సీఎంచంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ..!
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన ‘అర్నబ్’ తుపాను సృష్టించిన బీభత్సం, తదనంతర నష్టాలపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో(Chandrababu Naidu) కేంద్ర ఉన్నతాధికారుల బృందం కీలక భేటీ నిర్వహించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించిన అనంతరం, ఈ బృందం ముఖ్యమంత్రితో సమావేశమై నష్టాల తీవ్రతపై చర్చించింది. ‘అర్నబ్’ తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ. 4,600 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించింది.
కేంద్ర హోంశాఖ, వ్యవసాయం, జలవనరులు, జాతీయ రహదారులు, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన ఈ కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతిన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ బృందం పర్యటించి, నష్టపోయిన పంటలను, దెబ్బతిన్న ఇళ్లను మరియు రహదారులను స్వయంగా పరిశీలించింది. ఈ సందర్భంగా పలు ఫోటోలను కూడా సేకరించారు అధికారు.
ఇవి కూడా చదవండి
ఇక ఈ క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన తక్షణ సాయం మరియు శాశ్వత పునరావాస ప్యాకేజీలపై చంద్రబాబు నాయుడు చర్చించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఉదారంగా నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు. కేంద్ర బృందం తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఏపీకి అందే తుపాను సహాయక నిధులపై పూర్తి స్పష్టత రానుంది.







