కేసీఆర్ వస్తేనే రైతన్నకు భరోసా: కేటీఆర్
ఆదిలాబాద్ వేదికగా జరిగిన రైతు గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 13 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఏమాత్రం మేలు చేయలేదని ధ్వజమెత్తారు. కేవలం జుమ్లా, హమ్లా చేయడమే ఆయన నైజమని విమర్శించారు. దేశంలో అమలవుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ విధానం రైతులను, రాష్ట్రాన్ని పూర్తిగా దెబ్బతీసిందని మండిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లాకు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయని ఘనత ప్రధాని మోదీదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పరిశ్రమలను, వనరులను గుజరాత్‌కు తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ‘బడే భాయ్ – చోటే భాయ్’లా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని నిలువునా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేపై కూడా అవినీతి ఆరోపణలు గుప్పించారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్‌ను పునరుద్ధరించకుండా స్క్రాప్‌గా అమ్మేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరానికి రూ. 60,000 ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక రూ. 15,000 బకాయిలను నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాల వల్ల రాష్ట్రంలో కృత్రిమ కరవు పరిస్థితులు తలెత్తాయని, కేసీఆర్‌ను బద్నామ్ చేయాలన్న దురుద్దేశంతోనే గోదావరి జలాలను వృథా చేశారని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణలో నీటి పారుదల రంగాన్ని, విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టించిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఏడుగురు శిశువుల మృతి ఘటనపై స్పందిస్తూ, ప్రభుత్వం చెబుతున్న బ్రిటిష్ కాలపు ఎలుకలు కొరికాయన్న కుంటిసాకులను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి హాస్యాస్పదమైన ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, కేవలం ఒక్క ఏడాది పాటు ఓపిక పట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని, రైతన్నల కష్టాలను తీర్చేందుకు కేసీఆర్ పాలన మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, కాంగ్రెస్, బీజేపీల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.








