విశ్వక్ కు మరో భారీ షాక్..
యంగ్ హీరో విశ్వక్ సేన్(viswaksen)కు గత కొంతకాలంగా సరైన సక్సెస్‌లు దక్కడం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆయనకు లైలా(Laila) సినిమా మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో నటుడిగానే కాకుండా డైరెక్టర్ గానూ తన లక్ ను పరీక్షించుకునేందుకు కల్ట్(Cult) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త స్లాషర్ జానర్‌ను పరిచయం చేస్తున్నానంటూ సినిమా ప్రమోషన్లలో విశ్వక్ ఎంతో నమ్మకంగా మాట్లాడారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. అయితే రిలీజ్‌కు ముందు కనిపించిన అంచనాలు, ప్రచారానికి థియేటర్లలో మాత్రం ఆశించిన రెస్పాన్స్ లభించలేదు.
ఫస్ట్ డే నుంచే కల్ట్ బాక్సాఫీస్ వద్ద నిరాశాజనకమైన కలెక్షన్లను నమోదు చేసింది. వీకెండ్లోనైనా సినిమా పుంజుకుంటుందని ఆశించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశ్వక్ కెరీర్లోనే భారీ ఫ్లాపుగా నిలిచిన లైలా సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను కూడా కల్ట్ అధిగమించలేకపోయిందని ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో ఈ సినిమా రిజల్ట్ విశ్వక్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. డైరెక్టర్ గా, హీరోగా రెండు బాధ్యతలు తీసుకున్న ఆయనకు ఈసారి కూడా ఆశించిన ఫలితం దక్కలేదు.
మరోవైపు సినిమాపై విశ్వక్ వ్యక్తం చేసిన ఆత్మవిశ్వాసానికి, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. వరుస ఫ్లాపుల ప్రభావం ఆయన మార్కెట్‌పై పడుతోందనే సంకేతాలు ఈ కలెక్షన్లతో స్పష్టమవుతున్నాయి. ఇకపై కథల ఎంపిక, సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం విశ్వక్పై ఉంది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ తరుణ్ భాస్కర్(Tharun Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? రిపీట్(ENE repeat) సినిమాపైనే ఉన్నాయి. నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా విశ్వక్‌కు తిరిగి సక్సెస్‌ను అందిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.







