రామాయణం’ టికెట్ ధరల్లో తెలుగు రాష్ట్రాల రికార్డ్.. దేశంలోనే లీస్ట్! ఎంతో తెలుసా?
ఢిల్లీ, ముంబైలో టికెట్ ధరలు ఆకాశంలో ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సగం కంటే తక్కువ! రామాయణం సినిమా టికెట్ల విషయంలో ఏపీ, తెలంగాణ సృష్టిస్తున్న ఈ రికార్డు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సినిమా టికెట్ కొనాలంటేనే జేబులో ఎంత డబ్బు ఉందో చూసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలంటే టికెట్ రేట్లు కూడా భారీగానే ఉంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ రణబీర్ కపూర్, సాయి పల్లవి నటించిన భారీ చిత్రం రామాయణం విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. దేశంలో చాలాచోట్ల ఈ సినిమా టికెట్లు కొనాలంటే వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా తక్కువ ధరకే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత చౌకగా టికెట్లు విక్రయిస్తున్న రాష్ట్రంగా నిలిచింది.
ఏపీలో రూ.199.. ఢిల్లీలో రూ.791! ఇదెక్కడి తేడా?
రామాయణం ఓపెనింగ్ డే అడ్వాన్స్ బుకింగ్స్ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా సగటు టికెట్ ధర (Average Ticket Price) కేవలం రూ.199 మాత్రమే. దేశవ్యాప్తంగా ఈ సినిమా సగటు టికెట్ ధర సుమారు రూ.457గా ఉంది. అంటే దేశ సగటు ధరతో పోలిస్తే ఏపీలో టికెట్ ధర సగం కంటే కూడా తక్కువగా ఉందన్నమాట.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి చూస్తే అసలు షాక్ అవ్వాల్సిందే. అక్కడ సగటు టికెట్ ధర ఏకంగా రూ.791గా ఉంది. అంటే ఢిల్లీలో ఒక టికెట్ కొనడానికి పెట్టే డబ్బుతో ఏపీలో దాదాపు నాలుగు టికెట్లు కొనేయొచ్చు.
తెలంగాణలోనూ తక్కువ ధరకే టికెట్లు
ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ కూడా తక్కువ టికెట్ ధరలు ఉన్న మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ రామాయణం సగటు టికెట్ ధర రూ.281గా ఉంది. ప్రధాన రాష్ట్రాల మార్కెట్లలో తమిళనాడు (రూ.230) తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది.
రామాయణం టికెట్ల సగటు ధరలు ఇలా ఉన్నాయి:
– ఆంధ్రప్రదేశ్ – రూ.199
– తమిళనాడు – రూ.230
– తెలంగాణ – రూ.281
– కేరళ – రూ.366
– ఒడిశా – రూ.369
మరోవైపు అత్యధిక టికెట్ ధరలు ఉన్న రాష్ట్రాలు చూస్తే..
– ఢిల్లీ – రూ.791
– హర్యానా – రూ.596
– మహారాష్ట్ర – రూ.594
– కర్ణాటక – రూ.536
– ఉత్తరప్రదేశ్ – రూ.483
ఈ లెక్కలు చూస్తుంటే సినిమా ఒకటే అయినా ప్రేక్షకులు చెల్లించే డబ్బులో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
టికెట్ ధర తక్కువే.. కానీ బుకింగ్స్ మాత్రం అదుర్స్!
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని తెలుగు రాష్ట్రాల్లో సినిమా క్రేజ్ కూడా తక్కువగా ఉందనుకుంటే పొరపాటే. తెలంగాణలోనే ఓపెనింగ్ డే కోసం ఇప్పటికే 57 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా అత్యధిక టికెట్లు అమ్ముడైన మార్కెట్లలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర మాత్రమే తెలంగాణ కంటే ముందున్నాయి.
అంతేకాదు, తెలంగాణలో ఆక్యుపెన్సీ 28.2 శాతంగా నమోదైంది. ప్రధాన మార్కెట్లలో ఇదే అత్యధిక ఆక్యుపెన్సీ కావడం మరో విశేషం. అంటే టికెట్ ధరలు తక్కువగా ఉన్నా ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం గట్టిగానే ఉందన్నమాట.
అసలు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఎందుకింత తక్కువ?
దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాల టికెట్ ధరల నియంత్రణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వ నిబంధనలు అమల్లో ఉంటాయి. భారీ సినిమాలకు కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రత్యేక ధరల పెంపునకు అనుమతులు లభిస్తాయి. రామాయణం విషయంలో ప్రస్తుతం సాధారణ టికెట్ ధరలే అమల్లో ఉండటంతో సగటు ధర తక్కువగా నమోదవుతోంది.
అదే ఢిల్లీ, మహారాష్ట్ర వంటి మార్కెట్లలో మల్టీప్లెక్స్ టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ సగటు ధర కూడా భారీగా కనిపిస్తోంది.
రామాయణం ఓపెనింగ్ డే బుకింగ్స్ ఎలా ఉన్నాయి?
నవంబర్ 1 నాటికి అందుబాటులో ఉన్న అడ్వాన్స్ బుకింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
– మొత్తం గ్రాస్ బుకింగ్స్: రూ.24.09 కోట్లు
– అమ్ముడైన టికెట్లు: 5,26,760
– మొత్తం షోలు: 14,615
నవంబర్ 5న థియేటర్లలో విడుదల కానున్న రామాయణం కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇక్కడ అసలు ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. టికెట్ ధరలు పెడితేనే భారీ వసూళ్లు వస్తాయని కాదు. అందుబాటు ధరల్లో టికెట్లు ఉంటే ప్రేక్షకులు ఎంతగా థియేటర్లకు వస్తారో తెలంగాణ ఆక్యుపెన్సీ లెక్కలు చెబుతున్నాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







