తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. న్యాయమూర్తులకు
తెలంగాణలో న్యాయమూర్తుల (judges)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్) చట్టం–1984కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు, తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఫుల్ కోర్టు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సవరణతో తెలంగాణ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్, జ్యుడీషియల్ సర్వీస్ అధికారుల పదవీ విరమణ వయసు 61 నుంచి 62 ఏళ్లకు పెరగనుంది. దీంతో అర్హులైన న్యాయాధికారులు మరో ఏడాది పాటు తమ విధుల్లో కొనసాగేందుకు అవకాశం లభిస్తుంది. న్యాయవ్యవస్థలో అనుభవజ్ఞులైన అధికారుల సేవలను మరింతకాలం వినియోగించుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశంగా భావిస్తున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఈ సవరణ 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. అంటే ఆ తేదీన లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన అర్హులైన న్యాయాధికారులకు తిరిగి విధుల్లో చేరే అవకాశం కల్పించారు. అయితే ఇందుకు సంబంధించిన అర్హతలు, ఇతర నిబంధనలు ఆర్డినెన్స్ (Ordinance)లో పేర్కొన్న విధంగా వర్తిస్తాయి.








