మోదీని గద్దె దించేంచుకు వానరసేన సిద్ధం : రేవంత్ రెడ్డి
దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేంద్రం భారీ కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. ఇది మునుపెన్నడూ లేని విధంగా ఓటర్ల హక్కులకు దూరం చేసే కుతంత్రమని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే సుమారు 13.5 కోట్ల ఓట్లు తొలగించారని, రాబోయే రోజుల్లో మరో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు ఈసీ ద్వారా కేంద్రం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోని మొత్తం ఓటర్లలో 15 నుండి 20 శాతం మందిని టార్గెట్ చేసి, వారి ఓటు హక్కును కాలరాసేందుకు బీజేపీ వ్యూహరచన చేసిందని ధ్వజమెత్తారు. బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇదే తరహా వ్యూహాలతో బీజేపీ లబ్ధి పొందిందని, ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అదే పద్ధతిని పునరావృతం చేస్తోందన్నారు. సొంతంగానే మెజారిటీ సాధించాలని చూస్తోందని ఆయన విమర్శించారు.
ఇవి కూడా చదవండి
2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి 400 సీట్ల మెజారిటీని కట్టబెట్టేందుకు నిరాకరించారన్న అక్కసుతోనే ప్రధాని నరేంద్ర మోదీ అట్టడుగు వర్గాలపై కక్ష కట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకవేళ ఆనాడు అనుకున్న విధంగా మెజారిటీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లను రద్దు చేయాలని చూశారని, ఆ కుట్రను ప్రజలు తిప్పికొట్టడంతోనే ఇప్పుడు ఓటర్ల తొలగింపునకు పాల్పడుతున్నారని విమర్శించారు. దళితులు, ఆదివాసీలు, మహిళలు, ఇతర వెనుకబడిన వర్గాలే లక్ష్యంగా ఈ ఓట్ల తొలగింపు యత్నాలు సాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ వేదికగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. రామాయణంలో రావణాసురుడిని ఓడించడానికి రాముడికి వానర సేన ఏ విధంగా సహాయపడిందో, అదే స్ఫూర్తితో మోదీ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ నుండి ‘వానర సేన’ రూపంలో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి తరలివచ్చాయని ఆయన అభివర్ణించారు.
కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా, తెలంగాణ నుంచి ర్యాలీకి తరలిరాకుండా రైళ్లను రద్దు చేసినా, వేలాది మంది కార్యకర్తలు లెక్కచేయకుండా రాజధాని బాట పట్టారని రేవంత్ తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లు ఏకమైనా కాంగ్రెస్ శ్రేణుల సంకల్పాన్ని ఎవరూ బలహీనపరచలేరని స్పష్టం చేశారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామగ్రామాన ప్రజలను చైతన్యం చేయాలని, రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.








