పరిస్థితి కూడా కొంతవరకు ఇలాగే కనిపిస్తోంది.
కొత్త పేరు పెట్టుకుంది.. కానీ పాత సమస్యలు వెంటాడుతున్నాయా?
ఈ ఏడాది అక్టోబర్‌లో Share.Market పేరును మార్చి PhonePe Investగా రీబ్రాండింగ్ చేసింది. దీని వెనుక ఉన్న ఆలోచన స్పష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజల్లో బలమైన గుర్తింపు ఉన్న PhonePe బ్రాండ్‌ను ఉపయోగించుకుని ఇన్వెస్ట్మెంట్ వ్యాపారాన్ని మరింత విస్తరించడం.
కానీ పేరు మార్చడం కంటే ప్రొడక్ట్‌ను మార్చడం ముఖ్యం. యూజర్లకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వాలి. వాళ్లకు ఉపయోగపడే కంటెంట్ అందించాలి. ఇతర ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లకుండా ఇక్కడే కొనసాగించేలా చేయాలి.
ఇదిలా ఉంటే ఈ ఏడాది PhonePe Investకు చెందిన ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడటం కూడా చర్చనీయాంశమైంది. కంపెనీ అప్డేట్ చేసిన IPO పత్రాలను విడుదల చేసిన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రూ.2,800 కోట్ల నష్టాలు.. PhonePeకి మరో టెన్షన్!
ఇన్వెస్ట్మెంట్ బిజినెస్‌లో యూజర్లు తగ్గుతుండగా, కంపెనీకి ఇతర వ్యాపారాల నుంచి కూడా ఆర్థిక ఒత్తిడి ఎదురవుతోంది. Indus Appstore, Pincode వంటి అనుబంధ వ్యాపారాల్లో భారీ రైటాఫ్‌లు నమోదయ్యాయి.
The Ken కథనం ప్రకారం.. FY26లో PhonePe నష్టాలు 60 శాతానికి పైగా పెరిగి సుమారు రూ.2,800 కోట్లకు చేరాయి. అంటే ఒకవైపు కొత్త వ్యాపారాలను విస్తరించాలి. మరోవైపు వాటిపై పెట్టిన పెట్టుబడుల నుంచి ఫలితాలు సాధించాలి. ఇంకోవైపు పెరుగుతున్న నష్టాలను కూడా అదుపు చేయాలి. కంపెనీకి ఇది చిన్న సవాలేమీ కాదు.
అసలు సమస్య PhonePe బ్రాండ్‌లో ఉందా.. బిజినెస్ మోడల్లో ఉందా?
ఇక్కడ ఒక విషయం గమనించాలి. PhonePeను ప్రజలు పూర్తిగా నమ్మడం లేదని ఈ గణాంకాలు నిరూపించవు. పేమెంట్స్‌లో ఆ సంస్థకు ఉన్న ఆదరణ చూస్తే అలాంటి నిర్ణయానికి రావడం తొందరపాటే. కానీ పేమెంట్స్ కోసం ఏర్పడిన నమ్మకాన్ని పెట్టుబడుల వ్యాపారంలోకి మార్చడం అంత సులభం కాదని మాత్రం ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
ఎందుకంటే UPIలో యూజర్‌కు కావాల్సింది వేగం, సౌకర్యం. స్టాక్ మార్కెట్లో మాత్రం తన డబ్బును ఎక్కడ పెట్టాలి? ఎంత రిస్క్ తీసుకోవాలి? ఏ కంపెనీ షేర్లు కొనాలి? మార్కెట్ పడిపోయినప్పుడు ఏం చేయాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు ఇచ్చేంత నమ్మకాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ సంపాదించాలి.
PhonePe దగ్గర ఇప్పటికే కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. బ్రాండ్ గుర్తింపు ఉంది. మార్కెటింగ్ సామర్థ్యం ఉంది. అయినప్పటికీ ట్రేడింగ్ యాప్‌లో 40 శాతం మంది యాక్టివ్ యూజర్లు తగ్గిపోయారు.
ఇప్పుడు PhonePe ముందున్న అసలైన ప్రశ్న ఒక్కటే.. జనం కొత్త పేరు చూసి యాప్‌లోకి వస్తారా? లేక తమ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించేటప్పుడు పాత నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌ల వైపే వెళ్తారా? పేమెంట్స్‌లో కింగ్‌గా ఉన్న PhonePe.. ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనూ అదే మ్యాజిక్ చూపించగలదా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల







