‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ : బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత దూరం?
‘ఆదర్శ కుటుంబం’ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ ఒకవైపు.. త్రివిక్రమ్‌కు ఉన్న కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రాండ్ మరోవైపు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే సహజంగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. అందుకే ‘ఆదర్శ కుటుంబం’పై విడుదలకు ముందే మంచి బజ్ నెలకొంది. చాలా కాలం తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రావడంతో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. మరి ఇంతటి క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంది? తొలి వీకెండ్లో ఎంత వసూలు చేసింది? బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఇంకా ఎంత దూరంలో ఉంది?
క్రేజీ కాంబో.. కానీ ఓపెనింగ్స్ దగ్గరే ట్విస్ట్!
రిలీజ్ కు ముందు ఉన్న హైప్ చూస్తే ‘ఆదర్శ కుటుంబం’కు బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత లెక్కలు కొంచెం తేడా కొట్టాయి. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఉండాల్సిన రేంజ్లో మొదటి రోజు వసూళ్లు నమోదు కాలేదు. సినిమా కామెడీ గా బాగుంది అన్నా, సెకండాఫ్ తేడా కొట్టిందని, త్రివిక్రమ్ స్దాయిలో లేదని రివ్యూలు, వార్తలు వచ్చాయి.
అయితే సినిమా కథ ఇక్కడితో అయిపోలేదు. మొదటి రోజు కలెక్షన్లు నిరాశపరిచినా, తర్వాతి రెండు రోజుల్లో వసూళ్లు క్రమంగా పెరిగాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
ఫస్ట్ వీకెండ్లో రూ.51.5 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంత వచ్చాయంటే?
తొలి మూడు రోజుల్లో ‘ఆదర్శ కుటుంబం’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.51.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటానే ఎక్కువగా ఉంది. ఓవర్సీస్ మార్కెట్ కూడా సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
ప్రాంతాలవారీగా తొలి వీకెండ్ వసూళ్లు (గ్రాస్):
ప్రాంతం కలెక్షన్లు
ఏపీ, తెలంగాణ రూ.31 కోట్లు+
కర్ణాటక రూ.4.75 కోట్లు
మిగతా భారతదేశం రూ.1.75 కోట్లు
ఇండియా మొత్తం రూ.37.5 కోట్లు
ఓవర్సీస్ రూ.14 కోట్లు
వరల్డ్‌వైడ్ రూ.51.5 కోట్లు
ఇవి ట్రేడ్ వర్గాల అంచనా వసూళ్లు.
అసలు సర్ప్రైజ్ ఇదే.. !
సినిమా బాక్సాఫీస్ రిపోర్టులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి. అంటే Day 1 కంటే Day 2, Day 2 కంటే Day 3 మెరుగ్గా ఉన్నాయి.
సాధారణంగా ఇలాంటి ట్రెండ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ వస్తున్నప్పుడు కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వీకెండ్లో థియేటర్లకు రావడం సినిమాకు కలిసొచ్చినట్లు కనిపిస్తోంది.
అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కలెక్షన్లు పెరుగుతున్నాయన్నది పాజిటివ్ పాయింటే. కానీ అవి సినిమా పెట్టుకున్న భారీ టార్గెట్‌ను అందుకునేంత వేగంతో పెరుగుతున్నాయా? అన్నదే అసలు ప్రశ్న.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.125 కోట్లు.. ఇంకా ఎంత రావాలి?
‘ఆదర్శ కుటుంబం’ ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.125 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ అంచనా. కానీ తొలి వీకెండ్ ముగిసే సమయానికి వచ్చిన వసూళ్లు రూ.51.5 కోట్లు మాత్రమే.
అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో ఇప్పటివరకు దాదాపు 41 శాతం మాత్రమే రికవరీ అయింది. ఇంకా రూ.73.5 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది.
ఒక్కసారి లెక్కలు చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. వీకెండ్లోనే రూ.70 కోట్ల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తే, వచ్చిన వసూళ్లు రూ.51.5 కోట్లు. అంటే అనుకున్న దానికంటే దాదాపు రూ.18.5 కోట్లు తక్కువ.
దీపావళి సెలవులు ఆదుకుంటాయా? అసలు పరీక్ష ఇప్పుడే!
ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం నుంచి గురువారం వరకూ చాలా కీలకం. సోమవారం నుంచి కలెక్షన్లు ఎంతవరకు నిలబడతాయన్నదే సినిమా భవిష్యత్తును నిర్ణయించనుంది. రోజురోజుకీ పెరుగుతున్న వసూళ్ల ట్రెండ్ కొనసాగితే కొంత ఊరట లభిస్తుంది. ఇక దీపావళి పండుగ సెలవులు కూడా సినిమాకు అదనపు బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
కానీ పోటీని కూడా తక్కువ అంచనా వేయలేం. నవంబర్ 5న ‘రామాయణ’, నవంబర్ 6న సూర్య నటించిన ‘సీన్’ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. దీంతో స్క్రీన్ల విషయంలోనూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విషయంలోనూ ‘ఆదర్శ కుటుంబం’కు పోటీ తప్పదు.
క్రేజ్ ఉంది.. మౌత్ టాక్ కూడా కలిసొస్తోంది.. మరి టార్గెట్ సంగతేంటి?
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్… మొదటి నుంచీ ప్లస్ పాయింట్. వీకెండ్లో కలెక్షన్లు పెరగడం మరో సానుకూల సంకేతం. కానీ రూ.125 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ముందు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ ఇప్పుడు నిలకడైన వసూళ్లతో తన సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి. దీపావళి సెలవులు ఈ సినిమాకు బాక్సాఫీస్ బూస్ట్ ఇస్తాయా? లేక కొత్త సినిమాల పోటీతో కలెక్షన్ల జోరు తగ్గుతుందా? రాబోయే రోజుల్లో తేలిపోనుంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








